breaking news
civils-2015
-
తెలుగు తేజాలకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్ : సివిల్స్‌లో విజయ కేతనం ఎగురవేసిన రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు తేజాలకు అభినందనలతో పాటు ఆయన ఆల్ ది బెస్ట్ అంటూ బుధవారం ట్విట్ చేశారు. కాగా దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అఖిల భారత సర్వీసు అధికారుల ఎంపిక పరీక్ష ‘సివిల్స్’లో తెలంగాణ, ఏపీ విద్యార్థులు విజయం సాధించారు. దేశవ్యాప్తంగా 1,078 మందిని సివిల్ సర్వీసులకు ఎంపిక చేయగా.. అందులో దాదాపు 80 మంది తెలుగు విద్యార్థులే కావడం విశేషం. -
తెలుగు వెలుగులు
సివిల్స్‌లో తెలంగాణ, ఏపీల నుంచి 80 మంది వరకు ఎంపిక సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అఖిల భారత సర్వీసు అధికారుల ఎంపిక పరీక్ష ‘సివిల్స్’లో తెలంగాణ, ఏపీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. దేశవ్యాప్తంగా 1,078 మందిని సివిల్ సర్వీసులకు ఎంపిక చేయగా.. అందులో దాదాపు 80 మంది తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్-ఏ, గ్రూప్-బి తదితర అఖిల భారత సర్వీసులకు ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ పరీక్షలను నిర్వహించింది. గత డిసెంబర్లో మెయిన్స్ రాతపరీక్షలను నిర్వహించి.. ఈ ఏడాది మార్చిలో ఇంటర్వ్యూలు చేసింది. మంగళవారం సివిల్ సర్వీసెస్-2015 ఫైనల్ ఫలితాలను వెల్లడించింది. కేటగిరీల వారీగా..: సివిల్ సర్వీసులకు జనరల్ కేటగిరీలో 499 మందిని, ఓబీసీ 314, ఎస్సీ 176, ఎస్టీ కేటగిరీలో 89 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. అభ్యర్థులు వివిధ విభాగాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా వారికి సర్వీసులను కేటాయించారు. అలాగే 172 మందితో రిజర్వు జాబితాను కూడా ప్రకటించారు. అందులో జనరల్ 86 మంది, ఓబీసీ 74, ఎస్సీ 8, ఎస్టీ కేటగిరీకి చెందిన నలుగురు ఉన్నారు. ఈ ఫలితాలకు సంబంధించి ఫెసిలిటేషన్ కౌంటర్‌ను యూపీఎస్సీ ఏర్పాటు చేసింది. ఫలితాలు, నియామకాలకు సంబంధించిన వివరాలను పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోగా 23385271/ 23381125/ 23098543 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొంది. అభ్యర్థుల మార్కులను 15 రోజులపాటు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. గత ఏడాదిలాగే: తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్‌కు గత ఏడాదిలాగే ఈసారి కూడా ఎక్కువమంది ఎంపిక అయ్యారని అనలాగ్ ఐఏఎస్ ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ విన్నకోట శ్రీకాంత్ పేర్కొన్నారు. గత ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి 70 మంది వరకు అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారని తెలిపారు. సివిల్స్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి అత్యుత్తమ ర్యాంక్ (14) సాధించిన కీర్తి 2013లో ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని ఇండియన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో హైదరాబాద్ సర్వీస్ ట్యాక్స్ కమిషనరేట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా సోమవారమే విధుల్లో చేరడం విశేషం. కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్న ఆమె స్వస్థలం విశాఖ జిల్లా నర్సీపట్నం. ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ: సివిల్స్ విజేతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘‘మీ జీవితాల్లో మొదలైన ఉత్సాహభరితమైన ఈ నూతన అధ్యాయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని మంగళవారం ట్వీట్ చేశారు. పరీక్షల్లో విజయం సాధించలేనివారు నిరాశ చెందడం సహజమే అయినా భవిష్యత్తుపై దృష్టి సారించాల్సిందిగా వారికి సూచించారు. ఐఏఎస్ నా కల.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి విద్యాసాగర్ నాయుడు 101వ ర్యాంకు సాధించారు. వారి కుటుంబం కొన్నేళ్ల కిందే హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో స్థిరపడింది. తండ్రి త్యాగరాజు దక్షిణ మధ్య రైల్యేలో ఉద్యోగి. చిన్నప్పటి నుంచీ ఐఏఎస్ కావాలనేది తన కల అని, ఇప్పుడు దానిని సాధించనుండడం ఎంతో ఆనందంగా ఉందని విద్యాసాగర్ పేర్కొన్నారు. ప్రజాసేవపై మక్కువతో.. జాతీయ స్థాయిలో 180వ ర్యాంకు సాధించిన ఎడ్మ రిషాంత్‌రెడ్డి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి. ఆయన తండ్రి గోపాల్‌రెడ్డి. ఈయన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డికి సోదరుడు. వారు పదేళ్ల కింద హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లోనే ఇంటర్ పూర్తిచేసిన రిషాంత్.. బాంబే ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివారు. అనంతరం ఓ బహుళ జాతి సంస్థలో నెలకు రూ.1.2 లక్షల వేతనం వచ్చే ఉద్యోగంలో చేరారు. అయితే పెదనాన్న కిష్టారెడ్డితో ఉన్న అనుబంధం రిషాంత్‌ను ప్రజాసేవ వైపు మళ్లించింది. దీంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. ‘‘ప్రజాసేవ చేయాలన్న పెదనాన్న స్ఫూర్తితో ముందుకు వెళ్లాను. అమ్మనాన్న ఎంతగానో ప్రోత్సహించారు. ఈ విజయం వారికి అంకితం..’’ అని రిషాంత్ పేర్కొన్నారు. రోజూ పత్రికలు చదువుతా.. దినపత్రికలను చదివితే సివిల్ సర్వీసెస్‌కు కావాల్సిన ఎంతో సమాచారం లభిస్తుందని 191వ ర్యాంకు సాధించిన సతీశ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఉక్మాగులూరుకు చెందిన పీఆర్కే ప్రసాద్, పి.లక్ష్మిదుర్గల కుమారుడు సతీశ్. వారి కుటుంబం హైదరాబాద్ శివార్లలోని పుప్పాలగూడకు కొన్నేళ్ల కింద తరలివచ్చింది. ‘‘ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో నాకు ఐఏఎస్ కావాలనే ఆలోచన వచ్చింది. కష్టంగా కాకుండా ఇష్టపడి చదివి సివిల్స్ సాధించాను. ఐఏఎస్‌లో చేరితే సమాజానికి పూర్తి స్థాయిలో సేవ చేయటంతో పాటు మంచి స్థాయిలో ఉండవచ్చు..’’ అని సతీశ్ పేర్కొన్నారు. అనంత ‘ప్రావీణ్య’ం పేదలకు తనవంతు సాయం చేయాలన్న తపనతో సివిల్స్‌కు సిద్ధమైనట్లు 82వ ర్యాంకు సాధించిన వేములేటి ప్రావీణ్య చెప్పారు. ఆమెది అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం ఎనుములపల్లి. తల్లి మాలతి బెంగళూరులో చీఫ్ మెడికల్ ఆఫీసర్, తండ్రి ఓబుళరెడ్డి హెచ్ఏఎల్ బెంగ ళూర్‌లో ఇంజనీర్. గోవాలోని బిట్స్ పిలానీలో బీఈ పూర్తిచేసిన ప్రావీణ్య నిరుపేదల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని, అందుకోసం తన వేతనంలో కొంత కేటాయిస్తానని చెప్పారు. నేర్చుకున్నది వృథా పోదు విజయవాడకు చెందిన అన్నవరప్రసాద్, లక్ష్మీభ్రమరాంబ కుమారుడు సి.హెచ్.రామకృష్ణ 84వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. ‘‘ర్యాంకు వస్తుందనే చదవాల్సిన అవసరం లేదు.. చదువు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సివిల్స్, గ్రూప్స్‌కు ప్రిపేరవుతున్న విద్యార్థులు సాధించకపోతే జీవితమే వ్యర్థమనే ధోరణితో ఉంటున్నారు. అది సరికాదు..’’