breaking news
Development Board
-
తెరపైకి కొబ్బరి బోర్డు!
అశ్వారావుపేట రూరల్: రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు అంశం తెరపైకి రావడంతో రైతు ల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశలు మొలకెత్తగా.. కేంద్రం స్పందిస్తుందా, లేదా అనే మీమాంస నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా.. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఉండేది. రాష్ట్ర విభజన సమయాన తెలంగాణలో సాగు తక్కువగా ఉందనే కారణంతో ఈ కార్యాలయాన్ని ఏపీకి మార్చారు. ఆనాటి నుంచి ఏపీ కొబ్బరి బోర్డు అధికారులే తెలంగాణలో కుడా కొబ్బరి సాగు విస్తరణ, అభివృద్ధి, రాయితీతోపాటు ఇతర సేవలందిస్తున్నారు. అయితే, తెలంగాణలో బోర్డు లేని కారణంగా కొబ్బరి రైతాంగానికి ఆశించిన స్థాయిలో సేవలు, రాయితీలు అందడం లేదనే చెప్పాలి. దీంతో కొన్నాళ్లుగా ఇక్కడ కూడా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక్కడా వేలాది ఎకరాల్లో సాగు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎక్కువగా తోటలు, కొబ్బరి నర్సరీలు ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో కొన్నేళ్ల క్రితం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా ఈ రెండు మండలాల్లో కొబ్బరి తోటలు అత్యధికంగా విస్తరించాయి. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో 1,358 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 586 ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ తోటలు సాగులో ఉండగా, తెలంగాణలో ఇప్పటివరకు కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు కాలేదు. ఫలితంగా సాగుదారులకు సేవలందక సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. బోర్డు లేని కారణంగా ఈ ప్రాంత రైతులకు రాయితీలు, ఇతర అంశాల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్లు దక్కడం లేదని తెలుస్తోంది. మంత్రి తుమ్మల లేఖతో కదలిక? గతేడాది ఏప్రిల్లో కొబ్బరి అభివృద్ధిమండలి బోర్డు అధికారుల బృందం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించింది. ఈసందర్భంగా రైతుల విజ్ఞప్తి మేరకు బోర్డు ఏర్పాటు విషయాన్ని ఉన్నతా ధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పా రు. కానీ ఆ తర్వాత ఈ అంశం మళ్లీ మరుగునపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, దమ్మపేట మండలానికి చెందిన మంత్రి తుమ్మలకు వ్యవసాయ శాఖ దక్కడంతో బోర్డు ఏర్పాటు విషయాన్ని స్థానిక రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తుమ్మల తెలంగాణలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేయాలని లేఖ రాయడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. -
సమీకరణలో స్తబ్దత
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. అధికారులు మొదట్లో చేసిన హడావుడి ఇప్పుడు గ్రామాల్లో కనిపించటం లేదు. ఆది నుంచి అనుకూలంగా ఉన్న తుళ్లూరు మండలం మెట్టరైతుల నుంచి సైతం ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు కలెక్టర్ కాంతి లాల్దండే ల్యాండ్ పూలింగ్ అధికారులతో ప్రతిరోజు సమీక్షిస్తున్నా ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా రైతుల నుంచి తీసుకుంటున్న భూముల విస్తీర్ణం రోజు రోజుకు పెరగాల్సి ఉండగా, తగ్గుతోంది. సోమవారం 277 మంది రైతులు 560.31ఎకరాల భూములు ఇచ్చారు. ప్రక్రియ ప్రారంభమైన ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 1779 మంది రైతులు 3,885.05 ఎకరాలను మాత్రమే ఇచ్చేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. ముఖ్యంగా రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతుల్లో భూములు ఇస్తే తామంతా ముఖ్యమంత్రి చేతిలో ఇరుక్కుపోతామనే ఆందోళన కనిపిస్తోంది. రాజధాని ప్రాంతానికి 30 వేల ఎకరాలు సమీకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ పూర్తి కావటానికి ఎన్నో రోజులు పడుతుందని అప్పటివరకు తమ పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు మాటలు నమ్మి భూములు ఇస్తే రైతు రుణమాఫీ మాదిరి మరోసారి మోసపోవాల్సి వస్తుందనే భయంతో రైతులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగానే తుళ్లూరు మండలం మెట్ట రైతులు పెద్దగా ఆసక్తి చూపటం లేదంటున్నారు. దీంతో భూ సమీకరణ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. జరీబు భూముల రైతులు మొదటి నుంచి ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. రాజధాని ప్రాంత రైతుల్లో అత్మవిశ్వాసం నింపేందుకు సింగపూర్ బృందం పర్యటించిన ఆదివారం కూడా స్పందన కనిపించలేదు. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లోనే తిష్టవేసి వరాలు కురిపిస్తున్నా ఇవేమీ భూ సమీకర ణను ముందుకు సాగేలా చేయలేకపోతున్నాయి. సంక్రాంతి లోపు 30 వేల ఎకరాల భూమిని సేకరించాలనే లక్ష్యంతో అధికారులు వడివడిగా అడుగులు వేసినా ఇప్పటి వరకు కేవలం 3,885.05 ఎకరాల భూమికి మాత్రమే 1,779 మంది రైతులు అంగీకార పత్రాలు సమర్పించారు. భూ సమీకరణకు సంబంధించి ఉద్దండ్రాయునిపాలెం, నవులూరు, నిడమర్రు రెండు యూనిట్లు, అబ్బురాజుపాలెంలో ఇంకా బోణీ కాలేదు. సోమవారం తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ఈప్రక్రియ ప్రారంభమైంది. రాయపూడి, వెంకటపాలెం, లింగాయపాలెం, మల్కాపురంలో సైతం స్పందన అంతంత మాత్రంగానే ఉంది. జరీబు రైతుల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపటం లేదు. అధికారుల సమావేశం వాయిదా... భూ సమీకరణపై జరీబు భూముల రైతుల్లో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదివారం రాయపూడిలో ఏర్పాటు చేసిన సమావేశం సైతం వాయిదా పడింది. తిరిగి సంక్రాంతి పండుగ తరువాత ఈ సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ సుబ్బారావు రైతులకు సమాచారం అందజేశారు. ఇదిలావుండగా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సోమవారం తుళ్లూరు మండలంలో పర్యటించి భూ సమీకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు.ఈ ప్రక్రియలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. గుంటూరు ఆర్డీఓ భాస్కరనాయుడు కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు. మరోవైపు సర్వేను ల్యాండ్స్ ఏడీ కిజిరియా కుమారి పరిశీలించి సిబ్బందికి తగుసూచనలు అందజేశారు. సోమవారం 277 మంది రైతులు 560.31ఎకరాల భూములు ఇవ్వగా, ఇప్పటివరకు మొత్తం 1,779 మంది రైతులు 3,885.05 ఎకరాల భూమిని ఇచ్చేందుకు అంగీకార పత్రాలు సమర్పించినట్టు ఆర్డీవో భాస్కరనాయుడు ‘సాక్షి’కి తెలిపారు.