breaking news
Daimler
-
ఎలక్ట్రిక్ 'ఐకార్'కు డీల్ కుదిరిందట
ముంబై : ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థలు బీఎమ్ డబ్ల్యూ, డైమ్లెర్ లు సరికొత్త ఎలక్ట్రిక్ కారు రూపొందించడానికి యాపిల్ తో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ సహకార ఒప్పందానికి యాపిల్ నుంచి ఆమోదం లభించిందట. ఈ డీల్ తో టెక్నాలజీ దిగ్గజం యాపిల్, ప్రముఖ కార్ల కంపెనీ లు సంయుక్తంగా మార్కెట్లోకి వినూత్నమైన ఎలక్ట్రిక్ 'ఐకార్'ను తీసుకురానున్నాయని పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై స్పందించడానికి యాపిల్, బీఎమ్ డబ్ల్యూయూ, డైమ్లెర్ సంస్థలు తిరస్కరించాయి. ఓ జర్మన్ డైలీ గతేడాది బీఎమ్ డబ్ల్యూతో, ఇటీవల డైమ్లెర్ తో మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది. యాపిల్ ఎప్పటినుంచో మంచి నైపుణ్యాలు కలిగిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ కోసం చూస్తుందని, ముఖ్యంగా జర్మనీ సంస్థల వైపు గూగుల్ కన్నేసిందని రిపోర్టు చెబుతోంది. గూగుల్ కు పోటీగా యాపిల్ ఎప్పటినుంచో సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్లను తయారుచేయాలని సన్నాహాలు చేస్తోంది. గూగుల్, యాపిల్ సంస్థలే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొన్ని టెక్నాలజీ దిగ్గజాలు కూడా కార్ల తయారీ సంస్థలతో కలిసి ఇంటర్నెట్ కనెక్షన్ కార్లు లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీలో పాల్గొంటున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇటీవలే సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ 'ఆటోపైలెట్'ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరోవైపు కెనడియన్-ఆస్ట్రేయన్ సంస్థ మాగ్న కూడా యాపిల్ తో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. -
5 లక్షలు తగ్గనున్న మెర్సిడెస్ బెంజ్ ధర
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ కంపెనీ లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్, జీఎల్-క్లాస్ ధర రూ. 5 లక్షలు తగ్గనున్నది. ఈ ఎస్యూవీని పుణే సమీపంలోని చకన్ ప్లాంట్లో తయారు చేయడం ప్రారంభించామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సోమవారం తెలిపింది. ఫలితంగా ఈ కారు ధర రూ. 5 లక్షలు దిగిరానున్నది. అమెరికాలోని టస్కలూసా ప్లాంట్ వెలుపల ఈ జీఎల్-క్లాస్ ఎస్యూవీని అసెంబుల్ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మేలో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ధరను అప్పుడు రూ.77.5 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఎస్యూవీని దేశీయంగా అసెంబుల్ చేస్తుండటంతో దీని ధర రూ. 5 లక్షలు తగ్గి రూ.72.58 లక్షల(ఎక్స్ షోరూమ్,ఢిల్లీ)కు చేరింది.