breaking news
The blood test
-
ఆయుర్వేద కౌన్సెలింగ్
మెనోపాజ్ సమస్యలకు పరిష్కారాలు నా వయసు 48 ఏళ్లు. ఇద్దరు పిల్లలకు తల్లిని. ఏడాదిగా బరువు పెరుగుతున్నాను. నెలసరి సక్రమంగా రావడం లేదు. అలాగని పూర్తిగా ఆగిపోలేదు. ఒళ్లంతా నొప్పి, నీరసం, అప్పుడప్పుడు చెమటలు పట్టడం, ముఖం వేడెక్కినట్లు, ఉబ్బినట్లు అనిపిస్తోంది. చిన్న విషయాలకే చిరాకు, కోపం వస్తోంది. మా స్నేహితురాళ్లు... ఇది మెనోపాజ్ వయసు గనక అలాగే ఉంటుంది, ఏం పరవాలేదంటున్నారు. నాలో ఆందోళన ఎక్కువవుతోంది. ఆయుర్వేదంలో పరిష్కారం సూచించ ప్రార్థన. - రత్నకుమారి, నిజామాబాద్ ముందుగా మీరు రక్తపరీక్ష చేయించుకొని, ప్రధానం హీమోగ్లోబిన్ స్థాయి, చక్కెరవ్యాధికి సంబంధించిన వివరాలు సరిచూసుకోండి. అలాగే బీపీ కూడా చూపించుకోండి. స్త్రీలలో బహిష్టులు పూర్తిగా ఆగిపోవడానికి ముందుగా కొంతకాలంపాటు, బహిష్టులు ఆగిపోయిన అనంతరం కొంతకాలంపాటు శారీరకంగా, మానసికంగా చాలామార్పులు సంభవించడం, అందువల్ల చాలా లక్షణాలతో బాధపడటం సహజం. ఈ సమస్యను ‘మెనోపాజ్’గా చెబుతారు. ఈ ప్రక్రియ 45-55 ఏళ్ల వయసులో సంభవిస్తుంది. వయసు పైబడుతున్న దశగా దీన్ని పరిగణించాలి. ఇక్కడ వాతదోషం ప్రధానంగానూ, పిత్తదోషం అనుబంధంగానూ చోటుచేసుకొని, స్త్రీల హార్మోన్లలో విశిష్టమైన తేడాలు కనిపిస్తాయి. అందువల్లనే ఈ దశను వ్యాధిగా కాకుండా, ప్రకృతిలో మార్పుగానే పరిగణించాలి. పైన చెప్పిన వివిధ లక్షణాలను నియంత్రిస్తూ, వ్యక్తులు ఇబ్బంది పడకుండా, ఆ వయసుకు సంబంధించిన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఆయుర్వేదం ఈ కింది ప్రక్రియలను నిర్దేశించింది. ఆహారం : ఉప్పు, పులుపు, మసాలాలు, కారాలను గణనీయంగా తగ్గిస్తూ, పోషకవిలువలను సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. పీచుపదార్థాలు అధికంగా ఉండే శాకాహారం, ఆకుకూరలు, తాజాఫలాలు, ఎండిన ఫలాలు ప్రతినిత్యం తినాలి. నూనెలను మరిగించడం ద్వారా తయారు చేసే వంటకాలను దూరం చేయాలి. ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు, పిజ్జాల వంటి పదార్థాలను త్యజిస్తూ, ప్రకృతిసిద్ధమైన ఆహారాలను సేవించడం మంచిది. ఉదా: కొబ్బరినీళ్లు, చెరకురసం, వెజిటబుల్ జ్యూసులు, ఖర్జూరం, పాలు, పెరుగు వంటివి. మొత్తంమీద రోజూ 4-5 లీటర్ల వరకు ద్రవపదార్థాలు తాగాలి. ప్రధానంగా నీరు, మజ్జిగ, బార్లీ మొదలైనవి. పుల్కాలు లేదా ముడిబియ్యంతో వండిన అన్నం మంచిది. నువ్వుల పప్పు ప్రతిరోజూ ఉదయం 2 చెంచాలు, సాయంత్రం రెండు చెంచాలను నమిలి తింటే క్యాల్షియమ్ అధికంగా లభిస్తుంది. మొలకెత్తే దినుసులు కూడా మంచిదే. పచ్చికొబ్బరీ అవసరమే. విహారం : ప్రాతఃకాలంలో నిద్రలేవడం, రాత్రి 10కల్లా పడుకోవడం చాలా అవసరం. రోజూ ఉదయం లేలేత సూర్యకిరణాలలో ఓ అరగంటపాటు ఉండాలి. అలాగే ఒక అరగంట వ్యాయామం (ఉదా: నడక, యోగాసనాలు, ఆటలు) చేయాలి. ఓ పది నిమిషాలు ప్రాణాయామం చేయడం అవసరం. మద్య, ధూమపానాలకు దూరంగా ఉండాలి. శ్రావ్యమైన సంగీతం వినడం చాలా మంచిది. ఔషధం: శతావరెక్స్ (గ్రాన్యూల్స్) ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా పాలతో తాగాలి సరస్వతీ లేహ్యం: ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా తినాలి పునర్నవాది మండూర (మాత్రలు) ఉదయం ఒకటి, రాత్రి ఒకటి అధికరక్తస్రావం ఉంటే ‘బోలబద్ధరస’ మాత్రలు ఉదయం 2, మధ్యానం 2, రాత్రి 2 ఇలా రోజుకి ఆరు వరకు వాడవచ్చు. గమనిక : మధుమేహం, హైబీపీ వంటి ఇతర వ్యాధులు ఉంటే వాటిని అదుపులోకి తేవాలి. అవసరమైతే ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ‘శిరోధారా చికిత్స’ చేయించుకోవడం వల్ల మానసిక వికారాలు పూర్తిగా తగ్గిపోతాయి. గృహవైద్యం : శొంఠి, ధనియాలు, జీలకర్ర... ఈ మూడింటిని కషాయంలాగా కాచుకొని ఉదయం ఆరు చెంచాలు, సాయంత్రం ఆరు చెంచాలు తాగాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
ఎన్నాళ్లీ నిర్లక్ష్యం
సాక్షి, గుంటూరు: జిల్లాలో వ్యాధి నిర్ధారణకు ఏర్పాటు చేసే రక్త పరీక్ష కేంద్రాలు, ఎక్స్‌రే, స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకుని లెసైన్స్ కలిగి ఉండాలి. పెరుగుతున్న వ్యాధులకు సమానంగా పరీక్ష కేంద్రాలు పుట్టుకొచ్చాయి. మండల కేంద్రాలతోపాటు, గ్రామాల్లో కూడా వెలుస్తున్నాయి. ఇవి రోగులకు అందుబాటులో ఉంటున్నా వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలకు విరుద్ధంగా లెసైన్స్‌లు లేకుండా నిర్వహించడమే ప్రాణాంతకంగా మారుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్‌లు, ఎక్స్‌రే సెంటర్లు ఏర్పాటు చేయాలంటే సంబంధిత పారామెడికల్ కోర్సులు పూర్తిచేసి సర్టిఫికెట్ పొందాలి. ఆ తరువాతే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి లెసైన్స్ మంజూరు చేస్తారు. లెసైన్స్ ఫీజుతోపాటు అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్పాల్సి రావడంతో వ్యయం ఎక్కు వ అవుతుందని భావిస్తున్న అనేక మంది అనుమతుల జోలికి వెళ్లడం లేదు. మరి కొందరు వేరొకరి సర్టిఫికెట్తో లెసైన్స్ పొంది అర్హత లేని వ్యక్తులతో పరీక్షలు చేయిస్తున్నారు. వ్యాధి నిర్ధారణలో వైద్య పరీక్షలు కీలకంగా మారిన తరుణంలో అర్హత లేని వ్యక్తులు ఇస్తున్న రిపోర్టులు ఏ మేరకు వాస్తవమనేది ఆలోచించాల్సిన విషయమే. అర్హత లేకుండా తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్ల సరైన వైద్యం అందక రోగులు మరణిస్తున్న సందర్భాలు ఉన్నాయని వైద్యులే అంగీకరిస్తున్నారు. మెడికల్ దుకాణాలు ఇంతే.. మెడికల్ షాపులు సైతం లెసైన్స్ లేకుండా నడుస్తున్నాయి. మరికొందరు వేరేవారి బీఫార్మ్సీ సర్టిఫికెట్తో లెసైన్స్ సంపాదించి ఎలాంటి అర్హత లేని నలుగురు యువకులను నియమించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్లు రాసిన మందులు అర్థంకాక చేతికొచ్చినవి ఇచ్చి పంపుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రోగాలు తగ్గడం మాట అటుంచి కొత్త రోగాలు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. మామూళ్లు అందుకుంటూ... జిల్లాలో లెసైన్స్‌లు లేని ల్యాబ్‌లు, ఎక్స్‌రే కేంద్రాలు, మెడికల్ షాపులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదోఒక సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి చేతులు దులుపుకోవడం వీరికి పరిపాటిగా మారిందనే విమర్శలు వినవస్తున్నాయి. నెలనెలా మామూళ్లు వసూలు చేస్తూ వారిపై చర్యలు తీసుకోకుండా మిన్నకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అధికారులే మామూళ్లు తీసుకుంటూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఇక తమగోడు ఎవరికి చెప్పుకోవాలంటూ రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే రోగుల ప్రాణాలు నిలిపిన వారవుతారు.