breaking news
dhanora
-
కేసీఆర్‌కు ఆపిల్ పండ్లు అందించిన రైతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి పండించిన ఆపిల్ పండ్లను ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజీ మంగళవారం ప్రగతి భవన్లో అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌కి రైతు బాలాజీ మొక్కను, పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాలాజీని అభినందించారు. కొమురం భీం (ఆసిఫాబాద్)జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రెండు ఎకరాల్లో హెచ్ఆర్ 99 ఆపిల్ పంటను సాగు చేసినట్లు బాలాజీ తెలిపారు. ఉద్యానవన శాఖ ఆపిల్ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో ఆపిల్ పంట సాగుపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవి చెప్పడానికి ఇక్కడి నేలల్లో ఆపిల్ పండ్లు పండడమే ఉదాహరణ అని చెప్పారు. (ఇదిగో తెలంగాణ ఆపిల్!) -
ఇదిగో తెలంగాణ ఆపిల్!
సేంద్రియ రైతుతో కలిసి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా తెలంగాణ లోని ధనోరా గ్రామపరిధిలో ఆపిల్ పండ్ల సాగు కల సాకారమైంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో దనోరా గ్రామం ఉంది. ఉష్ణోగ్రత ఏడాదిలో కొద్దిరోజులైనా అతి తక్కువగా నమోదయ్యే ఎత్తయిన ప్రాంతమే ఆపిల్ సాగుకు అనుకూలం. ధనోరా ప్రాంతంలో అక్టోబర్ – ఫిబ్రవరి మధ్యలో.. 3 నుంచి 400 గంటల పాటు.. సగటున 4 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. అందువల్లే ధనోరా తెలంగాణ కాశ్మీర్‌గా పేరుగాంచింది. ఈ విషయం గ్రహించిన హైదరాబాద్‌లోని కేంద్రప్రభుత్వ సంస్థ సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్తలు డా. ఏ వీరభద్రరావు, డా. రమేశ్ అగర్వాల్ ఐదేళ్లక్రితం సర్వే చేసి.. సేంద్రియ రైతు కేంద్రే బాలాజి పొలం ప్రయోగాత్మకంగా ఆపిల్ సాగుకు అనువైనదిగా గుర్తించారు. చాలా ఏళ్లుగా సేంద్రియ ఉద్యానతోటలు సాగు చేస్తున్న బాలాజి అప్పటికే పది ఆపిల్ మొక్కలు నాటితే, కొన్ని మాత్రమే బతికాయి. ఈ నేపథ్యంలో సీసీఎంబీ శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో నాణ్యమైన ఆపిల్ మొక్కల సాగుకు బాలాజి శ్రీకారం చుట్టారు. వారు అందించిన హరిమన్, బిలాస్పూర్, నివోలిజన్, అన్న, రాయల్ డెలిషియస్ రకాలకు చెందిన నాణ్యమైన 500 ఆపిల్ మొక్కలను బాలాజి మూడేళ్ల క్రితం తన పొలంలో నాటారు. 400 మొక్కలు ఏపుగా ఎదిగాయి. ఈ ఏడాది చక్కని కాపు వచ్చింది. చెట్టుకు 25 నుంచి 40 కాయలు ఉన్నాయి. అయితే, లేత చెట్లు కావటంతో కాయ సైజు చిన్నగా ఉంది. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లో అమ్మకానికి పెట్టే అంత సైజు కాయలు వస్తాయని రైతు బాలాజి ‘సాక్షి’తో చెప్పారు. 