breaking news
backside
-
గ్యాస్ పైప్‌లైన్‌లో నడిచొచ్చి.. వెనక నుంచి దాడి
కీవ్: యుద్ధంలో ఉక్రెయిన్ సేనలపై ఊహించని రీతిలో దాడిచేసేందుకు రష్యా బలగాలు ఒక గ్యాస్ పైప్‌లైన్ లోపలి నుంచి నడుచుకుంటూ వెళ్లిందని కథనాలు వెలువడ్డాయి. రష్యాలోని కరŠస్క్ రీజియన్‌లో ఈ యుద్ధ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్ట్‌లో ఉక్రెయిన్ సేనలు తొలిసారిగా రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యా భూభాగంపై జరిగిన అతిపెద్ద దాడి ఘటన ఇదే. వ్యూహాత్మక సరిహద్దు పట్టణమైన సుడ్జా సహా 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ బలగాలు కైవసం చేసుకున్నాయి. వందలాది మంది రష్యా సైనికులను యుద్ధ ఖైదీలుగా బంధించాయి. దీంతో అమేయ సైనికశక్తిగా ఉన్న రష్యా దీనిని అవమానంగా భావించి ఏకంగా 50,000 మంది సైనికులతో భారీ ఎదురుదాడికి దిగింది. దీంతో వేలాది మంది ఉక్రెయిన్ సైనికులు వెనుతిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎలాగోలా సుడ్జా సిటీలో పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికులను అన్నివైపులా నుంచి చుట్టుముట్టేందుకు ఆవలివైపుదాకా ఉన్న గ్యాస్‌పైప్‌లైన్ గుండా రష్యా సైనికులు వెళ్లారని యూరీ పోడోల్యాకా వెల్లడించారు. ఈయన ఉక్రెయిన్‌లో పుట్టి రష్యాకు అనుకూలంగా మాట్లాడే బ్లాగర్. సుడ్జా నగరంలో ఉక్రెయిన్ సేనలను వెనక వైపు నుంచి దాడిచేసేందుకు, అదును చూసి దెబ్బకొట్టేందుకు పైప్‌లైన్ లోపలే రష్యా సైనికులు రోజుల తరబడి గడిపారని ఈయన పేర్కొన్నారు. ఈ పైప్‌లైన్ పొడవు దాదాపు 15 కిలోమీటర్లు. యూరప్‌తో సత్సంబంధాలు తెగిపోకముందువరకు ఈ పైప్‌లైన్ గుండా గ్యాస్‌ను రష్యా సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ లేకపోవడంతో సైనికుల రాకపోకలు సాధ్యమయ్యాయని యూరీ చెప్పారు. మాస్క్‌లు ధరించిన సైనికులు పైప్‌లైన్ ద్వారా సుడ్జా నగరంలోకి ప్రవశించారని ‘టూ మేజర్స్’ అనే మరో యుద్ధ బ్లాగర్ చెప్పారు. రష్యా స్పెషల్ ఫోర్సెస్ బలగాలు పైప్‌లో నడిచివెళ్తున్న ఫొటోలను రష్యా టెలిగ్రామ్ చానెల్స్ అందరితో పంచుకున్నాయి. ‘‘శత్రుసేనల రాకను మేం కనిపెట్టాం. రాకెట్లు, శతఘ్నులతో దీటైన బదులిచ్చాం. రష్యాకు భారీ నష్టం జరిగింది’’ అని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలిపింది. అయితే ప్రాణనష్టం, ఎంత మంది రష్యా సైనికులు చనిపోయారనే విషయం వెల్లడికాలేదు. -
క్వారీ లారీ ఢీకొని వ్యక్తి మృతి
పెంటపాడు : తాడేపల్లిగూడెం – భీమవరం రోడ్డుపై పెంటపాడు మిడ్ లెవెల్ కాలువ వంతెన వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెంటపాడు ఎస్సై వాసంశెట్టి సుబ్రహ్మణ్యం కథనం ప్రకారం.. పెంటపాడుకు చెందిన కర్రి వెంకటరెడ్డి(65) మోటార్‌సైకిల్‌పై తాడేపల్లిగూడెం వెళ్లి తిరిగి వస్తున్నాడు. ముదునూరుపాడు చర్చి వద్ద ముందు వెళ్తున్న సైకిల్‌ను తప్పించే క్రమంలో మోటార్‌సైకిల్ అదుపుతప్పింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన క్వారీ లారీ కింద వెంకటరెడ్డి పడ్డాడు. లారీ వెనుక చక్రం అతనిపైనుంచి వెళ్లిపోవడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. పోలీసులు మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. ఎస్సై సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామ ఉపసర్పంచ్ నల్లమిల్లి చినగోపిరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత నల్లమిల్లి విజయానందరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబానికి సంతాపం తెలిపారు.