ఆర్థికమంత్రి అవినీతిపై సీబీఐ విచారణ కోరరేం?
కేరళ ఆర్థికమంత్రి కేఎం మణి అవినీతిపై సీబీఐ విచారణ కోరరెందుకని సీపీఎం రాష్ట్ర నాయకత్వంపై సీనియర్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్ మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్కు ఆయనో లేఖ రాశారు. మణి మీద సీబీఐ విచారణ కోరేందుకు పార్టీలో ఏ కమిటీ వ్యతిరేకంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని 418 బార్లను తెరిపించాలంటే 5 కోట్లు ఇవ్వాలని అడిగిన ఆర్థికమంత్రి మణి, కోటి రూపాయలు తీసుకున్నట్లు ఓ బార్ యజమాని ఆరోపించిన విషయం తెలిసిందే. అప్పటినుంచే మణి రాజీనామా చేయాలని అచ్యుతానందన్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించాలని కూడా అడుగుతున్నారు. అయితే, ఈ విషయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పినరయి విజయన్ లాంటి వాళ్లు ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటున్నారు. దాంతో అచ్యుతానందన్ మండిపడుతున్నారు.