అని పేర్కొన్నారు. ప్రజాసేవ కోసమే.. హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురం విజయపురికాలనీకి చెందిన అదురె మంజు 291 ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి ధర్మయ్య వికలాంగుల శాఖలో అటెండర్‌గా పనిచేసి రిటైరయ్యారు. వారి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం జీనుగుపల్లి. ఉస్మానియాలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన మంజు.. ఐఏఎస్‌లో చేరి ప్రజాసేవ చేయాలనేది తన లక్ష్యమని చెప్పారు. ఐఆర్ఎస్ నుంచి ఐఏఎస్! నల్లగొండ జిల్లా హేమ్లాతండా గ్రామపంచాయతీ పరిధిలోని జగ్గుతండాకు చెందిన భూక్యా టీకం కుమారుడు భూక్యా నాగేందర్ 733వ ర్యాంకు సాధించారు. 2014లో 1,122 ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్కు ఎంపికై శిక్షణలో ఉన్నారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ కాలేజీలో బీటెక్ పూర్తి చేసి ఐదేళ్లపాటు ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేసిన నాగేందర్ రెండేళ్లపాటు గ్రూప్-1కు శిక్షణ తీసుకుని సివిల్స్‌కు ఎంపికయ్యూరు. ఇప్పుడు ఐఏఎస్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఏఎస్ ధ్యేయంగా.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ పంచాయతీ పరిధిలోని గేర్ తండాకు చెందిన అడావత్ సైదులు 796వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వ సివిల్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. సైదులు రెండేళ్ల కిందట సివిల్స్ రాయగా 1,174వ ర్యాంక్ వచ్చింది. ఐఏఎస్ కావడమే ధ్యేయంగా శ్రమించిన ఆయన మరోమారు పరీక్ష రాసి ర్యాంక్ సాధించారు. ఈయన తండ్రి పదేళ్ల కిందటే మరణించగా తల్లి కూలినాలీ చేసి చదివించింది. అటవీ అధికారిగా పనిచేస్తూ.. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటకు చెందిన వరప్రసాదవర్మ 806వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం అటవీశాఖలో రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయన పట్టుదలగా ప్రయత్నించి సివిల్స్ సాధించారు. ఆయన తండ్రి సుబ్బారాయుడు మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. తనకు వచ్చిన ర్యాంకు ప్రకారం ఐఆర్ఎస్ ఐటీ వచ్చే అవకాశముందని వర్మ పేర్కొన్నారు. డాక్టర్ నుంచి.. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఇడమకల్లు గ్రామానికి చెందిన వైద్యుడు సంజామల వెంకటేశ్వర్ 216వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి వెంకటయ్య రైతు. వెంకటేశ్వర్ ఆంధ్రా మెడికల్ కళాశాలలో 2013లో ఎంబీబీఎస్ చేసి.. ప్రస్తుతం విశాఖపట్నంలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన సోదరుడూ వైద్యుడే. వెంకటేశ్వర్ 2013లో సివిల్స్ రాసి ఐఆర్ఏఎంకు, 2014లో ఐడీఈఎఫ్కు ఎంపికయ్యారు. తాజాగా 216వ ర్యాంకు సాధించారు. పట్టుదలతో ప్రయత్నించి.. విశాఖపట్నానికి చెందిన కింతాడ ప్రవళిక సివిల్స్‌లో 232వ ర్యాంకు సాధించారు. వారి కుటుం బం హైదరాబాద్‌లో స్థిరపడింది. తండ్రి విశ్వనాథం వరంగల్ జిల్లా కాజీపేట ఎస్బీహెచ్లో సీజీఎం. తల్లి హైదరాబాద్ ఎస్బీహెచ్లో క్లర్క్. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేసిన ప్రవళిక.. క్యాంపస్ సెలక్షన్స్‌లో టీసీఎస్ సంస్థకు ఎంపికైనా ఉద్యోగంలో చేరలేదు. ఐఏఎస్ అధికారి మోహన్‌కందాను స్ఫూర్తిగా సివిల్స్‌పై దృష్టిపెట్టారు. ‘‘క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో సివిల్స్‌కు ప్రిపేరయ్యాను’’ అని ప్రవళిక చెప్పారు. సామాన్య ఉద్యోగి నుంచి.. బీహెచ్ఈఎల్ పరిశ్రమలో పనిచేసే సామాన్య ఉద్యోగి పి.ఉదయ్‌కుమార్ సివిల్స్‌లో 234 ర్యాంకు సాధించారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామం. తండ్రి గంగాధర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరయ్యారు. ఓయూలో బీఈ, ఈఈఈ కోర్సులు చేసిన ఉదయ్.. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎంబీఏ చేశారు. 2011 నుంచి హైదరాబాద్‌లోని భెల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తూనే పట్టుదలతో సివిల్స్‌కు ప్రయత్నించారు. 2015లో సివిల్స్ రాసి 697 ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐపీఎస్ ట్రెయినింగ్ చేస్తూనే.. మళ్లీ సివిల్స్ పరీక్షలు రాసి 234 ర్యాంకు సాధించారు. ముచ్చటగా మూడోసారి.. నల్లగొండ పట్ణణానికి చెందిన రావిరాల మహేష్ కుమార్ 189 ర్యాంకు సాధించారు. 2011లో మెడిసిన్ పూర్తిచేసిన మహేష్ వైద్య వృత్తిని కాదని సివిల్స్ బాట పట్టారు. తొలిసారిగా 2012లో సివిల్స్ పరీక్ష రాశారు. ఆ తర్వాత వరుసగా 2013, 2014లో సివిల్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వె ళ్లారు. ఈసారి అకుంఠిత దీక్షతో చదివి ర్యాంకు సంపాదించారు. మహేష్ కుమార్ అన్నయ్య రఘునాథ్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అన్న లాగే మహేష్ కూడా ఎంబీబీస్ చదివినా.. తండ్రి ప్రోత్సాహంతో సివిల్స్ వైపు వెళ్లి విజయం సాధించారు. కుటుంబ సభ్యులే స్ఫూర్తి అని మహేష్ తెలిపారు. బీడీఎస్ చేసి.. సివిల్స్ వైపు కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్ టౌన్‌షిప్‌నకు చెందిన మద్దికుంట సిద్ధార్థ సివిల్స్‌లో 419వ ర్యాంకు సాధించారు. గుంటూర్ వికాస్ కాలేజీలో ఇంటర్మీడియెట్, చెన్నైలోని శ్రీరాంచంద్ర మెడికల్ కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసిన సిద్ధార్థ.. సివిల్స్ లక్ష్యంగా ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాడు. అప్పుడు చెల్లి... ఇప్పుడు అక్క కరీంనగర్ జిల్లా ఎర్రబెల్లికి చెందిన ఎల ప్రియాంక 529 ర్యాంక్ సాధించింది. ప్రియాంక చెల్లెలు శశాంక రెండేళ్ల క్రితం ఐఏఎస్‌కు ఎంపికై ప్రస్తుతం ఒడిశాలో సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వరిస్తున్నారు. నారాయణ-లోరా దంపతులకు ప్రియాంక, శశాంక కూతుళ్లు. నారాయణ ఆయుష్ విభాగంలో హైదరాబాద్‌లో ఉద్యోగిగా పనిచేస్తుండగా, లోరా సీసీఎంబీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. ప్రియాంక మహారాష్ట్రలోని మహాత్మాగాంధీ ఇంటర్నేషనల్ మెడికల్ కళాశాలలో 2011లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. పేదరికం, అంగ వైకల్యాన్ని జయించి.. ఒకవైపు పేదరికం, మరో వైపు అంగవైకల్యం. అయినా పట్టు వదలకుండా ఎంచుకున్న లక్ష్యాన్ని చేరేందుకు అహోరాత్రులు శ్రమించారు చామకూరి శ్రీధర్. మొదటి, రెండో ప్రయత్నంలో ఎలాంటి ర్యాంకు రాకున్నా ఈసారి పట్టుదలతో శ్రమించి 348వ ర్యాంకు సాధించారు. ఈయనది నల్లగొండ జిల్లా నూతనకల్లు మండలం మద్దిరాల గ్రామం. సోమయ్య, పద్మ దంపతుల కుమారుడైన శ్రీధర్‌కు మూడేళ్ల వయస్సులో పోలియో సోకడంతో కుడికాలు చచ్చుపడిపోయింది. తండ్రి సోమయ్య తాడిచెట్లు ఎక్కి కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇఇఇ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీధర్.. ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రూ.45వేల జీతంతో కూడిన ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. మంచి ర్యాంకుతో ఐఏఎస్ వస్తుందని వస్తుందని ఆశిస్తున్నారు. ఇంటి వద్దే చదివి.. ఆదిలాబాద్ జిల్లా ఎగ్గాం గ్రామానికి చెందిన నిఖిల్ మొదటి ప్రయత్నంలోనే 794వ ర్యాంకు సాధించాడు. రైతు కుటుంబంలో జన్మించిన నిఖిల్ ఇంటి వద్దనే చదివి ర్యాంకు సాధించడం గమనార్హం. హైదరాబాద్‌లోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సాధించిన నిఖిల్.. సివిల్స్ సాధించాలన్న తపనతో ఉద్యోగం వదిలి సొంతూరికి చేరుకొని ప్రిపేర్ అయ్యారు. ‘‘సివిల్స్‌కు ఇంటి వద్దే ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మంచి ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని ఆయన అన్నారు. పోలీసు అధికారుల పిల్లలకు ర్యాంకులు వరంగల్‌కు చెందిన ఇద్దరు పోలీసు అధికారుల కుమారులు సివిల్స్‌లో మంచి ర్యాంకులు సాధించారు. సిటీ స్పెషల్ బ్రాంచ్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బిరుదరాజు అశోక్‌రాజు కుమారుడు రోహిత్‌రాజు 691వ ర్యాంకు సాధించగా.. నగర అదనపు డీసీపీ యాదయ్య కుమారుడు మాల సహసూర్య 948 ర్యాంకు సాధించారు. పాలమూరు బిడ్డ ప్రతిభ.. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామానికి చెందిన రవితేజయాదవ్ 694 ర్యాంకు సాధించారు. ర్యాంకును బట్టి ఐపీఎస్‌కు ఎంపికయ్యే ఈ అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్(మెకానికల్)ను పూర్తి చేసిన రవితేజ.. గోల్డ్‌మెడల్ అందుకున్నాడు. గేట్ పరీక్షలో 14వ ర్యాంకు సాధించాడు. సవిల్స్లో ‘శ్రీచైతన్య’ విజయదుందుభి సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తమ సంస్థ అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు శ్రీచైతన్య ఐఏఎస్ అకాడమీ తెలిపింది. ఆలిండియా 2వ ర్యాంకుతోపాటు 14, 65, 101, 179, 183, 206, 225, 270, 326.. వంటి 33 సెలక్షన్లతో ప్రభంజనం సృష్టించిందని పేర్కొంది. అనితర సాధ్యమైన క్లాస్‌రూం ప్రోగ్రామ్స్తోతోపాటు సీనియర్ సివిల్ సర్వెంట్ల ఆధ్వర్యంలో మాక్ ఇంటర్వ్యూ శిక్షణ అందిస్తున్నామని శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు తెలిపారు. తెలుగు విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ: ఆర్సీ రెడ్డి ‘‘తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు 2015 సివిల్స్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ర్యాంకులు సాధించిన వారి నేపథ్యాలను పరిగణనలోకి తీసుకుంటే సర్వీసుల పరంగా ఐఏఎస్ సర్వీసులకు ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య కొంత పెరగనుంది. అంతేకాకుండా ఏపీ, తెలంగాణలో దాదాపు ప్రతి జిల్లా నుంచి అభ్యర్థులు ఉండటం హర్షణీయ పరిణామం’’ అని ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ డెరైక్టర్ ఆర్.సి.రెడ్డి పేర్కొన్నారు. -
సివిల్స్ టాపర్ టీనా దాబి
