breaking news
financial bid
-
క్వింటాల్ ధాన్యం సగటున రూ.1,685
సాక్షి, హైదరాబాద్: మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం విక్రయానికి మరో అడుగు ముందుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా మిల్లుల్లోని 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించేందుకు ఆన్లైన్లో గత నెలలో గ్లోబల్ టెండర్లు ఆహ్వానించగా, 11 సంస్థలు 54 బిడ్స్ దాఖలు చేశాయి. ఈనెల 14న టెక్నికల్ బిడ్స్ తెరిచిన పౌరసరఫరాల సంస్థ ఈ 11 సంస్థల్లో హరియాణాకు చెందిన గురునానక్ రైస్ అండ్ జనరల్ మిల్స్ కంపెనీ బిడ్‌ను తిరస్కరించింది. మిగతా అర్హత పొందిన 10 సంస్థలకు సంబంధించి శనివారం ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచారు. ఇందులో క్వింటాల్ ధాన్యానికి కనిష్టంగా రూ.1,618, గరిష్టంగా రూ.1,732 కింద బిడ్స్ వేసిన 10 సంస్థలకు 25 లాట్లు అప్పగించారు. మొత్తం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సగటున రూ.1,685 లెక్కన విక్రయించారు. నష్టం క్వింటాల్‌కు రూ. 375 రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో క్వింటాల్ ధాన్యాన్ని గరిష్ట మద్దతు ధర (ఎంఎస్పీ) రూ.2,060 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసింది. యాసంగిలో మొత్తంగా 66.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వ ఉంచింది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల నూకల శాతం ఎక్కువగా వస్తుందని మిల్లర్లు సీఎంఆర్‌కు నిరాకరించారు. దీంతో ఈ ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్లు ఆహ్వానించింది. ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే వచ్చే నూకలకు నష్టపరిహారంగా క్వింటాల్ ధాన్యానికి రూ. 280 వరకు కేంద్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చినా, మిల్లర్లు ససేమిరా అనడంతో తప్పక విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సగటున ధాన్యం క్వింటాల్‌కు రూ.1,800 వరకు విక్రయించేందుకు బిడ్స్ వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తర్వాత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సగటున క్వింటాల్‌కు రూ. 1,685 మాత్రమే బిడ్స్ ఫైనల్ అయ్యాయి. అంటే ఎంఎస్పీ రూ.2,060తో పోలిస్తే క్వింటాల్‌కు రూ. 375 ప్రభుత్వానికి నష్టం. అంటే ఒక మెట్రిక్ టన్నుకు రూ. 37 కోట్ల చొప్పున 25 ఎల్ఎంటీకి రూ. 925 కోట్ల నష్టం. కాగా ఈ ఫైనాన్షియల్ బిడ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ ఆమోదించాల్సి ఉంది. 25 లాట్లు దక్కించుకున్న 10 సంస్థలు ఇవే కేంద్రీయబండార్, సామ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, పట్టాబి ఆగ్రోఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్‌ఫుడ్ ఇండస్ట్రీ లిమిటెడ్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్ అండ్ రిటేనింగ్ కోఆపరేటివ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నోచా ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, బగదీయ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిద్దరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీలలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, శంభుదయాల్ జైన్ అండ్ కంపెనీ. -
గ్రీన్హౌస్ కంపెనీల అత్యాశ
* చదరపు మీటరుకు ప్రభుత్వం నిర్ణయించిన రేటు రూ. 700 * కంపెనీల బిడ్డింగ్‌లో కనిష్ట ధర రూ. 840, గరిష్టం రూ. 1260 సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక బిడ్ వివరాలు వెల్లడయ్యాయి. టెండర్లలో పాల్గొన్న కంపెనీలు ప్రభుత్వ నిర్ణీత ధరకు మించి కోట్ చేశాయి. దీంతో ఆయా కంపెనీ ప్రతినిధులతో ఐదో తేదీన చర్చలు జరిపి తుది నిర్ణయానికి రావాలని సాంకేతిక కమిటీ నిర్ణయించింది. కోట్ చేసిన ధరలను తగ్గించేలా రాజీ చేసుకుని సర్కారు మార్గదర్శకాల ప్రకారం అర్హత గల కంపెనీల జాబితాను కమిటీ తయారు చేయనుంది. తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. అనంతరం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. నిజానికి గ్రీన్హౌస్ నిర్మాణానికి ఒక్కో చదరపు మీటరుకు రూ. 700 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఎకరా స్థలంలో 4 వేల చదరపు మీటర్ల పరిధిలో నిర్మాణాన్ని చేపడితే అందుక య్యే వ్యయం రూ. 28 లక్షలు. ఇందులో 75 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. మిగిలిన ఖర్చును రైతు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విత్తనాలు, భూమి చదును, ఇతరత్రా నిర్వహణ కోసం చదరపు మీటరుకు రూ. 140 ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇందులోనూ రైతుకు 75 శాతం సబ్సిడీ లభిస్తుంది. అయితే తాజాగా కంపెనీలు గ్రీన్‌హౌస్‌ల నిర్మాణానికి ఎక్కువ ధరను కోట్ చేశాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక్కో చదరపు మీటరుకు ఇండియన్ గ్రీన్హౌస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 935, నోయిడాకు చెందిన జెస్తా డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ. 840, హైదరాబాద్‌కు చెందిన భానోదయం ఇండస్ట్రీస్ కంపెనీ రూ. 1044, శ్రీసాయి ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 1260, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ. 1244, హైతాసు కార్పొరేషన్ రూ. 991, తమిళనాడుకు చెందిన అగ్రిఫ్లాస్ట్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 844, మహారాష్ట్రకు చెందిన సన్మార్గ్ ఆగ్రో సర్వీసెస్ రూ. 1035గా ధరలను కోట్ చేశాయి. తుది ధర ఎంతైనా సర్కారు మాత్రం ఒక్కో చదరపు మీటరుకు ఇప్పటికే నిర్దేశించిన మేరకు రూ. 700 ధర ప్రకారమే 75 శాతం సబ్సిడీ ఇస్తుందని, మిగిలిన సొమ్మును రైతులే భరించాలని చెబుతున్నారు. రైతులు తమకు ఇష్టమైన కంపెనీని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తామంటున్నారు.