breaking news
deputy cm ke krishna murthy
-
కేఈ కుమారుడిపై విచారణ జరపండి
► ఆరోపణలు వాస్తవమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి ► ఇసుక అక్రమ తవ్వకాలపై గనుల శాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హంద్రీ నదిలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుపై ఆరోపణలు చేస్తూ చెరుకులపాడు, కోసనపల్లె గ్రామస్తులు ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా విచారణ జరపాలని గనుల శాఖ అధికారులను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. గ్రామస్తుల ఆరోపణల్లో వాస్తవముందా? లేదా? అనే విషయం తేల్చాలని, ఒకవేళ వాస్తవమని తేలితే శ్యాంబాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తూ పట్టుబడిన వాహనాలను ఏఏ తేదీల్లో జప్తు చేశారు? ఎంత జరిమానా వసూలు చేశారు? వాహన యజమానులపై కేసులు పెట్టారా? లేదా?.. తదితర వివరాలతో నివేదికలు సమర్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. హంద్రీ నదిలో చట్ట విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని, దీనివల్ల సమీప గ్రామాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయంటూ కృష్ణగిరి, కోడుమూరు మండలాల పరిధిలోని ఎస్‌హెచ్ ఎర్రగుడి, మన్నేకుంటలకు చెందిన ఎ.బజారీతో పాటు 11 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఇసుక అక్రమ తవ్వకాల నివారణకు తీసుకున్న చర్చలేంటి? తదితర వివరాలతో ఓ నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు గనుల శాఖ అధికారులను గతంలో ధర్మాసనం ఆదేశించింది. ఆమేరకు వారు అఫిడవిట్లను మంగళవారం ధర్మాసనం ముందుంచారు. పరిశీలించిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారంలో ఉంటే విచారణ చేయరా? శ్యాంబాబు అనే వ్యక్తిపై గ్రామస్తులు ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా విచారణ జరిపారా? లేదా? అంటూ ప్రభుత్వ న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తప్పు చేశారా? లేదా? అన్నది తేల్చాలి కదా. ఏమీ చేయకుండా ఉంటే దాని అర్థం ఏమిటి?’ అంటూ నిలదీసింది. అధికారంలో ఉన్న వ్యక్తుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేయకుంటే పరిస్థితులు ఇలానే తయారవుతాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అఫిడవిట్లను చూస్తుంటే కలెక్టర్ సరిగా స్పందిస్తున్నట్లు అనిపించడం లేదని పేర్కొంది. వాహన యజమానులపై చర్యలు ఎందుకు తీసుకోలేదో వివరించడంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ విఫలమయ్యారన్న ధర్మాసనం.. మరోసారి వారికి నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. శ్యాంబాబుపై గ్రామస్తులు ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా విచారణ జరపాలని, ఆరోపణల్లో వాస్తవం ఉంటే అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని గనుల శాఖ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. అలాగే వాహన జప్తు.. ఇతర చర్యల గురించి నివేదికలివ్వాలని కలెక్టర్, ఎస్పీలకు స్పష్టం చేసింది. -
త్వరలో ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు
అమరావతి: హంద్రీనీవా సుజలస్రవంతి ప్రాజెక్టు కింద చేపట్టిన ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను త్వరలో ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ స్కీంకు రెండు పంపులు ఏర్పాటు చేస్తున్నామని, అనంతపురంజిల్లా గొల్లపల్లి వరకు నీటిని తీసుకెళ్తామని, భవిష్యత్తులో చిత్తూరుజిల్లా కుప్పం వరకు సాగునీటిని తీసుకెళ్ళే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాల్లో రైతులకు రూ.614 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరైందని, ఇందులో కర్నూలు జిల్లా రైతులకు రూ.181 కోట్లు అందిస్తామని, తన నియోజకవర్గమైన పత్తికొండకు రూ.66 కోట్లు మంజూరైనట్లు కేఈ వివరించారు. జనవరిలో సీఎం చంద్రబాబు చేతులమీదుగా ఇన్పుట్ సబ్సిడీ చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. నోట్ల రద్దు ప్రభావంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. పెంచిన భూ మార్కెట్ విలువను తగ్గించలేమని, స్థిరీకరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే కృష్ణాజిల్లా నూజివీడులో భూమి మార్కెట్ విలువ రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు అమాంతంగా పెరిగిందని, కారణాలు అన్వేషిస్తున్నట్లు ఆయన చెప్పారు.