breaking news
Bijapur encounter
-
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ నెత్తుటిధార
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/బీజాపూర్/కాంకేర్/న్యూఢిల్లీ: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్ మరోసారి రక్తమోడింది. బస్తర్ అడవుల్లో నెల రోజులుగా నిశ్శబ్ద వాతావరణం ఉండగా గురువారం ఒక్కసారిగా తుపాకులు గర్జించాయి. బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో కనీసం 30 మంది మావోయిస్టులు మరణించారు. దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పశ్చిమ బస్తర్ డివిజన్‌కు చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్జీ, టాస్‌్కఫోర్స్, సీఆర్పీఎఫ్కు చెందిన సుమారు 700 మంది భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఉదయం 7 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. కాల్పుల అనంతరం ఘటనాస్థలిలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా మధ్యాహ్నం సమయానికి 18 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించగా, సాయంత్రం 6 గంటల సమయానికి ఈ సంఖ్య 26కు చేరింది. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున ఏకే 47, ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలను స్వా«దీనం చేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ ప్రకటించారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక జవాను వీరమరణం పొందినట్లు వెల్లడించారు. మావోల మృతదేహాలను జిల్లా కేంద్రమైన బీజాపూర్‌కు తరలించారు. కాంకేర్–నారాయణపూర్ మధ్య.. మరో ఘటనలో కాంకేర్–నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉత్తర బస్తర్–మాడ్ డివిజన్ కమిటీ సమావేశమైందనే సమాచారంతో రెండు జిల్లాల భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఉదయం 8 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు కాంకేర్ ఎస్పీ ఇందిరా కల్యాణ్ ప్రకటించారు. భారీగా ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ మృతులను నారాయణ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ రెండు చోట్లా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నారాయణపూర్ జిల్లాలో తుల్తులీ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. టీసీఓఏను దాటుకుని.. ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది చివరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు భద్రతా దళాలు ఉధృతంగా దాడులు చేశాయి. ఈ దాడుల్లో జనవరిలో 50 మంది, ఫిబ్రవరిలో 40 మంది మావోయిస్టులు చనిపోయారు. అయితే మార్చిలో వేసవి రావడంతో ట్యాక్టికల్ కౌంటర్ ఆఫెన్సివ్ క్యాంపెయిన్ (వ్యూహాత్మక ఎదురుదాడులు, టీసీఓఏ) పేరుతో మావోలు ఎదురుదాడికి సిద్ధమయ్యారు. దీంతో గత నెల రోజులుగా నెమ్మదించిన భద్రతా దళాలు గురువారం దూకుడు కనబరిచాయి. దీంతో రెండు ఎన్కౌంటర్లలో 30 మంది మావోలు చనిపోయారు. మొత్తంగా ఈ ఏడాదిలో 120 మంది మావోయిస్టులు చనిపోవడం గమనార్హం. ఏడాదిలోగా మావోయిస్టురహిత భారత్: అమిత్ షా ‘నక్సల్ ముక్త్ భారత్ అభియాన్’ దిశగా భద్రతా బలగాలు మరో గొప్ప విజయం సాధించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారని గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నిషేధిత సీపీఐ(మావోయిస్టు) సభ్యులపై మోదీ ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తోందని స్పష్టంచేశారు. లొంగిపోతే అన్ని రకాల వసతులు కల్పిస్తామని హామీ ఇస్తున్నా.. కొందరు లెక్కచేయడం లేదన్నారు. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, తగిన చర్యలు కచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి భారత్.. మావోయిస్టురహిత దేశంగా మారడం తథ్యమని అమిత్ షా పునరుద్ఘాటించారు. మరో ఏడాదిలోగా మావోయిస్టులను పూర్తిగా అంతం చేయబోతున్నట్లు సంకేతాలిచ్చారు. మోదీ పాలనలో మావోయిస్టులకు చావుదెబ్బ 2025లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 104 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మరో 164 మంది లొంగిపోయారని పేర్కొంది. 2024లో 290 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించగా, 1,090 మంది అరెస్టయ్యారని, 881 మంది లొంగిపోయారని తెలిపింది. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల వ్యవధిలో 16,463 మావోయిస్టు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, మోదీ సర్కారు వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 దాకా వీటి సంఖ్య 53 శాతం తగ్గిపోయిందని, పదేళ్లలో కేవలం 7,744 హింసాత్మక ఘటనలు జరిగాయని హోంశాఖ స్పష్టంచేసింది. అదే సమయంలో మావోయిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది సంఖ్య 1,851 నుంచి 509కు పడిపోయినట్లు తెలిపింది. సాధారణ పౌరుల మరణాల సంఖ్య 4,766 నుంచి 1,495కు తగ్గిపోయినట్లు పేర్కొంది. 