breaking news
EPTRI
-
ఎలక్ట్రానిక్వ్యర్థాల నిర్వహణకు ఓ లెక్కుంది
ఎల్రక్టానిక్ వ్యర్థాల నిర్వహణ అనేది సవాళ్లతో కూడుకున్నదిగా మారుతోంది. ఈ–వ్యర్థాల పట్ల అవగాహన, చైతన్యం తగినంతగా లేకపోవడం..దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలు తగినంతగా అందుబాటులోకి రాకపోవడం, వీటి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నియమ నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవడం పెనుసమస్యగా అవతరించింది. ఇవన్నీ కలగలిసి ఈ–వ్యర్థాలను సరైన పద్ధతుల్లో తొలగించకపోవడం వంటి కారణాలతో పర్యావరణానికి నష్టం చేస్తున్నాయి. 2021–22లోనే తెలంగాణలో 50,335.6 టన్నుల ఈ–వ్యర్థాలు ఉత్పత్తి కాగా, వాటిలో 42,297 టన్నులు మాత్రమే సరైన పద్ధతుల్లో తొలగించారని పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) గతంలోనే వెల్లడించింది. అయితే వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాల వినియోగదారులతోపాటు సాధారణ ప్రజల్లోనూ బాధ్యతాయుతంగా ‘ఎల్రక్టానిక్ వేస్ట్ డిస్పోజల్’విషయంలో సరైన అవగాహన, చైతన్యం లేదని పలు సందర్భాల్లో వెల్లడైంది. ఇళ్లలోనూ నిరుపయోగంగా మారుతున్న వివిధ ఎల్రక్టానిక్ వస్తువుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. చార్జర్లు, వైర్లతో కూడిన ఇయర్ఫోన్లు, స్పీకర్లు, ఎలక్ట్రిక్ కెటిళ్లు, కుక్కర్లు, ఇతర పరికరాలు, వస్తువులు పోగుపడుతున్నాయి. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఎల్ఈడీ టీవీలు, ఇతర వస్తువులు పాడైతే స్థానికంగా అమ్మేయడమో లేక పాతపేపర్లు, పాతసామాన్లు అమ్మే షాపుల వారికి ఇచ్చేయడమో అధికంగా జరుగుతున్నాయి. అయితే ఈ వస్తువులను చివరకు సురక్షితంగా ఏ విధమైన పద్ధతుల్లో డిస్పోజ్ చేస్తున్నారనే విషయంలో మాత్రం స్పష్టత ఉండడం లేదు. – సాక్షి,హైదరాబాద్ సమగ్ర అధ్యయనంపై దృష్టి రాష్ట్రంలో ఈ–వేస్ట్ ఏయే రూపాల్లో ఎంతెంత పరిమాణంలో పోగుపడుతున్నదనే విషయంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ–వేస్ట్ ఇన్వెంటొరైజేషన్ను చేపట్టి ఈ వ్యర్థాలు ఎక్కువగా ఎక్కడ, ఏ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయి ? వాటి పరిమాణం ఎంత ? ప్రస్తుతం వాటిని ఏయే రూపాల్లో సేకరించి, సురక్షితంగా తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలు తదితరాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు, 2022లో ఏఏ అంశాలను పొందుపరిచారు, ఆయా విషయాలను ఏ మేరకు వ్యర్థాల నియంత్రణ, నిర్వహణలో అనుసరిస్తున్నారనే దానిపై అధ్యయనం చేయనున్నారు. ఈ–వ్యర్థాలకు సంబంధించి సేకరించే సమాచారం, వివరాల ఆధారంగా...ఎల్రక్టానిక్ వస్తువుల సేకరణ, మెటీరియల్ రికవరీ, వీటి ద్వారా ఈ–వేస్ట్ మేనేజ్మెంట్లో ఉపాధి అవకాశాల కల్పనతో ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలిచేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టి సారించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలనేది ఎక్కడెక్కడ ఉత్పత్తి అవుతున్నాయో ట్రాక్ చేయడంతోపాటు ఆయా వస్తువులు, పరికరాలకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలుసుకొని అక్రమ డంపింగ్‌ను నిరోధించడంతోపాటు కచ్చితమైన విధానాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా సంస్థల సేవలు వినియోగించుకునే దిశగా టీపీసీబీ జాతీయస్థాయిలో పేరొందిన కన్సల్టెన్సీ సంస్థలు, విద్యాసంస్థలు, పరిశోధక సంస్థల సేవలను టీపీసీబీ ఉపయోగించుకోనున్నట్టు సమాచారం. మొత్తం 150 రోజుల్లో ఈ అధ్యయ నాన్ని పూర్తిచేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రటిక్ ఎక్విప్మెంట్ (ఈఈ ఈ) కేట గిరీలో ఎంత స్థాయిలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయో అంచనా వేస్తారు. ఇందుకోసం ఎంపిక చేసిన సంస్థ, ఉత్పత్తిదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రీసైకిల్ చేసేవారు, వేర్వేరు పద్ధతులు, మార్గాల్లో వ్యర్థాలను సేకరించే వారి వివరాలను తీసుకుంటారు.