breaking news
chief tricks
-
‘ఛీ’ప్ ట్రిక్స్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ పథకం ఒక బృహత్తర కార్యక్రమం. జిల్లాలో 8.31 లక్షల కార్డుదారులకు నేరుగా సరఫరా చేసే టాస్క్ ఇది. అధికారులు ప్రణాళికబద్ధంగా రాత్రింబవళ్లు కష్టపడి ఆచరణలో పెట్టిన పైలెట్ ప్రాజెక్టు ఇది. చరిత్రలో ఎక్కడా లేని విధంగా తలపెట్టిన వినూత్న సంక్షేమ కార్యక్రమమిది. అనుకున్నట్టుగానే శనివారం ఇంటి ముంగిటకే నాణ్యమైన బియ్యం బ్యాగులు చేరాయి. తొలిరోజే 92 శాతం మేర పంపిణీ పూర్తయింది. లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం కనిపించిది. జిల్లా అంతటా సంతోషం వ్యక్తమవుతోంది. కానీ ఇది టీడీపీ నేతలకు మాత్రం కంటగింపుగా మారింది. ఇంటింటికీ నాణ్యమైన బియ్యం బ్యాగులు చేరుకునేసరికి ఆ పార్టీ నేతలకు వణుకుపుట్టింది. పునాదులు కదులుతాయేమోనన్న భయం పట్టుకుంది. ఇంకేముంది తమకు అలవాటైన చీప్ పబ్లిసిటీని నమ్ముకున్నారు. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పంపిణీ చేస్తున్న నాణ్యమైన బియ్యంపై బురద చల్లే కార్యక్రమానికి ఒడిగట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు రవాణా సమయంలో తడిసిన బ్యాగులను పట్టుకుని రాద్ధాంతం చేశారు. వాస్తవమేంటో తెలుసుకోకుండా నాణ్యత లేని బియ్యమంటూ దుష్ప్రచారానికి దిగారు. జిల్లాలో శనివారం ఒక్కరోజే శతశాతం పంపిణీ చేసేందుకు కలెక్టర్ జె.నివాస్ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శనివా రం సాయంత్రానికి జిల్లావ్యాప్తంగా 92 శాతం మేర పంపిణీ జరిగింది. సీతంపేట ప్రాంతంలో వర్షం కురిసిన కారణంగా, కొంతమంది ఇళ్ల వద్ద లేని కారణంగా పంపిణీలో కొంతమేర జాప్యం చోటు చేసుకుంది. మిగతా అన్నిచోట్ల ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో ఇళ్ల వద్దకే నాణ్యమైన బియ్యం చేరాయి. బూర్జ మండలం లాబాం గ్రామంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. నరసన్నపేలో మంత్రి ధర్మాన కృష్ణదాస్, రేగిడి మండలంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, మెళియాపుట్టిలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, లావేరు మండలంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, వీరఘట్టంలో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం సందడిగా సాగింది. తడిసిన బియ్యాన్ని పట్టుకుని టీడీపీ రాద్ధాంతం.. జిల్లావ్యాప్తంగా 9 లక్షల 36 వేల 941 బ్యాగులను పంపిణీ చేస్తుండగా వాటిలో 30 బ్యాగుల వరకు తడిసినవి బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి రవాణా సమయంలోనూ, చౌక ధరల దుకాణాలు, గిడ్డంగులలో వసతి వలన ఇ టీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని బస్తాలు తడవడం వలన బియ్యంలో తేడా వచ్చింది. లబ్ధిదారులు తెలియజేయగానే వాటిని అధికారులు రీప్లేస్ చేశారు. కానీ టీడీపీ నాయకులు వాటిని పట్టుకుని ముక్కిపోయిన బియ్యంగా చూపిస్తూ ప్రచారం చేయడం ప్రారంభించారు. అధికారులు తక్షణమే మార్చినప్పటికీ వాటి ని చూపించి నానా యాగీ చేశారు. నిజానికి గతంలో బియ్యంలో ఊక, బొత్తు, మ ట్టి రాళ్లు కలిసి ఉండేవి. 25శాతం నూకలు ఉండేవి. ఇప్పుడు నాణ్యమైన బియ్యం లో ఊక, బొత్తు, మట్టి రాళ్లు లేవు సరికదా.. నూకలు 10 శాతానికి తగ్గాయి. టీడీపీ వ్యూహాత్మక కుట్ర.. నాణ్యమైన బియ్యం పథకంపై బురద జల్లేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా కుట్ర పన్నింది. కొత్త విధానంతో తమకెక్కడ ఇబ్బంది వస్తుందోనని గత ప్రభుత్వంలో నియమితులైన దాదాపు 250 డీలర్లను చేతిలో పెట్టుకుని అసత్య ప్రచారం కోసం లీకులు ఇప్పించడం ప్రారంభించారు. ఇప్పటికే మీరేం చేయలేరని... ఎలా చేస్తారో చూస్తామని... వలంటీర్ బాధ్యతలు కష్టమని... వలంటీర్లను బెదిరించే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే, కార్డుదారులు కూడా తప్పనిసరిగా రూ.300 చేతిలో ఉంచుకోవాలని, ప్రభుత్వమిచ్చిన అన్ని సరుకులు విడిపించుకోవాలని భయపెడుతున్నారు. వాస్తవానికైతే, ఎవరికి ఏ సరుకులు కావాలో వాటిని విడిపించుకునే అవకాశం ఉంది. కానీ, ఏదో ఒకటి చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని అదే పనిగా పథక రచన చేస్తున్నారు. అందులో భాగంగానే నాణ్యమైన బియ్యం పంపిణీ తొలి రోజున ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన బియ్యాన్ని పట్టుకుని దుష్ప్రచారానికి ఒడిగట్టారు. తగిన సమాధానం ఇచ్చేలా అధికారులు వెంటనే తడిసిన బియ్యం అందిన చోట రీప్లేస్ కూడా చేశారు. కానీ టీడీపీ నాయకులు అదే పనిగా అసత్యాలతో పబ్బం గడుపుకోవడానికి యత్నించారు. -
కుయుక్తులు
సాక్షి ప్రతినిధి, కడప: నవ్విపోదురుగాక..నాకేటి సిగ్గు.. అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ వైఖరి ప్రస్పుటం అవుతోంది. ప్రజాతీర్పుకు భిన్నంగా అనైతిక పద్ధతుల్లో జెడ్పీపీఠాన్ని దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ప్రలోభాలకు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు తలొగ్గక పోవడంతో తాత్కాలికంగా చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించాలనే ఆలోచనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు శాంతిభద్రతలను సాకుగా చూపించే చీప్‌ట్రిక్స్ ప్లే చేసేందుకు ఓ ఎంపీ నేతృత్వంలో తెలుగుతమ్ముళ్లు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ పీఠం కైవసమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ చురుగ్గా పావులు కదిపింది. ప్రజాతీర్పుకు భిన్నంగా, అప్రజాస్వామ్యక పద్ధతులను అవలంభించింది. అధికారిక హోదాను వినియోగించుకుని చైర్మన్‌గిరీని సొంతం చేసుకునేందుకు కుటిల యత్నాలకు ముమ్మరంగా చేపట్టింది. కేవలం 11 జెడ్పీటీసీల బలం మాత్రమే ఉన్నప్పటికీ మరో 15మంది కోసం తీవ్రస్థాయిలో ప్రలోభాలకు శ్రీకారం చుట్టిది. ఇవేవీ ఫలించకపోవడంతో తాత్కాలికంగా చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని శాంతిభద్ర తలను సాకుగా చూపించాలనే ఎత్తుగడలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం ఓ ఎంపీ నేతృత్వంలో సాగుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే లేనిబలంతో జెడ్పీని కైవసం చేసుకుంటామని ప్రకటించి, ఆమేరకు అనేక యుక్తులు ప్రద ర్శించి తెలుగుదేశం పార్టీ ప్రజల్లో పలుచబడిందని ఆపార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. డీసీసీబీ చైర్మన్ ఎన్నికలను మరిపించేలా.... జిల్లాలో డీసీసీబీ చైర్మన్ ఎన్నికల్లో రాజ్యమేలిన కుట్రలు, కుతంత్రాలను జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో కూడా ప్రవేశ పెట్టాలనే తలంపుతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎంపీ ఉన్నట్లు సమాచారం. అయితే సహకార చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆమేరకు ఆ ఎన్నికలను వాయిదా వేయించారు. అదే విధంగా శాంతిభద్రతల సమస్యను తెరపైకి తెచ్చి ప్రభుత్వం ద్వారా జెడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పంచాయితీరాజ్ చట్టంలో ఇలా సాధ్యం కాదని న్యాయనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. స్థానిక సంస్థల చైర్మన్ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆమేరకు జిల్లా ఎన్నికల అధికారి జెడ్పీ చైర్మన్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు. డీసీసీబీ చైర్మన్ ఎన్నికకు, జెడ్పీ చైర్మన్ ఎన్నికకు పొంతనే ఉండదని అధికార పార్టీ నేతలు అభాసుపాలు కావాల్సిందేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గామస్థాయి ఎంపీటీసీ మారాలంటేనే కష్టంగా ఉందని అలాంటి పరిస్థితుల్లో ఏకంగా 15మంది జెడ్పీటీసీలు మారడం అసాధ్యమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కాగా ‘కొత్త భిక్షగాడు పొద్దు ఎరగడు’ అన్నట్లుగా టీడీపీ కీలకనేత వైఖరి ఉంటున్నదని ఆపార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి వారికి ‘కనకపు సింహాసనాన్ని’ అప్పగించడంతోనే పార్టీ ప్రజల్లో పలుచబడి పోతున్నదని ఆయన వాపోయారు. ఇప్పటికైనా కుయుక్తులకు పుల్‌స్టాప్ పెట్టి, ప్రజాతీర్పును హుందాగా స్వీకరించడం ద్వారా పార్టీ గౌరవాన్ని నిలపాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొందరు టీడీపీ నేతలు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు పంపినట్లు సమాచారం.