breaking news
china fire accident
-
రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం.. 17 మంది దుర్మరణం
బీజింగ్: చైనాలోని ఈశాన్య నగరం చాంగ్‌చున్‌లో బుధవారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగి భోజనం చేసేందుకు వెళ్లిన వారితో పాటు మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. రెస్టారెంట్లో అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనల కారణాలతో చైనాలో తరుచుగా ఘోర అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం చైనా టెలికాం కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే.. ఆ సమయంలో ఎవరూ లేకపోవటం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పింది. గత ఏడాది జులైలో ఓ గోదాంలో జరిగిన ప్రమాదంలో 15 మంది మరణించారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదీ చదవండి: చైనా మాస్టర్ ప్లాన్.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు! -
100 మందిపైగా చిన్నారులకు తప్పిన ముప్పు
బీజింగ్: వందమందిపైగా చిన్నారులు చైనాలో అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డారు. తూర్పు ఫుజియన్ ప్రావిన్స్ లో షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పూల దుకాణంలో రేగిన మంటలు కిండర్ గార్డెన్ పాఠశాల ఉన్న రెండో అంతస్థుకు వ్యాపించాయి. మంటల బారి నుంచి కొంతమంది చిన్నారులను అక్కడున్న పెద్దవాళ్లు కాపాడారు. మిగతా పిల్లలను అగ్నిమాపక సిబ్బంది రక్షించారని స్థానిక మీడియా తెలిపింది. గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలు వెల్లడికాలేదు.