breaking news
Ayesha masrat Khanum
-
కలెక్టర్ ఆదర్శం; ప్రశంసల వెల్లువ
సాక్షి, వికారాబాద్ : తన కూతురిని మైనార్టీ గురుకుల పాఠశాలలో చేరుస్తానని ప్రకటించి పలువురికి ఆదర్శంగా నిలిచిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదవడాన్ని స్టేటస్ సింబల్‌గా భావించే నేటి కాలంలో.. తన కూతురిని ప్రభుత్వ వసతిగృహంలో చేర్పించాలనుకుంటున్న ఆమె నిర్ణయం స్ఫూర్తిదాయకమని తెలంగాణ మైనార్టీ గురుకులాల (టీఎమ్‌ఆర్‌ఈఐఎస్)కార్యదర్శి షఫీయుల్లా ప్రశంసించారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా మైనార్టీ వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు టీఎమ్‌ఆర్‌ఈఐఎస్ ఎంతగానో కృషి చేస్తోంది. సంప్రదాయ బోధనా పద్ధతులు అవలంబిస్తూనే.. వారిని ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం పాటుపడుతోంది. ఈ క్రమంలో వికారాబాద్ కలెక్టర్ తన కూతురు తాబిష్ రైనాను టీఎంఆర్ వికారాబాద్ బాలికల పాఠశాల-1లో చేర్పించాలని నిర్ణయించారు. -
సింగరేణి సంస్థ పేరుతో ఇసుక అక్రమ రవాణా
చెన్నూర్ : పేరు సింగరేణిది.. అక్రమార్జన వ్యాపారులది.. ఇదీ ప్రస్తుతం చెన్నూర్ పరిధిలోని గోదావరిలో సాగుతున్న తంతు. ఏడేళ్లుగా గోదావరి నుంచి యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. నిబంధనలు తుంగలో తొక్కి సింగరేణి పేరు చెప్పి.. ఇష్టారాజ్యంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా స్పందించే వారు లేకుండా పోయారు. చివరికి మంచిర్యాల ఆర్టీవో అయేషా మస్రత్ ఖానమ్ పరిశీలనలో ఈ అక్రమ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చెన్నూర్‌లోని గోదావరి నుంచి సింగరేణి సంస్థకు ఇసుక తరలించేందుకు సెప్టెంబర్ 21, 2007లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని సర్వే నంబర్లు 225 నుంచి 468 వరకు ఉన్న 540 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టాలని అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారులు హద్దులు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆ సమయంలో వారు పట్టించుకోలేదు. గోదావరి మధ్యలో నుంచి తవ్వకాలు.. హద్దులు చూపించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం.. తమను ఎవరు అడ్డుకుంటారనే ధీమాతో సింగరేణి కాంట్రాక్టర్లు గోదావరి మధ్యలో నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తంతు ఏడేళ్లుగా కొనసాగుతున్నా నేటికీ అధికారులు గమనించకపోవడం వారి నిర్లక్ష్యంగా స్పష్టం చేస్తోంది. అయితే.. శుక్రవారం రాత్రి గోదావరి నుంచి నిబంధనలకు విరుద్ధంగా సింగరేణి సంస్థకు అని చెప్పి ఇసుక తరలిస్తున్న మూడు లారీలను తహశీల్దార్ పట్టుకున్నారు. దీంతో శనివారం మంచిర్యాల ఆర్డీవో అయేషా మస్రత్ ఖానమ్ గోదావరి నదిని సందర్శించారు. సింగరేణి సంస్థకు ఇచ్చిన అనుమతి ప్రాంతాల్లో కాకుండా గోదావరి మధ్యలోంచి అక్రమంగా రవాణా సాగుతోందని ఆమె పరిశీలనలో వెల్లడైంది. అక్రమాలకు రాచ మార్గం... సింగరేణి సంస్థకు ఇచ్చిన అనుమతులను అడ్డం పెట్టుకుని కొందరు కాంట్రాక్టర్లు గోదావరి నది నుంచి సంస్థకే కాకుండా రాష్ట్ర రాజధానికి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. గోదావరి ప్రాంతం నుంచి ఇసుక తీసుకెళ్లే లారీలను కాంట్రాక్టర్లు సింగరేణికి కాకుండా దారి మళ్లించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా ఏడేళ్లుగా కొనసాగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గోదావరి నదిలో 8 మీటర్ల లోతుగా ఇసుక ఉంటే 2 మీటర్ల వరకు తవ్వకాలు జరుపాల్సి ఉంది. కానీ.. సదరు కాంట్రాక్టర్లు 5 నుంచి 6 మీటర్ల లోతులో తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి తాగు, సాగు నీటి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం నెలకొంది. ఇసుక తవ్వకాలు నిలిపివేశాం.. గోదావరి నుంచి ఇసుక రవాణా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. సింగరేణి సంస్థకు ఇచ్చిన సర్వే నెంబర్లలో కాకుండా వేరే ప్రాంతాల నుంచి ఇసుక రావాణా సాగుతోంది. దీంతో గోదావరి నదిలో ఉన్న రెండు పొక్లెయినర్లను సీజ్ చేసి ఇసుక తవ్వకాలను నిలిపి వేశాం. నివేదికన జిల్లా కలెక్టర్‌కు పంపిస్తాం.