breaking news
crop fail
-
శివన్న పంటా పోయింది!
అమడగూరు : స్వయాన సీఎం చంద్రబాటు రక్షకతడులను ప్రారంభించిన రైతు శివన్న పొలంలోనే వేరుశనగ పంట ఎత్తిపోయింది. చెట్టుకు ఒకట్రెండు కాయలు కూడా లేకపోవడంతో రైతు ఆవేదన చెందుతున్నాడు. తొమ్మిది ఎకరాల పంట పూర్తిగా పోయిందని, పెట్టుబడి కోసం చేసిన రూ.లక్ష అప్పు ఎలా తీర్చాలోనని వాపోతున్నాడు. అమడగూరు మండలం గుండువారిపల్లికి చెందిన రైతు శివన్న పొలంలో ఆగస్టు 28న సీఎం చంద్రబాబు రెయిన్గన్లతో రక్షకతడులు ప్రారంభించారు. ఇక తన పంట పండినట్టేనని రైతు ఆశపడ్డాడు. పంటను శనివారం ట్రాక్టరుతో దున్నించేశాడు. దిగుబడి ఏమాత్రమూ లేదు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎద్దుల శ్రీధర్‌రెడ్డి, మండల కన్వీనర్ శేషూరెడ్డి తదితరులు రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా అతను గోడు వెళ్లబోసుకున్నాడు. ‘టీడీపీ నాయకులు వచ్చి నీ పొలానికి సీఎం చంద్రబాబు వస్తున్నారు.. రక్షకతడుల ద్వారా పంటను కాపాడతారని చెప్పారు. సీఎం వచ్చిన రోజు కాసేపు రెయిన్గన్లు బిగించారు. ఆయన వెళ్లగానే అదే రోజు సాయంత్రం ఫారంపాండ్లోని కవరు, రెయిన్గన్లు అన్నీ తీసుకెళ్లిపోయారు. పంటంతా ఎండిపోయింద’ని వాపోయాడు. సీఎం వచ్చి రెయిన్గన్లను ప్రారంభించిన పంట పొలమే పూర్తిగా ఎండిపోతే..ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏంటని వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. రక్షక తడుల పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొట్టారే కానీ రైతులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శశికళ, నాయకులు సుధాకర్‌రాజు, రషీద్, మోహన్‌రెడ్డి, రమణారెడ్డి, అంజినప్ప, రామప్ప తదితరులు పాల్గొన్నారు. -
విదర్భ వ్యథ వినిపించేనా ?
నాగపూర్: అతివృష్టి, అనావృష్టి, కరువు, వ్యవసాయ సంక్షోభం సంభవించడం, గిట్టుబాటు ధరలు లభించక ప్రాణాలు తీసుకున్న విదర్భ ప్రాంత రైతుల భార్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వ్యవసాయ సంక్షోభ నివారణకు కొత్త సర్కారు తగిన చర్యలు తీసుకుంటుందని వీళ్లంతా ఆకాంక్షిస్తున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం సందర్భంగా మోడీతో మాట్లాడిన పలువురు విదర్భ వితంతువులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పంట రుణాలు, గిట్టుబాటు ధరలు దక్కడం లేదని, ఫలితంగా చాలా మంది నిరాశానిస్పృహల్లో ఉన్నారని తెలిపారు. ప్రధానిగా అధికారం చేపట్టగానే విదర్భ రైతుల కుటుంబాలకు ప్రత్యేక సమగ్ర పరిహార, పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. విదర్భలో ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తికి మద్దతుధర లేకపోవడం, వ్యవసాయ సంక్షోభం వల్ల 2004 నుంచి ఇప్పటి వరకు 10 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విదర్భ వ్యవసాయ వితంతువుల సంఘం (వీఎఫ్డబ్ల్యూఏ) అధ్యక్షురాలు బేబితాయి బయాస్ అన్నారు. భర్తలను కోల్పోయిన చాలా మందికి ఇప్పటికీ పింఛన్, భూకేటాయింపు వంటి సదుపాయాలు అందలేదని తెలిపారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా తమకు ఊరటనిచ్చేలా మోడీ చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉందని అపర్ణ మాలికర్ అనే వితంతువు పేర్కొన్నారు. విదర్భ జనాందోళన్ సమితి అధిపతి కిశోర్ తివారీ సైతం ఎన్డీయే ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని తెలిపారు. జాతీయ రైతుల సంఘం సూచించిన కనిష్ట మద్దతు ధర విధానాన్ని అమలు చేయాలని, ప్రస్తుతం ఉన్న విధానం రైతులకు మేలు చేయడం లేదని సమితి పేర్కొంది. సంక్షోభం కారణంగా సర్వం కోల్పోయిన రైతుల కుటుంబాలకు మళ్లీ పంటరుణాలు ఇవ్వాలని విన్నవించింది. గత ఎన్డీయే ప్రభుత్వం విదర్భ రైతులకు ఏమీ చేయలేదని, పత్తి దిగుమతికి అనుమతించి రైతులకు అన్యాయం చేసిందని కిశోర్ తివారీ అన్నారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.