5 ఎకరాల్లో ఆపిల్‌తో పాటు మామిడి, దానిమ్మ, అరటి, బత్తాయి, సంత్ర, ఆపిల్ బెర్ పంటలను ఆయన సాగు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ఆపిల్ పండ్లను ప్రజలు రుచిచూడటానికి కృషి చేసిన సీనియర్ సేంద్రియ రైతు, సీసీఎంబి శాస్త్రవేత్తలు, ఉద్యాన, వ్యవసాయ అధికారులకు జేజేలు! ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి! మా ఊళ్లో ఆపిల్ సాగుకు వాతావరణం అనుకూలమేనని రుజువైంది. ఇక్కడ చాలా మంది రైతులు ఆపిల్ సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరికొంతమంది రైతులకు మెలకువలు నేర్పుతాను. ఎక్కువ మంది రైతులు ఆపిల్ పంటను పండిస్తే అమ్మకం సులువు అవుతుంది. ఆపిల్ పంట పండించందుకు సీసీఎంబీ శాస్త్రవేత్తలతో పాటు ఉద్యానవన శాఖాధికారుల, వ్యవసాయాధికారుల కృషి కూడా ఉంది. ఇప్పుడు చేతికొచ్చిన ఆపిల్ పండు చిన్నదిగా ఉంది. ఈ ఏడాది గడిస్తే మరింత పెద్ద సైజు పండ్లు కాసే అవకాశం ఉంది. అందుకే వచ్చే ఏడాది నుంచి మార్కెట్లో అమ్మకానికి పెడదామనుకుంటున్నాను. – కేంద్రే బాలాజి (99490 92117), ఆపిల్ రైతు, కెరమెరి(ధనోర), భీం ఆసిఫాబాద్ జిల్లా బాలాజి తోటలో ఆపిల్ పండు – ఆనంద్, సాక్షి, కెరమెరి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా -
ఆపిల్ పంటకు ధనోరా అనుకూలం
ఉద్యానవన శాఖ విస్తరణ అధికారులు రమేశ్, శంకర్ గ్రామంలో రైతులకు 150 ఆపిల్ మెుక్కల పంపిణీ ఒక్కో మొక్క ఖరీదు రూ.800 కెరమెరి : ఆపిల్ పంట పండేందుకు ధనోరా అనువైన ప్రదేశమని, అందుకోసమే ఆ మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు ఉద్యానవన శాఖ విస్తరణ అధికారులు బి.రమేశ్, శంకర్ అన్నారు. శనివారం వారు మండలంలోని ధనోరా గ్రామానికి సమీపంలో ఉన్న బాలాజీ పొలాన్ని సందర్శించారు. అనంతరం బాలాజికి 140, ఝరి గ్రామానికి చెందిన రైతు దస్తగిరికి 10 ఆపిల్ మొక్కలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ, మార్చి నెలలో హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పొలాన్ని పరిశీలించారని, ఆపిల్ పంటకు కావాల్సిన ప్రదేశం అయినందున ఇక్కడ పండుతాయని నిర్ధారించారని వివరించారు. ఈ క్రమంలో జిల్లాలోనే ప్రథమంగా ఆపిల్ పంటలను ఇక్కడే పండిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడి నేల ఆపిల్ పంటకు అనుకూలమైందని తెలిపారు. అలాగే ఏడీహెచ్ కార్యాలయానికి 30, బెల్లంపల్లి డీఎఫ్‌వో ఆధ్వర్యంలో జోడేఘాట్‌లో నాటేందుకు 20 ఆపిల్ మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో మొక్క ఖరీదు రూ.800 ఉంటుందని, అందుకే వీటిని నాటడమే తమ బాధ్యత అనుకోకుండా కంటికిరెప్పలా కాపాడాలని సూచించారు. మొక్కలు నాటేందుకు ముందు గుంతలు తవ్వి, పోలీడాన్, గోబర్ ఎరువును వేయాలని, నాటిన తర్వాత ఫోరెట్ క్రిమిసంహారక మందు వేయాలని వివరించారు. ఈ పంట మూడేళ్లకు చేతికి వస్తుందని, అప్పటి వరకు చాలా జాగ్రత్తగా పెంచాలన్నారు. రైతులు ఎం.కేశవ్, మొహదిన్, ఆరీఫ్, మోబిన్, ఎజాజ్ పాల్గొన్నారు.