breaking news
chirala constituency
-
చీరాల ఇన్చార్జి ఆమంచే.. స్పష్టం చేసిన బాలినేని
సాక్షి, ఒంగోలు: చీరాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహనేనని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇక మీదట కూడా ఆయనే కొనసాగుతారని స్పష్టం చేశారు. మంగళవారం మంత్రి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలన్నీ ఆమంచి నేతృత్వంలోనే జరుగుతాయని చెప్పారు. ఇందులో ఎటువంటి అపోహలకూ తావు లేదని పునరుద్ఘాటించారు. ఆమంచి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని బాలినేని పిలుపునిచ్చారు. -
చీరాలలో ఈవీఎంల కలకలం
చీరాల, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చీరాల నియోజకవర్గంలో ఈవీఎంలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని, అందుకు అధికారులు ఓ అభ్యర్థికి పూర్తిగా సహకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా అధికారుల ఈవీఎంల తరలింపు ప్రయత్నం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు సందర్భంగా అధికారులు ఓ స్వతంత్ర అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించి అతని గెలుపునకు కారణమయ్యారంటూ ఫలితాల అనంతరం నుంచి చీరాలలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పట్టణ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. వివరాలు.. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా స్థానిక వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రావడంతో అప్పటి వరకు అక్కడే ఉన్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది వాహనాల్లో వెళ్లిపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఎన్నికల కోసం తెచ్చిన ఈవీఎంలను ఇప్పటి వరకు చీరాలలో ఉంచడంతో పాటు వాటిని అందరికీ అనుమానం వచ్చే రీతిలో రాత్రి వేళలో పోటీ చేసిన అభ్యర్థులకు సమాచారం కూడా ఇవ్వకుండా రహస్యంగా తరలించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.ఈవీఎంల తరలింపు వ్యవహారం బయటకు పొక్కడంతో పాటు టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. ఈవీఎంలు భద్రపరిచిన వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులెవ్వరూ అక్కడకు రాకపోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గ ఫలితాలపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పాటు ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టింది. సోమవారం రాత్రి రెవెన్యూ శాఖకు చెందిన ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్, పోలింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న వ్యక్తి, మున్సిపల్ సిబ్బంది కలిసి వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నం చేశారు. గది సీల్ తీసే ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్న కళాశాల వాచ్మెన్ తమ ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఈ సమయంలో తీసుకెళ్తే తనకు ఇబ్బంది అవుతుందని, ప్రిన్సిపాల్ అనుమతి తీసుకోవాలన్నాడు. ఎన్నికల డీటీ ఝాన్సీరాణి కూడా వాటిని తీసుకెళ్లేందుకు అంగీకరించనట్లు సమాచారం. మిగిలిన వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఈ విషయం టీడీపీ, వైఎస్సార్ కార్యకర్తలకు తెలిసింది. పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు, నాయకులను చూసి రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది రెండు కార్లలో అక్కడి నుంచి జారుకున్నారు. టీడీపీ కార్యకర్తలు తమ వాహనాల్లో వెంబడించినా వారు కనిపించకుండా వెళ్లిపోవడం గమనార్హం.