breaking news
Bhaktaramadasu project
-
‘ఖమ్మం’ స్ఫూర్తితో ముందుకు సాగాలి
• ఏడాదిలోనే భక్తరామదాసు • ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు • కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్సలో మంత్రి హరీష్‌రావు ఖమ్మం సహకారనగర్ : ఖమ్మం జిల్లాలో చేపడుతున్న భక్తరామదాసు ప్రాజెక్ట్‌ను ఒకే సంవత్సరంలో పూర్తి చేస్తున్నారని, అదే స్ఫూర్తితో అన్ని జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. జిల్లా కలెక్టర్లతో గురువారం మంత్రి వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ అత్యంత కీలకమని, దీనికి కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యం కల్పించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చేపట్టనున్న 3వ విడత చెరువుల పునరుద్ధరణ పనుల ప్రతిపాదనలు ఈ నెలాఖరులోగా పంపించాలన్నారు. డిసెంబర్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జనవరి నాటికి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడతలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సర్వేయర్ల కొరత ఉంటే సమర్థవంతంగా పనిచేసే రిటైర్డ సర్వేయర్లను నియమించుకోవాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్లు, అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న భక్తరామదాసు ప్రాజెక్ట్ పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ 3వ విడత కింద జిల్లాలో 215 చెరువులను పునరుద్ధరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
కరువు ప్రాంతం.. ఇక సస్యశ్యామలం
♦ భక్తరామదాసు ప్రాజెక్టుతో తీరనున్న నీటి కష్టాలు ♦ త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారుల కృషి ♦ 59 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు ♦ పనుల ప్రారంభంతో రైతుల్లో ఆనందం కరువుతో అల్లాడుతున్న పాలేరు నియోజకవర్గంతోపాటు ముదిగొండ, వరంగల్ జిల్లా మరిపెడ మండలాల రైతులకు ఊరట లభించనుంది. భక్త రామదాసు ప్రాజెక్టు వరప్రదాయినిలా మారుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బడ్జెట్లో ఈ ఎత్తిపోతల పథకానికి సీతారామ ప్రాజెక్టుతో కలిపి సుమారు రూ.1,151 కోట్ల వరకు కేటాయించడంతో ఇక్కడి ప్రజలు దీనిపై కొండంత ఆశతో ఉన్నారు. తిరుమలాయపాలెం : వర్షాభావ పరిస్థితులతో ఎలాంటి సాగునీటి వనరులు లేక కరువుతో అల్లాడుతున్న తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలకు భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మాణంతో ఊరట లభించనుంది. రూ. 90.87 కోట్లతో చేపట్టనున్న ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేశారు. నిత్యం కరువు బారిన పడుతున్న తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశేష కృషి చేశారు. వచ్చే ఖరీఫ్ నాటికి పాలేరు నుంచి భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్సారెస్పీ డీబీఎం 60 కెనాల్లో నీరు పారించేందుకు ఇరిగే షన్ శాఖ అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. పది అడుగుల వెడల్పుతో ఉన్న భారీ పైపులైన్లను సుమారు 18 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. రైతుల పంట భూములకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా 14 అడుగుల లోతు భూమిని తవ్వి పైపులను పూడ్చనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా(5.5 టీఎంసీలు) 550 క్యూసెక్కుల నీటిని తరలించనున్నారు. పైపులైన్లను వేసే ప్రాంతాలను గుర్తించి రెవెన్యూశాఖ అనుమతి పొందేందుకు కూడా అధికారులు సర్వే చేసి నివేదిక అందజేశారు. 59 వేల ఎకరాలకు సాగునీరు పాలేరు రిజర్వాయర్ నుంచి మండలంలోని మాదిరిపురం వరకు చేపట్టనున్న భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్ జిల్లా మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం, గాలివారిగూడెం ప్రాంతాలతో పాటు పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలాల్లో 58,958 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతుల్లో ఆనందం కరువు పరిస్థితులతో చెరువుల్లోకి చుక్కనీరు రాక భూగర్భ జలాలు అడుగంటిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటి కష్టాలు తొలగిపోతాయనే ఆశతో రైతులున్నారు. సాగునీటి కోసం ఇప్పటికే లక్షలాది రూపాయలు ఖర్చు చేసి బోర్లు, బావులు తవ్వి రెతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి పాలేరు నీటిని కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలంలో పారిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అన్నట్టుగానే బడ్జెట్లో రూ.100 కోట్ల వరకు నిధులు కేటాయించారు. పనులు కూడా ప్రారంభం కావడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు భక్తరామదాసు ప్రాజెక్టుని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లు అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్‌శాఖ అధికారులను ఆదేశించడంతో పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. కాంట్రాక్టు దక్కించుకున్న మెగా పవర్ కంపెనీ కూడా ప్రాజెక్టు నిర్మాణ సామగ్రిని సిద్ధం చేసుకుని పనులు మొదలు పెట్టింది. రైతులు సహకరిస్తే ఈ వేసవి సీజన్లోనే పైపులైన్ నిర్మాణం పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. కష్టాలు తీరుతాయి ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే బోర్లు, బావులు తవ్వి నష్టపోయాం. ప్రతి ఏడు ఇవే కష్టాలు ఎదుర్కొంటున్నాం. ప్రాజెక్టు పూర్తయి నీరందితే సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. - భగవాన్, ఇస్లావత్‌తండా చెరువులు నింపితే ఉపయోగం ఈ ప్రాజెక్టు నీటిని కాలువల్లో పారించి చెరువులు నింపాలి. చెరువులు నిండితే భూగర్భ జలాలు కూడా పెరిగి సాగునీటికి ఇబ్బంది ఉండదు. వచ్చే ఖరీఫ్‌కు నీళ్లు వస్తాయనే ఆశతో ఉన్నాం. - ఇస్లావత్ లక్ష్మా, ఇస్లావత్‌తండా రైతులు సహ కరించాలి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంవత్సరం గడువు ఉన్నా త్వరితగతిన పూర్తిచేసి వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు ఇవ్వాలనే లక్ష్యం మేరకు పనిచేస్తున్నాం. పంట భూముల్లో నుంచి రైతులకు ఎలాంటి నష్టం లేకుండా పైపులైన్లు వేస్తాం. దయచేసి రైతులు సహకరించాలి. - టి.నాగేశ్వరరావు, ఈఈ, దుమ్ముగూడెం ప్రాజెక్టు