తొలి ప్రయత్నంలోనే మొదటి ర్యాంకు సాధించిన ఢిల్లీ యువతి న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్-2015 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన యువతి టీనా దాబి దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. తన తొలి ప్రయత్నంలోనే టీనా దాబి సివిల్స్‌లో టాప్ ర్యాంక్ దక్కించుకోవడం గమనార్హం. 22 ఏళ్ల టీనా ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. తనకు సివిల్స్‌లో తొలి ర్యాంకు లభించడంపై ఆమె స్పందిస్తూ.. ఇది తాను నిజంగా గర్వపడే సమయమని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన రైల్వే అధికారి అతర్ ఆమిర్ ఉల్ షఫీ ఖాన్ రెండో స్థానం దక్కించుకున్నాడు. అనంత్‌నాగ్‌కు చెందిన 22 ఏళ్ల అతర్ తన రెండో ప్రయత్నంలో సివిల్స్‌లో విజయం సాధించాడు. 2014లో అతను తొలి ప్రయత్నంలో ఇండియన్ రైల్ ట్రాఫిక్ సర్వీస్(ఐఆర్టీఎస్)కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం లక్నోలోని ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇది తన కల నిజమైన సమయమని అతన్ ఫలితాల విడుదల తర్వాత చెప్పాడు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్నీ తాను సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. ఇక ఢిల్లీకే చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి జస్మిత్ సింగ్ సంధు మూడో స్థానం సాధించారు. జస్మిత్ తన నాలుగో ప్రయత్నంలో మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. 2014లో అతను ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికైన జస్మిత్.. ప్రస్తుతం ఫరిదాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్‌లో శిక్షణ పొందుతున్నాడు. తన విజయానికి తల్లిదండ్రులు, టీచర్లే కారణమని చెప్పారు. వెయిటింగ్ లిస్ట్‌లో 172 మంది మొత్తం 1,078 మంది అభ్యర్థులు ఈ ఏడాది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఇందులో జనరల్ కేటగిరీకి చెందిన వారు 499 మంది, ఓబీసీలు 314, ఎస్సీ అభ్యర్థులు 176, ఎస్టీ అభ్యర్థులు 89 మంది ఉన్నారు. మరో 172 మంది అభ్యర్థులను వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సర్వీసుల్లో వీరికి అపాయింట్మెంట్ ఇవ్వాలని యూపీఎస్పీ సిఫారసు చేసింది. -
సివిల్స్‌లో.. దుమ్మురేపారు
ఢిల్లీ: అఖిల భారత సివిల్ సర్వీసెస్-2015 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో ఢిల్లీకు చెందిన టీనా దాబి తొలి ర్యాంక్ సాధించగా, జమ్మూకు చెందిన అమీర్ రెండో ర్యాంక్ సాధించాడు. సివిల్స్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. విశాఖకు చెందిన చేకూరి కీర్తి 14 వర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన జొన్నలగడ్డ స్నేహజ 103వ ర్యాంక్ సాధించారు. (ర్యాంకర్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మొత్తం సివిల్స్‌లో 1078 మంది ఈసారి ఉత్తీర్ణులయ్యారు వాళ్లలో జనరల్ 499, ఓబీసీ 314, ఎస్సీ 176, ఎస్టీ 89 మంది ఉన్నారు ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్ఎస్కు 45 మంది, ఐపీఎస్‌కు 150మంది, కేంద్ర గ్రూప్ ఎ సర్వీసులకు 728 మంది, కేంద్ర గ్రూప్ బి సర్వీసులకు 61 మంది ఎంపికయ్యారు. ర్యాంకుల వివరాలు: ఫస్ట్ ర్యాంక్ - టీనా దాబి (ఢిల్లీ) సెకండ్ ర్యాంక్ - అమీర్ (జమ్మూ) చేకూరి కీర్తి 14 (విశాఖపట్నం) వల్లూరు క్రాంతి 65 సీహెచ్ రామకృష్ణ 84 విద్యాసాగర్ నాయుడు 101 జొన్నలగడ్డ స్నేహజ 103 (హైదరాబాద్) పోతరాజు సాయి చైతన్య 158 నివేదిత నాయుడు 159 వై.రిషాంత్ రెడ్డి 180 పసుమర్తి వీజీ సతీష్ 191 సలిజామల వెంకటేశ్వర్ 216 ప్రవల్లిక 232 ఉదయ్ కుమార్ 234