breaking news
the doctors
-
చర్చలు సఫలం
వైద్యుల డిమాండ్లకు సర్కార్ ఓకే 14 డిమాండ్లలో పదింటికి అంగీకారం రాజీనామాలను వెనక్కు తీసుకున్న డాక్టర్లు ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఆగ్రహం ఎందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించలేదంటూ మండిపాటు నేడు కోర్టుకు హాజరుకావాలంటూ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడికి ఆదేశం సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన ప్రభుత్వ వైద్యుల సంఘం, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మధ్య బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో తాము ఇచ్చిన రాజీనామాలను వెనక్కు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు అంగీకరించారు. డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘంలోని 4,500 మంది సోమవారం నుంచి రెండు రోజులు సామూహిక రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. సమస్యల పరి ష్కారం కోసం ఆరోగ్య, కుటంబ సంక్షేమశాఖ మంత్రి యూటీ ఖాదర్ అధ్యక్షతన పలుదఫాలుగా చర్చలు జరిగినా ఫలితం కనబడలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. వైద్యుల 14 డిమాండ్లలో పదింటిని పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో వైద్యులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ వల్ల ఇబ్బంది పడిన ప్రజలకు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య క్షమాపణలు కూడా చెప్పారు. ఇకపై వైద్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నాకు కాని, రాజీనామాలకు కాని పాల్పడకూడదన్నారు. ఏ విషయమైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఇందుకు విరుద్ధంగా జరిగి తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల సామూహిక రాజీనామాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అత్యవసర సేవల పరిధిలో ఉన్న వైద్యులు సామూహిక రాజీనామాలకు దిగితే వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించకుండా ఎందుకు ఊరికే ఉన్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులు సామూహిక రాజీనామాలకు దిగుతున్న నేపథ్యంలో వారి లెసైన్సులను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది ఎస్పీ అమృతేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి కేఎల్ మంజునాథ్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా వైద్యుల సామూహిక రాజీనామాలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘డిమాండ్ల పరిష్కారం కోసమంటూ ప్రభుత్వ వైద్యులు ప్రతిసారీ ఇలాగే రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. వీరిపై ప్రభుత్వం ఎందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించలేదు. అత్యవసర సేవల పరిధిలోని వైద్యులు సమ్మెలకు దిగిన సందర్భాల్లో ఎస్మాను తప్పక ప్రయోగించాల్సిందిగా కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వం ఎందుకు పాటించలేదు. ఈ విషయంలో ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసును ఎందుకు నమోదు చేయకూడదు’ అంటూ ప్రశ్నించింది. ఇక ఈ వ్యాజ్యంపై విచారణను గురువారానికి వాయిదా వేయడంతో పాటు ఈ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య స్వయంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. -
క్లినిక్‌లు నిర్వహిస్తే చర్యలు
ప్రభుత్వ వైద్యులకు మంత్రి హెచ్చరిక సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రైవేట్ క్లినిక్‌లను నిర్వహించే ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ హెచ్చరించారు. హాసనలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సేవలు అందించకుండా, ప్రైవేట్ క్లినిక్‌ల నిర్వహణ ద్వారా సంపాదించాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత నిజమేనని అంగీకరిస్తూ, కొత్త నియామకాలకు చర్యలు చేపడతామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో వైద్యుల కొరత లేకుండా చూస్తామని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో స్వచ్ఛతను పాటించడానికి మేనేజ్మెంట్ వ్యవస్థను అమల్లోకి తెస్తామని వెల్లడించారు. ప్రభుత్వ వైద్యులు విధిగా రెండేళ్ల పాటు గ్రామీణ సేవలను అందించాలనే నిబంధన విధించాలని యోచిస్తున్నామని, దీనికి కేంద్ర న్యాయ శాఖ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. కాగా జేడీఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి ప్రయత్నించడం లేదని చెప్పారు. అయితే వారే జేడీఎస్‌ను వీడే యోచనలో ఉన్నారని తెలిపారు. దీనిపై ఆ పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలని ఆయన సూచించారు.