breaking news
Elkoti ellareddy
-
అశ్రునయనాలతో ఎల్కోటికి వీడ్కోలు
ఊట్కూర్ : అశ్రునయనాలతో మాజీ మంత్రి ఎల్కొటి ఎల్లారెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు. ఈనెల 6న మాజీ మంత్రి ఎల్కొటి ఎల్లారెడ్డి ఊట్కూర్‌లోని తన స్వగృహంలో బాత్రూమ్లో కిందపడ్డాడు. దీంతో అయన తలకు బలమైన గాయాలై కోమాలోకి వెళ్లగా కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో బుధవారం తెల్లవారుజామున ఇక్కడికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచారు. భారీ సంఖ్యలో చేరుకున్న వారు ఆయన పార్థివదే హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి తమ పొలంలో ఖననం చేశారు. అంతకుముందు ఎల్లారెడ్డి పార్థివదే హాన్ని పాలమూరు ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ మంత్రి గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఎస్.రాజేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డీకే భరతసింహారెడ్డి, దయాకర్‌రెడ్డి, ఎర్ర శేఖర్, రాములు, జైపాల్‌యాదవ్, స్వర్ణసుధాకర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగపాండ్రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా, ‘పేట’, గద్వాల ఇన్చార్జీలు శివకుమార్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి; బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావునామాజీ, నింగిరెడ్డి, పద్మజారెడ్డి, కొండయ్య; టీడీపీ నాయకులు రమేశ్‌గౌడ్ తదితరులు పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ఈ కార్యక్రమంలో వేలాదిమంది అభిమానులు ఆయా పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. కాగా ఎల్లారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంచనాలతో నిర్వహించింది. ఈ సందర్భంగా నారాయణపేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి తుపాకులను పేల్చారు. బాధిత కుటుంబసభ్యులను అన్ని విధాలా అదుకుంటామని రాష్ట్ర పంచాయితీ, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. నిజాయితీకి ప్రతిరూపం ఎల్లారెడ్డి మహబూబ్‌నగర్ అర్బన్ : రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగినా పేదోడిగానే మిగిలిన ఎల్కొటి ఎల్లారెడ్డి నిజాయితీ, నిరాడంబతకు ప్రతిరూపమని కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి కీర్తించారు. బుధవారం ఆయన ఢిల్లీ నుంచి విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. ఎల్లారెడ్డి మరణం ప్రజాస్వామ్య రాజకీయాలకు తీరని లోటని, ఆయన తనకు మంచి మిత్రుడని అన్నారు. భగవంతుడు బాధిత కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ సంతాపం ప్రకటించారు. ఎల్లారెడ్డి మంచి నాయకుడు కల్వకుర్తి : మాజీ మంత్రి ఎల్కొటి ఎల్లారెడ్డి మంచి నాయకుడని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాసేవలో ఎంతో అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. -
ఎల్లన్న ఇక లేరు
నారాయణపేట రూరల్: జిల్లాలో ఎల్లన్న అని పిలిస్తే పలికే నేతగా.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు సుపరిచితులైన మాజీమంత్రి, మక్తల్ మాజీఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కనుమూశారు. భార్య పద్మమ్మ మూడేళ్లక్రితమే చనిపోయారు. ఆయనకు నలుగురు కొడుకులు ఉన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన వార్డుసభ్యుడి నుంచి రాష్ట్రమంత్రి వరకు ఎదిగారు. నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. 1939 అక్టోబర్ 1న ఊట్కూర్ గ్రామానికి చెందిన మున్నురుకాపు ఎల్కొటి ఎంకమ్మ, ఆశన్నలకు ఎల్లారెడ్డి జన్మించారు. చిన్నతనంలోనే తల్లి ఎంకమ్మ మరణించడంతో తల్లిప్రేమకు దూరమయ్యాడు. నాయనమ్మ లక్ష్మమ్మ వద్దే పెరిగాడు. ఎల్లారెడ్డి ప్రాథమిక విద్యను ఊట్కూర్లోనే ప్రారంభించారు. హెచ్‌ఎల్‌సీసీ నారాయణపేటలో పూర్తిచేశారు. పీయూసీ హైదారాబాద్‌లోని న్యూసైన్స్ కళాశాలలో చదివారు. వార్డు సభ్యుడిగా.. గ్రామ రాజీకయాల్లో చురుకుగా పాల్గొంటూ మొట్టమొదటిసారిగా 1965లో గ్రామపంచాయతీ సభ్యులుగా ఎన్నికయ్యారు. తన రాజకీయ గురువు చిట్టెం నర్సిరెడ్డితో విభేదించి నందమూరి తారకరామరావు సమక్షంలో 1988లో ఎల్లన్న టీడీపీలో చేరారు. రెండు ద ఫాలుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తల కోరిక మేరకు మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి తన రాజకీయ గురువు చిట్టెం నర్సిరెడ్డిపై విజయం సాధించారు. అయితే టీడీపీ సంక్షోభంలో చంద్రబాబు నాయుడు వంచన చేరడంతో ఎల్లారెడ్డికి 1997లో మంత్రి పదవి లభించింది. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 1999 రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి సూగప్పపై ఎల్లారెడ్డి 10వేల ఓట్ల మెజార్టీతో నారాయణపేట తొలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో టీఆర్ ఎస్‌లో చేరిక.. 25ఏళ్లుగా టీడీపీలో ఉన్న ఎల్లారెడ్డి మక్తల్ అసెంబ్లీ నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడటంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 2014 ఏప్రిల్ జరిగిన ఎన్నికల్లో చిట్టెం రాంమోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. టీడీపీలో ఉన్న సమయంలో తన అనుచరులను ఒక్కొక్కరిని తన గూటికి చేర్చుకుంటూ ప్రత్యర్థుల గుండెల్లో అలజడి రేపారు. ఎల్లారెడ్డి తన రాజకీయ జీవితంలో ఎవరితోనూ ముక్కుసూటిగా మాట్లాడలేదు. కానీ తనను నమ్మినవారి కోసం ఎదుటివాళ్లను మందలిస్తూ పనులు చక్కబెట్టేవారు.