breaking news
Badminton player World Championship
-
నిన్ను మిస్సవుతున్నా: బర్త్‌డే వేడుకలపై పీవీ సింధు పోస్ట్
-
బ్యాడ్మింటన్ ఆడకపోతే... డాక్టర్నయ్యేదాన్ని!
పి.వి.సింధు అంతర్వీక్షణం పి.వి. సింధు... పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. ఈ బాడ్మింటన్ క్రీడాకారిణి తల్లిదండ్రులు వాలీ బాల్ క్రీడాకారులు. బ్యాడ్మింటన్‌లో ప్రపంచంలో పదవస్థానంలో ఉన్న ఈ అమ్మాయి ఇప్పటికీ కాస్త విరామం దొరికితే ‘బోర్ కొడుతోంది గ్రౌండ్స్కెళదామా’ అని నాన్న రమణ, అమ్మ విజయలను అడుగుతుంది. ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన సింధు అంతర్వీక్షణం. మీ డెన్మార్క్ పర్యటన ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. కాంస్యపతకం వచ్చింది కదా మరి. పైగా వరల్డ్ చాంపియన్ షిప్లో వరుసగా రెండో ఏడాది కాంస్య పతకం. అది రికార్డు. మీరు సాధించిన తాజా లక్ష్యాలేమిటి? గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఆగస్టు వరకు ఏడు అంతర్జాతీయ పతకాలు వచ్చాయి. ఈ ఏడాది నాకు చాలా గ్రేట్. ఆ తర్వాత మీ టార్గెట్? ఏషియన్ గేమ్స్‌లో విజయం. 15న బయలుదేరుతున్నాను.తొలిసారి బ్యాట్ పట్టుకున్నప్పటి మీ వయసు?... తొమ్మిదేళ్లు. తొలి గెలుపు గుర్తుందా? అది ఎక్కడ? ఎవరి మీద? కొచ్చిన్‌లో అండర్ 10 ఆలిండియా ర్యాంకింగ్ టోర్నమెంట్. మధ్యప్రదేశ్ అమ్మాయి అంజలీరావత్ మీద. తొలి రెమ్యూనరేషన్ గురించి? ఆ టోర్నమెంట్‌లోనే. ఎనిమిది వందలనుకుంటాను. ఆ డబ్బుని ఏం చేశారు? కవర్ని మమ్మీకిచ్చాను.రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు?...ఆరేడు గంటలు. ఖాళీ టైమ్‌లో... టీవీ చూస్తూ రిలాక్సవుతా. సంగీతం వింటా. మా అపార్ట్మెంట్లో చిన్నపిల్లలున్నారు. వాళ్లతో గడపడం చాలా ఇష్టం. స్నేహితులు... నేరుగా కలవడం చాలా తక్కువ. ఫోన్లో, వాట్స్ అప్‌లో టచ్‌లో ఉంటాను. చాలా అరుదుగా ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమాకి, షాపింగ్‌కి, హోటల్‌కి వెళ్తాం. ఏయే దేశాల్లో పర్యటించి ఉంటారు? ఆసియా, ఐరోపా దేశాలు, అమెరికాకి వెళ్లాను. ఏయే ప్రదేశాలు బాగా నచ్చాయి?... మాల్దీవులు, స్విట్జర్లాండ్ ఈ దేశాల్లో ఏ భోజనం బాగా నచ్చింది? ఎక్కడికెళ్లినా అక్కడి వంటకాలను రుచి చూస్తాను. థాయ్ ఫుడ్ ఇష్టం. ఎన్ని రకాల రుచులు చూసినా హైదరాబాద్‌కి వచ్చి బిర్యానీ తిన్నప్పుడు కలిగే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. బయట దేశాల్లో టోర్నమెంట్ల తర్వాత లోకల్ టూర్కెళ్తారా? చాలా తక్కువ. మొదటి రెండు రౌండ్లలో మిస్ అయినప్పుడు కొంత సమయం ఉంటుంది. తప్ప సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు ఆడినప్పుడు అసలే టైమ్ ఉండదు. బ్యాడ్మింటన్‌లో మీ జీవితలక్ష్యం ఏమిటి? వరల్డ్ నంబర్ వన్. అది చాలా కష్టమని, చాలా కష్టపడాలనీ తెలుసు. మీమీద ఎవరి ప్రభావం ఉంది? నాన్న, అమ్మ, గోపీచంద్. {పపంచంలోని బాడ్మింటన్ క్రీడాకారుల్లో ఎవరి ఆట ఇష్టం? లీ చాంగ్ వీ, గోపీచంద్ ఇంకా ఏమేమి ఆటలు ఆడతారు? వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్ బాల్. ఇవన్నీ సరదాగానే. తల్లిదండ్రులు క్రీడాకారులు కావడంతో మేలు జరిగిందేమో! కచ్చితంగా. పదో తరగతి పరీక్షలు, వరల్డ్ జూనియర్ చాంపియన్ షిప్ టోర్నమెంట్ ఒకేసారి వచ్చాయి. అప్పుడు టోర్నమెంట్ ఆడించాలనే నిర్ణయం తీసుకున్నారంటే అది వాళ్లు స్పోర్ట్స్ పర్సన్స్ కావడం వల్లనే. పైగా ఆట ఓడినప్పుడు వాళ్లిచ్చే కౌన్సెలింగ్ మామూలు తల్లిదండ్రులకు సాధ్యం కాదేమో అనుకుంటాను. క్రీడాకారులు ఎలా ఆడితే రాణిస్తారు? ఆటలైనా, చదువైనా ఒకటే. కఠోరశ్రమ, పట్టుదల ఉండాలి. ఈ రెండూ ఉంటే ఎప్పటికైనా విజయం వరిస్తుంది. మీరు ఏం చదువుతున్నారు? బి.కామ్ ఫైనల్ ఇయర్. మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజ్‌లో. బాడ్మింటన్లోకి రాకపోతే ఏ రంగాన్ని ఎంచుకునేవారు? వైద్యరంగం అంటే ఇష్టం. అక్కలాగా డాక్టర్నయ్యేదాన్ని. ఈ రంగంలోకి వచ్చి మిస్సయ్యానని ఎప్పుడైనా అనిపించిందా? ఆటను ఎంజాయ్ చేస్తాను. బోర్ కొడితే రైల్వే గ్రౌండ్స్కెళ్తాను. ఏదైనా ఆట తర్వాతే. కాబట్టి మిస్సయిన ఫీలింగ్ ఉండదు. - వాకా మంజులారెడ్డి