2004–14తో పోలిస్తే 2014–24లో భద్రతా సిబ్బంది మరణాలు 73 శాతం, పౌరుల మరణాలు 70 శాతం పడిపోయాయని ఉద్ఘాటించింది. 2014లో దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 126 ఉండగా, 2024లో కేవలం 12 మాత్రమే ఉన్నాయని ప్రకటించింది. మావోయిస్టుల నియంత్రణ కోసం గత ఐదేళ్లలో కొత్తగా 302 సెక్యూరిటీ క్యాంప్‌లు, 68 నైట్ ల్యాండింగ్ హెలిప్యాడ్లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ వివరించింది. మృతుల్లో అగ్రనేతలు?బీజాపూర్, కాంకేర్ ఎన్కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యులతోపాటు డివిజన్ కమిటీ మెంబర్లు మరణించి ఉండొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడా నేతలతోపాటు ఈ రెండు కమిటీలకు రక్షణ కల్పించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ–2, పీఎల్‌జే–5)కి చెందిన ప్లాటూన్ దళ సభ్యులు కూడా మృతుల్లో ఎక్కువ మంది ఉండే అవకాశముందని తెలుస్తోంది. -
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. 15 రోజుల్లో 34 మంది హతం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు దూకుడు పెంచాయి. ఈ క్రమంలో 2025 ఏడాది ప్రారంభం నుంచే మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జనవరిలో ఎన్కౌంటర్ల కారణంగా 15 రోజుల వ్యవధిలో ఏకంగా 34 మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో, మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఛత్తీస్‌గఢ్(chhattisgarh)లో భద్రతా బలగాలు దూకుడు పెంచాయి. ఈనెల ఆరో తేదీన బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టుల(maoists) బెద్రే _కుట్రు ఘటనతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. మావోయిస్టుల ఘాతకంతో ఎనిమిది మంది జవాన్లు, డ్రైవర్ మృతిచెందాడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనతో అడవులను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ చేపట్టాయి. ఇందులో భాగంగా 15 రోజల సమయంలో 34 మంది మావోయిస్టులను హతమార్చారు. తాజాగా బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాలకు చెందిన నక్సలైట్లు మృతి చెందారు.ఇదిలా ఉండగా.. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. వీరిలో తెలంగాణ కేడర్‌కే చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఘటన.. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు.రాష్ట్ర సరిహద్దుల్లో ఘటనతెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు గురువారం ఉదయం కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టడం మొదలెట్టారు. ఉదయం 9 గంటల సమయంలో తొలిసారిగా కాల్పులు మొదలయ్యాయి. అప్పటి నుంచి రాత్రి 7 గంటల వరకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 19 మంది మావోయిస్టులు మృతిచెందారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే మృతులు ఎవరు? ఎంత మంది చనిపోయారనే అంశంపై అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే, ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిలో అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం. -
Chhattisgarh Encounter: మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు
రాయ్‌పూర్: స్వల్ప రోజుల వ్యవధిలో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు గట్టి దెబ్బలు తగిలాయి. బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం బాసగూడ ప్రాతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు బలగాలు ప్రకటించుకున్నాయి. ఇటీవల ఇదే ప్రాంతంలో మావోయిస్టులు ముగ్గురు స్థానికులను హతమార్చారు. దీంతో.. భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించిన క్రమంలోనే ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఇటీవల వరుసగా ఎదురు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు, అంతకు ముందు చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టుల మృతి
బీజాపూర్: కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్‌కు 5 కిలో మీటర్ల దూరంలోని టుమ్నర్ గ్రామంలో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు బీజాపూర్ అడిషనల్ ఎస్పీ మోహిత్ మార్గ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దర్ని కమాండెర్ ఉకేష్, సెక్షన్ కమాండెర్ రాజుగా గుర్తించారు. మావోయిస్టుల నుంచి పోలీసులు రెండు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు.