breaking news
city park
-
నగరానికో నగ..
లకారం సింగారించుకుంది.. కొంగొత్త అందాలతో మురిసిపోతోంది.. నగర ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు సిద్ధమవుతోంది.. కోట్లాది రూపాయల వ్యయం.. అత్యాధునిక వసతులు.. బండ్ చుట్టూ పచ్చికబయళ్లు.. ఆకట్టుకునే నాలుగు వంతెనలు.. చెరువు చుట్టూ ఫెన్సింగ్.. వాకింగ్ ట్రాక్.. అక్కడక్కడ హట్ల నిర్మాణం.. మినీ హోటళ్లు.. ఒక్కసారి వీక్షిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.. ఎన్నో సహజ వనరులున్న ఖిల్లా మెడలో మరో నగ వేసేందుకు లకారం చెరువును అందంగా ముస్తాబు చేయడంతోపాటు భూగర్భ జలాలు పెంపొందించేందుకు.. సాగర్ జలాలు మళ్లిస్తూ తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షిప్రతినిధి, ఖమ్మం : నగరం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు సుందరీకరణ పనులను మిషన్ కాకతీయ–1లో భాగంగా తొలుత రూ.7.78కోట్లతో చేపట్టారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో సుందరంగా తీర్చిదిద్దాలంటే ఈ నిధులు సరిపోవని.. వీటిని పెంచాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరడంతో ఆయన నిధులను రూ.13.59 కోట్లకు పెంచేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. నిత్యం పనులతో సతమతమయ్యే సగటు మనిషి సాయంత్రం వేళ ఇక్కడికొచ్చి సేద తీరాలనే ఉద్దేశంతో వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. చుట్టూ పచ్చటి మొక్కలు, చెరువు నిండా నీరు.. వాకింగ్ ట్రాక్, హట్లు తదితర నిర్మాణాలు చేపట్టారు. ఆయా పనులు పూర్తి చేసేందుకు మొత్తం రూ.24కోట్లు వెచ్చించారు. లకారం చెరువు ఆధునికీకరణ, ట్యాంక్ బండ్ నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడే పరిస్థితి తొలుత ఉండటంతో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని ఒప్పించి.. వివిధ పథకాల ద్వారా నిర్మాణాలకు నిధులను సమకూర్చగలిగారు. ఆక్రమణలకు గురవుతున్న చెరువు నగర ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడం వెనుక అధికారులు, ఎమ్మెల్యే అజయ్ కృషి దాగుంది. సుందరీకరణ ఇలా.. చెరువు చుట్టూ బండ్ నిర్మించి.. పూడికమట్టి తీసి కట్టలను బలపరిచారు. ఫెన్సింగ్‌తోపాటు రివిట్మెంట్ పనులు చేపట్టారు. బండ్‌కు నాలుగు వంతెనలు నిర్మించారు. దీంతోపాటు అలుగు, తూముల పనులు పూర్తి చేశారు. కలెక్టర్ మంజూరు చేసిన రూ.4కోట్లతో చెరువు సుందరీకరణ పనులు చేపట్టారు. చుట్టూ రెయిలింగ్, లాన్, టెయిల్స్, హట్స్ నిర్మాణం చేపట్టారు. మినీ హోటళ్లు, టాయిలెట్లు నిర్మించారు. వీటి మధ్యలో పచ్చదనం పరుచుకున్నట్లుగా మొక్కలు పెంచుతున్నారు. బండ్ చుట్టూ సెంట్రల్ లైటింగ్, ప్రధాన రోడ్డుపై రూ.90లక్షలతో బీటీ రోడ్డు వేస్తున్నారు. దీనికి ప్రధాన ముఖద్వారం మమత రోడ్డు వైపు ఏర్పాటు చేశారు. ఇక్కడ కాకతీయ కళాతోరణం ఆర్చీ తయారు చేశారు. ప్రధాన ద్వారం కాకుండా ట్యాంక్‌బండ్ చుట్టూ నాలుగు ద్వారాలు ఏర్పాటు చేశారు. అలాగే చెరువులో నీటిని నింపేందుకు ఇందిరానగర్ నుంచి ఉన్న మేజర్ కాల్వకు రూ.5కోట్లతో కాంక్రీట్ పనులు చేశారు. సిమెంట్ వాల్స్ వేశారు. చెరువు చుట్టూ తిరిగి చూసేందుకు ఒక బ్యాటరీ కారును ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ తెలంగాణ ప్రముఖ కవులు, ఉమ్మడి జిల్లావాసులు దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ తరహాలో ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు విజ్ఞానాన్ని పెంచే విధంగా పలు నిర్మాణాలు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. భూగర్భ జలాల పెంపు.. లకారం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు భూగర్భ జలాలు పెంచేందుకు అధికారులు ఈ పనులు చేపట్టారు. నగరం కొన్నేళ్లుగా నీటి ఎద్దడి ఎదుర్కొంటుండటం.. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఈ చెరువును ఆధునికీకరించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సాగర్ జలాలతో నీటిని నింపడం వల్ల తాగునీటికి ఉపయోగపడతాయి. 11న ప్రారంభం.. తరలిరానున్న సినీ తారలు లకారం ట్యాంక్‌బండ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈనెల 11 నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆరోజు నుంచి సుందర దృశ్యాలను నగర వాసులు ఆస్వాదించనున్నారు. 11న ఉదయం సినీ తారలచే 5కే రన్ ఏర్పాటు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ట్యాంక్‌బండ్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తమవంతు సహకారం అందించేందుకు అంగీకరించింది. ప్రముఖ సినీ తారలు అందరూ ఆరోజు ఉదయం నగర ప్రజలతో కలిసి 5కే రన్లో పాల్గొననున్నారు. సాయంత్రం 3 గంటలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ట్యాంక్‌బండ్‌ను ప్రారంభిస్తారు. ‘లకారం’తో ఆహ్లాదం అత్యాధునిక వసతులతో లకారం చెరువు వద్ద సుమారు 80 ఎకరాల్లో ట్యాంక్‌బండ్ నిర్మాణం కొనసాగింది. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా నియోజకవర్గానికో ట్యాంక్‌బండ్‌ను ప్రభుత్వం ప్రకటించడం.. ఇదే సమయంలో నగరం నడిబొడ్డున నిర్జీవంగా, గుర్రపుడెక్కతో ఉన్న లకారం చెరువుకు పునరుజ్జీవం కల్పించి.. అందరికీ ఉపయోగపడేలా సుందరీకరణ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నా. మిషన్ కాకతీయలో మంజూరైన రూ.7.78కోట్లు సరిపోయే అవకాశం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన రూ.13 కోట్లకు పెంచేలా చేశారు. ఆ నిధులతో పనులు వేగవంతం కావడంతోపాటు వివిధ శాఖల నుంచి నిధులు సమకూరాయి. రాష్ట్ర, జిల్లా ప్రముఖుల గురించి భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా వారి విగ్రహాలను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నాం. ట్యాంక్‌బండ్ నిర్మాణంలో జిల్లా అధికారులు, మంత్రి తుమ్మల సహకారం మరచిపోలేనిది. – పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే -
సిటీ పార్కుగా గార్గేయపురం చెరువు
–జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): గార్గేయపురం చెరువును సిటీ పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ తన చాంబరులో సమీక్ష నిర్వహించారు. అటవీ, టూరిజం, ఇరిగేషన్ పంచాయతీరాజ్ శాఖల అధికారులు సంయుక్తంగా గార్గేయపురం చెరువును సిటీ పార్కుగా అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులు ఇస్తానని వివరించారు. కర్నూలు ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే విధంగా పార్కును తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇక్కడ నెమళ్లు ఇతర ఆకర్షణీయమైన పక్షుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. చిన్నచిన్న కాటేజీలు ఏర్పాటు చేయడంతోపాటు రెస్టారెంటు కూడ నిర్మించాలన్నారు. సంగమేశ్వరంలో రెండు బోట్లు ఉన్నాయని అందులో ఒకదానిని గార్గేయపురం చెరువుకు తీసుకురావాలన్నారు. సమావేశంలో అటవీశాఖ కన్జర్వేటర్ జేఎస్ఎన్ మూర్తి, కర్నూలు డీఎఫ్ఓ చంద్రశేఖర్, జిల్లా పర్యాటకశాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.