వీరి నుంచి ఈ–వేస్ట్ ఉత్పత్తి అవుతున్న తీరు, పరిమాణం, వాటిని తొలగిస్తున్న తీరు, వీటి నిర్వహణలో ఎదురవుతున్న అంతరాలు, సమస్యలు వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ సంస్థలు సేకరిస్తాయి. అనంతరం ఆయా సమస్యలు, అంతరాలను అధిగమించేందుకు పలు సూచనలు, సలహాలతో సిఫార్సులు చేస్తారు. ఈ అధ్యయనంలో భాగంగా సవివర ఇన్వెంటరీ ద్వారా ‘వేస్ట్ ఫ్రం ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ ఎక్విప్మెంట్ (డబ్ల్యూఈఈఈ) బిజినెస్ చెయిన్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సలహాలు ఇవ్వనుంది. స్టేక్ హోల్డర్స్ గ్రూపులు ఇలా...ప్రొడ్యూసర్స్, సెల్లర్స్: దిగుమతిదారులు, తయారీదారులు, సరఫరాదారులు, వ్యాపారులు, రిటైల్, డీలర్లు వినియోగదారులు: కుటుంబాలు, వ్యాపార సంస్థలు, ఐటీ కంపెనీలు, బీపీవోలు, విద్యాసంస్థలు, రైల్వే, ఎయిర్‌లైన్స్, డిఫెన్స్, రవాణా కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగసంస్థలు కలెక్ట్ చేసేవారు: ఈ–వేస్ట్‌ను సేకరించే స్క్రాప్ డీలర్లు, మాల్స్, ఇతర ప్రైవేట్ సంస్థలు రీసైక్లర్స్: డిసెంబ్లర్స్, డిస్మాంట్లర్స్, మెటీరియల్ రికవరీ యూనిట్లు ఇతర వర్గాలవారు: రోడ్డు పక్క విక్రేతలు, అధికారిక, అనధికారిక వేలం పాటలు పాడేవారు, సెకండ్ హ్యాండ్ ఎల్రక్టానిక్ వస్తువులు అమ్మేవారు -
‘కాళేశ్వరం’ అనుమతుల్లో వేగం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), పర్యావరణ అనుమతులను వీలైనంత వేగంగా సాధించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇందుకుగానూ సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ జీఎస్ ఝాను ప్రాజెక్టు సేవలకు వాడుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు జీఎస్ ఝా పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఆయన ఢిల్లీలోనే అందుబాటులో ఉండి ప్రాజెక్టుకు అవసరమైన అనుమతల విషయంలో తోడ్పాటు అందిస్తారని ప్రభుత్వానికి వివరించింది. సీడబ్ల్యూసీనే కీలకం..: ప్రాజెక్టుకు సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వడంలో సీడబ్ల్యూసీ పాత్ర కీలకం. దీంతో పాటే జాతీయ హోదా దక్కాలన్నా 18 రకాల కేంద్ర డైరెక్టరేట్ల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసిన డీపీఆర్‌లో నీటి లభ్యత(హైడ్రాలజీ), నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలు, ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణ ప్రణాళిక, అంచనాలు, ఆర్థిక మదింపు, పర్యావరణ ప్రభావ మదింపు, అటవీ అవసరాలు వంటి అంశాలపై వేర్వేరుగా అధ్యయనం చేసిన నివేదికలు పొందుపరచాల్సి ఉంటుంది. ఈ అంశాలను పొందుపరిచిన డీపీఆర్‌తో సీడబ్ల్యూసీని సంప్రదిస్తే, వారు అవసరమైన మార్పులు, చేర్పులు సూచిస్తారు. ఆ మార్పులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ డీపీఆర్‌లలో పొందుపరిచి తుది డీపీఆర్‌ని సీడబ్ల్యూసీకి ఇవ్వాలి. తుది డీపీఆర్‌పై సీడబ్ల్యూసీ, దాని అనుబంధ డైరెక్టరేట్లకి ప్రజంటేషన్ ఇవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తయితే సీడబ్ల్యూసీ సూత్రప్రాయ అంగీకారం తెలుపుతుంది. దీంతో పాటే పర్యావరణ మదింపు జరగాలంటే పది అంశాలపై అధ్యయనం జరగాల్సి ఉంటుంది. పలు అంశాలపై సూచనలు చేసేందుకు.. ప్రస్తుతం పర్యావరణ మదింపు బాధ్యతలను పర్యావరణ పరిరక్షణ, శిక్షణ పరిశోధనా సంస్థ(ఈపీటీఆర్ఐ)కి ప్రభుత్వం కట్టబెట్టింది. అయితే నిత్యం ఈపీటీఆర్ఐతో సంప్రదింపులు, రాష్ట్ర అధికారులకు వివిధ అంశాలపై సూచనలు చేసేందుకు సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌నే కన్సల్టెంట్‌గా పెట్టుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. అయితే ఒక్క కాళేశ్వరానికే కాకుండా సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు పొందాల్సిన అన్ని ప్రాజెక్టులకు ఝా సేవలను పొడగించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి.