breaking news
Delhi Jal Board (djb)
-
ఢిల్లీలో దాహం.. దాహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీవ్ర జల సంక్షోభం నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి నీటి సరఫరా తగ్గడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి దారుణంగా పెరిగింది. యమునా నదీ జలాల సరఫరా విషయంలో ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. మండుతున్న ఎండలకు తోడు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే ట్యాంకర్ మాఫియా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. ఆగిన సరఫరా.. తగ్గిన నిల్వలుఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90 శాతం యమునా నదీ మునాక్ కాలువ ద్వారా తీరుతోంది. మరికొంత ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎగువ గంగ కాల్వల ద్వారా వచ్చే నీటితో ఢిల్లీ నీటి కష్టాలు తీరుతున్నాయి. యమునా నదిపై ఉన్న చంద్రవాల్, వజీరాబాద్, ఓక్లా నీటి శుద్ధి కర్మాగారాలుసహా మరో నాలుగు ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీకి ప్రతి రోజూ 1,200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తోంది. హరియాణా ప్రభుత్వం మునాక్ ఉప కాల్వల ద్వారా 683 క్యూసెక్కులు, ఢిల్లీ చిన్న కాల్వల ద్వారా మరో 330 క్యూసెక్కుల నీటిని వజీరాబాద్ నీటి శుద్ధి రిజర్వాయర్‌కు సరఫరా చేయాల్సి ఉంది. మొత్తంగా రోజుకి 1,013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా హరియాణా ప్రభుత్వం కేవలం 840 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. హరియాణా నీటి సరఫరాను తగ్గించడంతో ఉత్తర, పశ్చిమ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ రిజర్వాయర్‌లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. రిజర్వాయర్‌లో సగటు నీటి మట్టం 674.5 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగులకు పడిపోయింది. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదల అవుతోందని ఢిల్లీ జల వనరుల మంత్రి అతిశి ఆరోపించారు. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి ట్యాంకర్లపై జనం ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోయింది. ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తోంది. నీటి ఎద్దడి అంశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హరియాణా ముఖ్యమంత్రి నయాబ్‌సింగ్ షైనీతో మాట్లాడి, నీటి సరఫరా పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు. మునాక్ కాలువ, ఇతర కాల్వల నుంచి ట్యాంకర్ మాఫియా నీటి దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు బృందంచే విచారణ చేపట్టాలని బుధవారం బీజేపీ రాష్ట్ర శాఖ డీజీపీకి విజ్ఞప్తి చేసింది. నీటి ఎద్దడికి రాజధానిలా మారుతున్న ఢిల్లీలో చాలా కాలనీల్లో ఎటు చూసినా మహిళలు, చిన్నారులు బిందెలు, బకెట్లు పట్టుకుని పెద్దపెద్ద క్యూ లైన్లలో నిల్చున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మాట మార్చిన హిమాచల్ప్రదేశ్ఇన్నాళ్లూ నీటిని సరఫరా చేసిన హిమాచల్ ప్రదేశ్ మాట మార్చింది. తమ వద్ద 135 క్యుసెక్కుల మిగులు జలాలు లేవని, కావాలంటే యమునా బోర్డును ఆశ్రయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హిమాచల్ నుంచి హరియాణాకు వచ్చిన మిగులు జలాలను ఢిల్లీ కోసం విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన నేపథ్యంలో ప్రతిగా హిమాచల్ సర్కార్ కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసును గురువారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ నీటి నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. కాల్వల ద్వారా నీటి పంపిణీ నష్టాలను తగ్గించడంలో, నీటి చౌర్యాన్ని నియంత్రించడం, తలసరి నీటి వినియోగాన్ని నియంత్రించడంలో ఢిల్లీ వైఫల్యం చెందింది. అభివృధ్ధి చెందుతున్న దేశాల్లో పంపిణీ నష్టాలు 10శాతం ఉంటే ఢిల్లీలో ఏకంగా 52.35 శాతం నష్టాలు ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖ నిర్దేశకాల ప్రకారం పట్టణ నీటి తలసరి సరఫరా 135 లీటర్లుగా ఉంటే ఢిల్లీలో అతిగా 172 లీటర్లు సరఫరాచేస్తున్నారు. హిమాచల్ వద్ద వాస్తవానికి మిగులు జలాలు లేవు. ఉన్నాయంటూ గతంలో ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వండి’ అని హిమాచల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ ఇదెంత తీవ్రమైన అంశమో మీకు తెలియట్లేదు. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలో వద్దో తర్వాత తేలుస్తాం’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో గత ప్రకటన ఉపసంహరణకు పద్దతి ప్రకారం అఫిడవిట్ సమర్పిస్తానని అడ్వకేట్ జనరల్ చెప్పారు.మాకంత నైపుణ్యం లేదుహిమాచల్ వాదనలు విన్నాక మానవతా దృక్పథంతో నీటిని సరఫరా చేయాలని సాయంత్రంకల్లా ఎగువ యమునా జలబోర్డ్ వద్ద దరఖాస్తు పెట్టుకోవాలని ఢిల్లీ సర్కార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ యమునా నదీ జలాల పంపకం అనేది సంక్లిష్టమైన వ్యవహారం. ఇప్పటికిప్పుడు మధ్యేమార్గంగా నదీజలాల పంపకం సమస్యను తీర్చేంత స్థాయిలో మాకు సాంకేతిక నైపుణ్యం లేదు. 1994 అవగాహనా ఒప్పందం ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న యమునా బోర్డే ఈ సమస్యకు పరిష్కారం చూపగలదు. అదనంగా 150 క్యూసెక్కుల కోసం ఢిల్లీ గతంలోనే దరఖాస్తు చేసుకుంది. దానిపై జలబోర్డ్ త్వరగా నిర్ణయం వెలువర్చాలి. లేదంటే శుక్రవారం నుంచి రోజువారీగా బోర్డ్ సమావేశమై సమస్యను పరిష్కరించాలి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.ఢిల్లీ ప్రభుత్వ వాదనేంటి?నీటి ట్యాంకర్ల మాఫియాపై ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం తలంటిన నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్ సర్కార్ అఫిడవిట్ సమర్పించింది. ‘‘ ట్యాంకర్ల మాఫియా హరియాణా వైపు ఉన్న యమునా నది వెంట రెచ్చిపోతోంది. ఆ ప్రాంతం ఢిల్లీ జలబోర్డ్ పరిధిలోకి రాదు. అసలు అక్కడ చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉందో తేల్చాలని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. స్పందన శూన్యం. హరియాణా నుంచి ఢిల్లీకి నీటి సరఫరా వృథాను 30 శాతం ఉంచి ఐదు శాతానికి తగ్గించాం’’ అని అఫిడవిట్లో పేర్కొంది. గురువారం ఢిల్లీ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదించారు. ‘‘ జలబోర్డులు ప్రభుత్వ అనుకూల అధికారులతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీ వేసి సుప్రీంకోర్టే సమస్యను పరిష్కరించాలి’ అని అన్నారు. ఈ వాదనతో హరియాణా విభేధించింది. ‘‘ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ బ్యారేజీలో కనీస నీట నిల్వలు ఉండాల్సిందే. అతి సరఫరా కుదరదు. ఈ అంశాన్ని యమునా బోర్డ్‌కు వదిలేస్తే మంచిది’ అని హరియాణా తరఫున లాయర్ శ్యామ్ దివాన్ వాదించారు. ఈ అంశాన్ని ఇకపై జలబోర్డే చూసుకుంటుందని అదననపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జీత్ బెనర్జీ చెప్పారు. దీంతో జలబోర్డులో తేల్చుకోండంటూ ఢిల్లీ సర్కార్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. మరోవైపు రోజుకు 5 కోట్ల గ్యాలెన్ల నీటి సరఫరా తగ్గడంతో నీటిని వృథా చేయకండని ఢిల్లీవాసులకు ప్రభుత్వం సూచనలు చేసింది. -
Delhi Jal Board case: జలమండలి కేసులోనూ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ గైర్హాజరుల పర్వం ఢిల్లీ జలమండలి కేసులోనూ పునరావృతమైంది. మద్యం అవకతవకల కేసులో కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు సమన్లు జారీచేయడం ఆయన గైర్హాజరవడం తెల్సిందే. తాజాగా ఢిల్లీ జల్‌బోర్డ్‌లో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ విచారణ కోసం సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే సమన్లు జారీచేయగా కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్‌కు రాలేదు. తనకు సమన్లు పంపడం చట్టవ్యతిరేకమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మనీ లాండరింగ్ సంబంధించిన సమన్లు అందుకున్న రెండో కేసు ఇది. మద్యం ఎక్సయిజ్ కేసులో ఇప్పటికే ఎనిమిది సార్లు సమన్లు అందుకోవడం, ప్రతిసారీ ఆఫీస్‌కు రాకుండా మిన్నకుండిపోవడం తెల్సిందే. మద్యం కేసులో విచారణ నిమిత్తం మార్చి 21వ తేదీన తమ ఆఫీస్‌కు రావాలని ఈడీ తాజాగా ఆయనకు తొమ్మిదోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం. -
ఎమ్మెల్యే వేధింపులు.. వైద్యుడి ఆత్మహత్య!
న్యూఢిల్లీ: తన చావుకు ఎమ్మెల్యే కారణమంటూ ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన శనివారం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. అతని సూసైడ్ నోట్ మేరకు పోలీసులు సదరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని దుర్గావిహార్లో నివసించే రాజేంద్ర సింగ్ అటు వైద్యుడిగా పనిచేస్తూనే, ఇటు వాటర్ ట్యాంకర్ల వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో ఢిల్లీ జల బోర్డులో తన వాటర్ ట్యాంకర్లు అద్దెకు ఇచ్చాడు. అయితే ఈ కాంట్రాక్టు కొనసాగాలంటే డబ్బులు ముట్టజెప్పాలంటూ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ డబ్బులు డిమాండ్ చేశాడు. దానికి రాజేంద్ర సింగ్ నిరాకరించగా.. అతని నీటిట్యాంకర్లను జల బోర్డు నుంచి తొలగించి వేధింపులకు పాల్పడ్డారు. (మహమ్మారి విజృంభించవచ్చు!) ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన ఆయన శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరుడు కనపిల్ నాగర్ కూడా వేధింపులకు పాల్పడ్డాడని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. వారి నుంచి తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో ఓ మహిళను వేధించినందుకుగానూ 2018లో ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌పై కేసు నమోదైంది. (మనస్తాపంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య) -
ఇంజనీర్‌పై దాడి కేసులో ‘ఆప్’ ఎమ్మెల్యే అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: తన మాట వినలేదనే కోపంతో ఢిల్లీ జలబోర్డు (డీజేబీ) అధికారిపై చేయిచేసుకున్నందుకు ఢిల్లీ పోలీసులు దేవ్లీ ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. తమ ఇంజనీర్ అరుణ్‌కుమార్‌పై ఆప్ ఎమ్మెల్యే, ఆయన మనుషులు దాడి చేశారని డీజేబీ సంగంవిహార్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే జార్వాల్‌ను అరెస్టు చేశామని డీసీపీ కరుణాకరణ్ తెలిపారు. సంగంవిహార్ ప్రాంతంలో ట్యూబ్‌వెల్ డ్రిల్లింగ్ పనులను పర్యవేక్షిస్తున్న జూనియర్ ఇంజనీర్ అరుణ్‌కుమార్‌పై ఎమ్మెల్యే, అతని గూండాలు దాడి చేశారని డీజేబీ ఆరోపించింది. ‘గురువారం ఉదయం ట్యూబ్‌వెల్ డ్రిల్లింగ్ ప్రారంభించాం. అయితే డ్రిల్లింగ్‌ను నిలిపివేయవలసిందిగా ఎమ్మెల్యే సన్నిహితుడొకరు అరుణ్ కుమార్‌కు ఫోన్ చేసి చెప్పాడు. ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించకుండా ఏ పని మొదలుపెట్టకూడదని ఆ వ్యక్తి చెప్పాడు. తవ్వకాలను మధ్యలోనే ఆపివేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగడమేగాక డ్రిల్లింగ్ పనుల్లో జాప్యమేర్పడుతుంది. అందుకే అరుణ్‌కుమార్ పనుల కొనసాగింపునకు ఆదేశించారు’ అని డీజేబీ పేర్కొంది. ఆ తరువాత ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే తన మనుషులతో వచ్చి అరుణ్‌కుమార్‌పై చేయిచేసుకున్నారని, ఫలితంగా ఆయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చిందని డీజేబీ తెలిపింది.