breaking news
Athidi devo bhava
-
సంక్రాంతి బరిలో పది సినిమాలు!
సంక్రాంతి వస్తోందే తుమ్మెద కొన్ని సినిమాలు తేనుందే తుమ్మెద సినీ కాంతి పంచనుందే తుమ్మెద సినీ ప్రేమికులను ఖుషీ చేయనుందే తుమ్మెద కలెక్షన్లతో బాక్సాఫీస్ కళకళలాడనుందే తుమ్మెద మొత్తం ఎన్ని సినిమాలు వస్తాయంటే తుమ్మెద... పది వరకూ రావొచ్చు తుమ్మెద. ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం తుమ్మెద. సంక్రాంతి బరిలో నిలిచిన ప్యాన్ ఇండియన్ మూవీ ‘రాధేశ్యామ్’. ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించారు. 1970 యూరప్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ చిత్రానికి కె. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఈ చిత్రంలో జ్యోతిష్కుడిగా ప్రభాస్, డాక్టర్ ప్రేరణగా పూజా, పరమహంస పాత్రలో కృష్ణంరాజు కనిపిస్తారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఇక ఇదే రోజున చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన ‘సూపర్ మచ్చీ’, సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘డిజె టిల్లు’ చిత్రాలు కూడా రిలీజ్‌కు రెడీ అయ్యాయి. పులి వాసు దర్శకత్వంలో ‘సూపర్ మచ్చీ’ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మించగా, కన్నడ బ్యూటీ రచితా రామ్ హీరోయిన్గా నటించారు. ఇటు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఇక పండగ రోజున అంటే జనవరి 15న తొలిసారి ‘హీరో’గా వస్తున్నాడు మహేశ్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని గల్లా పద్మావతి నిర్మించారు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఆర్ఆర్ఆర్ వాయిదా వల్ల... ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ మూవీ ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) ఈ నెల 7న విడుదల కావాల్సింది. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో సీటింగ్ సామర్థ్యం, కొన్ని రాష్ట్రాల్లో సినిమాల ప్రదర్శనల నిలిపివేత వంటి కారణాల చేత జనవరి 7న సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నామని చిత్రబృందం వెల్లడించింది. ఇలా ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిన వల్ల సంక్రాంతికి రిలీజయ్యేందుకు సినిమాలు క్యూ కట్టాయి. ఇక జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కన్ఫార్మ్ కాకముందు సంక్రాంతికి వస్తామంటూ ముందు ప్రకటించిన చిత్రాల్లో మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’, పవన్ కల్యాణ్ – రానాల ‘భీమ్లా నాయక్’ వెంకటేశ్–వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్ 3’ చిత్రాలు ఉన్నాయి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం జనవరి 7న వస్తామని చెప్పిన తర్వాత ‘సర్కారువారి పాట’ చిత్రం ఏప్రిల్ 1కి, ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25కి , వెంకటేశ్–వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్ 3’ ఏప్రిల్ 29కి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. పండగకు ముందే అతిథి దేవో భవ సంక్రాంతి పండగకి వారం ముందే రానున్న చిత్రం ‘అతిథి దేవో భవ’. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. ఈ చిత్రంలో సువేక్ష హీరోయిన్. ఆదివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘‘ఇది మంచి స్పాన్ ఉన్న సినిమా. కథ కొత్తగా ఉంటుంది. క్యారెక్టర్స్ అన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. పండగ సీజన్లో వస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అని ఆది సాయికుమార్ అన్నారు. ‘‘ఆది సాయికుమార్‌లోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రం ఇది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఇప్పటికే విడుదలైన పాటలకు, ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది’’ అన్నారు దర్శకుడు. ఇప్పటివరకు సంక్రాంతి రేసులో నిలిచిన చిత్రాల్లో విడుదల తేదీలను ఖరారు చేసుకున్న చిత్రాల గురించి చెప్పుకున్నాం. ఇక పండగ రేసులో ఉన్నామంటూ ఇంకా రిలీజ్ డేట్‌ను ప్రకటించని చిత్రాల్లో ‘బంగార్రాజు’ ముందు వరుసలో ఉన్నాడు. నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’. ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విడుదల తేదీ చెప్పలేదు. జనవరి 13 లేదా 15 తేదీల్లో ‘బంగార్రాజు’ థియేటర్స్‌కు వస్తాడట. అలాగే ‘7 డేస్ 6 నైట్స్’, ‘రౌడీ బాయ్స్’ చిత్రబృందాలు సంక్రాంతి రిలీజ్‌లను కన్ఫార్మ్ చేశాయి కానీ విడుదల తేదీ విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. బ్యాచ్‌లర్ ట్రిప్ కోసం గోవా వెళ్లిన ఇద్దరు యువకులు, మరో ఇద్దరు యువతుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇక ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ‘హుషారు’ వంటి హిట్ మూవీ తీసిన హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలే కాదు... సంక్రాంతి బరిలో నిలిచేందుకు మరో రెండు సినిమాలు కూడా సిద్ధమవుతున్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. -
‘అతిథి దేవోభవ’తో మలేసియా వాసికి ప్రాణదానం
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల్లో ఉన్న ఓ మలేసియా ప్రతినిధికి సకాలంలో ‘అతిథి దేవోభవ’తో మెరుగైన చికిత్స అందించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సెపక్తక్రా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన మలేసియా జట్టు మేనేజర్ యూనిస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పర్యాటక, క్రీడా శాఖల కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆయననను మెరుగైన వైద్య చికిత్స కోసం కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులతో మాట్లాడి వెంటనే శస్త్రచికిత్స చేయించారు. సకాలంలో వైద్యం అందడంతో యూనిస్ కోలుకున్నారు. సోమవారం వెంకటేశం యూనిస్‌ను పరామర్శించారు. అవసరమైతే వైద్య ఖర్చులు, విమాన టికెట్‌ను కూడా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సకాలంలో వైద్యం అందించటంతో పాటు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసినందుకు మలేసియా ప్రతినిధులు బుర్రా వెంకటేశంకు కృతజ్ఞతలు తెలిపారు. ‘అతిథి దేవోభవ’కార్యక్రమంతో కొంతకాలంగా విదేశీయుల విషయంలో రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక గౌరవాన్ని చూపుతోంది. మన రాష్ట్రానికి వచ్చి, ఇబ్బందుల్లో చిక్కుకున్న వారిని చేరదీసి క్షేమంగా స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. -
ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తా
-
ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తా
* బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగింపుపై ఆమిర్‌ఖాన్ * ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’గా తెరపైకి అమితాబ్ పేరు ముంబై: ప్రభుత్వ పర్యాటక ప్రచార కార్యక్రమం ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ సేవల నుంచి తనను కొన సాగించరాదన్న నిర్ణయాన్ని గౌరవిస్తానని బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ చెప్పారు. దీనిపై ఆయన గురువారం ముంబైలో విలేకరులతో మాట్లాడారు. ‘‘పదేళ్ల పాటు ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. నా దేశానికి సేవ చేయడంలో సంతోషం ఉంది. సేవ చేసేందుకు నేనెప్పుడూ సిద్ధమే. ఈ సందర్భంగా నేనొక స్పష్టత ఇవ్వదలచుకున్నాను. ప్రజాప్రయోజనకరమైన చిత్రాలు, ప్రకటనలకు సంబంధించి ఇప్పటివరకు నేను ఎలాంటి డబ్బులూ తీసుకోలేదు. దేశానికి సేవ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తా. నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా లేకున్నా భారత్ అద్భుత దేశం..’’ అని ఆమిర్ పేర్కొన్నారు. కాగా ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. -
‘అతిథి దేవో భవ’ నుంచి ఆమిర్ ఔట్
న్యూఢిల్లీ: పర్యాటక శాఖ ప్రచార కార్యక్రమం ‘అద్భుత భారత్(ఇన్క్రెడిబుల్ ఇండియా)’ బ్రాండ్ అంబాసడర్ హోదా నుంచి బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్‌ను ప్రభుత్వం తొలగించింది. రెండు నెలల కిత్రం.. భారత్‌లో అసహనంపై ఆమీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడం, ఆయనను కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు తప్పుపట్టడం తెలిసిందే.. దీనిపై కేంద్ర పర్యాటక మంత్రి మహేశ్ శర్మ వివరణ ఇస్తూ.. ‘ప్రచారంలో భాగమైన అతిథి దేవో భవ ప్రచార బాధ్యతలను మెక్కెన్ వరల్డ్‌వైడ్ ఏజెన్సీకి అప్పగించాం. వారు ప్రచార కర్తగా ఆమీర్ పెట్టుకున్నారు. ఆ ఏజెన్సీతో కాంట్రాక్ట్ ముగిసింది. అంటే, అతిథిదేవోభవ మస్కట్‌గా ఆమీర్ కాలపరిమితీ ముగిసినట్లే’ అని పేర్కొన్నారు.