breaking news
Breath Analysis
-
మద్యం తాగి విమానం ఎక్కబోయిన పైలట్
ముంబై: విమానం ఎక్కడానికి ముందు జరిపిన శ్వాస విశ్లేషణ పరీక్షల్లో పైలట్ విఫలం కావడంతో అతణ్ని ప్రభుత్వ సంస్థ ఎయిరిండియా విధుల నుంచి తప్పించింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన ఏఐ–111 విమానానికి కెప్టెన్ ఏకే కఠ్పాలియా పైలట్‌గా వ్యవహరించాల్సి ఉంది. అయితే అతను మద్యం తాగినట్లు రెండుసార్లు పరీక్షల్లో తేలడంతో అతని స్థానంలో మరో పైలట్‌ను విధులకు రప్పించాల్సి వచ్చింది. దీంతో విమానం 55 నిమిషాలు ఆలస్యమై ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని ఎయిరిండియా అధికారి చెప్పారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం విమానంలో ప్రయాణించాల్సిన సిబ్బంది ఎవ్వరూ ప్రయాణ సమయానికి 12 గంటల ముందు నుంచి మద్యం సేవించకూడదు. కాగా, ఆదివారమే ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన మరో ఎయిరిండియా విమాన పైలట్ పొరపాటున శ్వాస విశ్లేషణ పరీక్షలో పాల్గొనకపోవడంతో విమానం ఆరు గంటలు ఆలస్యమైంది. 200 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి విమానం సరైన సమయానికే బయలుదేరినా, శ్వాస విశ్లేషణ పరీక్ష కోసం మళ్లీ ఢిల్లీ విమానాశ్రయానికి విమానాన్ని తీసుకురావాల్సి వచ్చింది. -
జీఎంఆర్ ఏవియేషన్‌కు షాక్
న్యూఢిల్లీ: భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించారంటూ జీఎంఆర్ ఏవియేషన్ కంపెనీకి చెందిన 11 మంది పైలట్లను, ఆరుగురు క్యాబిన్ సిబ్బందిని డీజీసీఏ మూడు నెలలపాటు పక్కన పెట్టింది. గత నెలలో జీఎంఆర్ ఏవియేషన్ సిబ్బంది నిర్బంధ పరీక్షలను ఎగ్గొట్టి పలు విమానాలు నడిపారని డీజీసీఏ వర్గాలు బుధవారం వెల్లడించాయి. గత సోమవారం రాహుల్ గాంధీని భువనేశ్వర్‌కు తరలించిన విమానం కూడా ఇందులో ఉందని పేర్కొన్నాయి. విమానాన్ని నడపడానికి ముందు పైలట్లకు, క్యాబిన్ సిబ్బందికి శ్వాస పరీక్ష(బ్రీత్ అనాలిసిస్) నిర్వహించాల్సి ఉండగా దాన్ని ఎగ్గొట్టారు. ఈ పరీక్షలు నిర్వహించే బ్రీత్ అనలైజర్ అసలు పనిచేయడమే లేదని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. మార్చి 12 నుంచి ఈ నెల 14 వరకు జీఎంఆర్ ఫ్లయింగ్ రికార్డులను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ పరిశీలించింది. ముందస్తు పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పొందుపర్చినట్లు తమకు ఆధారాలు లభించాయని డీజీసీఏ అధికారులు పేర్కొన్నారు. రెండు విమానాలు కలిగిన జీఎంఆర్ ఏవియేషన్ కార్యకలాపాలు డీజీసీఏ నిర్ణయంతో దాదాపు స్తంభించినట్లయింది. ఏ పరీక్షలనూ ఎగ్గొట్టలేదు: జీఎంఆర్ డీజీసీఏ ఆరోపణలను జీఎంఆర్ ఏవియేషన్ తీవ్రంగా ఖండించింది. తాము ఏ పరీక్షనూ ఎగ్గొట్టలేదని డీజీసీఏకు లేఖ రాశామనీ, పక్కనపెట్టిన పైలట్లను, క్యాబిన్ సిబ్బందిని త్వరలోనే మళ్లీ తీసుకుంటారని ఆశిస్తున్నామనీ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రింటర్ మినహా బ్రీత్ అనలైజర్ చక్కగా పనిచేస్తోందని చెప్పారు. శ్వాస పరీక్షను సిబ్బంది ఎగ్గొట్టలేదనీ, డాక్టర్లు కూడా తప్పుడు రిపోర్టులు ఇవ్వలేదనీ ఆయన స్పష్టం చేశారు. గత నెలలో నడిపిన అన్ని విమానాలకు సంబంధించి పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించినట్లు ఇన్చార్జ్ డాక్టరు సర్టిఫై చేశారని తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా ఆయా పరీక్షల ప్రింటెడ్ రిపోర్టులు రాలేదని చెప్పారు. నేతలకు మోజు... భువనేశ్వర్‌లో ఎన్నికల ప్రచా రం కోసం రాహుల్‌గాంధీ ఇటీవలే ప్రయాణించిన జీఎంఆర్ ఫాల్కన్ 2000-ఎల్ఎక్స్ విమానాన్ని ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులు విస్తృతంగా వినియోగిస్తుంటారు. జీఎంఆర్‌కే చెందిన హాకర్ -750 విమానాన్నీ, 2 బెల్ హెలికాప్టర్లనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నాన్- షెడ్యూల్డ్ ఆపరేటర్ల కార్యకలాపాలను డీజీసీఏ గత నెలలో ఆకస్మికంగా తనిఖీ చేసింది. కార్పొరేట్ల మొదలు రాజకీయ నాయకుల వరకు పలువురికి చెందిన విమాన సర్వీసులను పరిశీలించింది. ఎన్నికల సీజను కావడంతో రాజకీయ ప్రముఖులు ప్రైవేటు విమానాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. జీఎంఆర్ ఏవియేషన్‌కు చెందిన 11 మంది పైలట్లను, ఆరుగురు క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా పక్కన పెట్టడంతో నేతలు ఇతర కంపెనీల విమానాలపై ఆధారపడాల్సిందే.