breaking news
artificial skin
-
గాయాలబారిన పడ్డ వారికి పెద్ద ఊరట..!
న్యూయార్క్: అవసరమైనప్పుడు.. అవసరానికి తగినంత సజీవమైన చర్మం దొరికితే ఎలా ఉంటుంది? కాలిన గాయాల బారిన పడ్డవారికే కాదు.. ఆసిడ్ దాడి బాధితులకు పెద్ద ఊరట. వారి చర్మం మళ్లీ మునిపటిలా మారిపోతుంది. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించే క్రమంలో న్యూయార్క్‌లోని రెనెస్సెలార్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు మరో కీలకమైన ముందడుగు వేశారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో సజీవమైన చర్మాన్ని, అందులో రక్తనాళాలను ఏర్పాటు చేశారు. నిజానికి జీవకణాలతో తయారయ్యే చర్మం ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ఉపయోగం తాత్కాలికమే. పైగా రక్తనాళాలు లేని కారణంగా ఈ కృత్రిమ చర్మాన్ని ఎక్కువ కాలం వాడేందుకు అవకాశముండదు. ఈ సమస్యను అధిగమించేందుకు రెనెస్సెలార్ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి విజయం సాధించారు. రెండు రకాల మానవ కణాలను కలపడం ద్వారా బయో ఇంక్‌ను సృష్టించిన శాస్త్రవేత్తలు వాటితో చర్మం లాంటి నిర్మాణాన్ని సిద్ధం చేశారు. యేల్ శాస్త్రవేత్తల సహకారంతో బయో ఇంక్‌కు కొన్ని కీలకమైన అంశాలను జోడించడంతో ఈ చర్మంలో రక్తనాళాలు పెరగడం మొదలైంది. ఎలుకల్లో గాయాలపై ఈ చర్మాన్ని ఉపయోగించినప్పుడు రక్తనాళాలు సహజసిద్ధ రక్తనాళాలతో కలసిపోవడం మొదలైందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న భారత సంతతి శాస్త్రవేత్త పంకజ్ కరాండే తెలిపారు. -
మనం రంగు మారొచ్చు!
ఊసరవెల్లి గురించి తెలుసుకదూ. చర్మం రంగులు మార్చగలగడం దాని ప్రత్యేకత. అలాగే సముద్రంలో నివసించే అనేక జీవులు ఇతర వేట జీవుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు చర్మం రంగును మారుస్తుంటాయి. అవి ఉన్న ప్రదేశానికి అనుగుణంగా తమ రంగును మార్చుకుని వాటిని వేటాడే జీవులను బోల్తా కొట్టిస్తుంటాయి. ఆ జీవి రంగు అక్కడి ప్రదేశంలో కలిసిపోయి ఉండడంతో వేరే జీవులేవీ వాటిని గుర్తించలేవు. తద్వారా అవి రక్షణ పొందుతాయి. ఇలా చర్మం రంగులను మార్చగలిగే లక్షణం అనేక సముద్ర జీవులకు ఉంది. రంగులు మార్చే చర్మం వల్ల మానవులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని భావించిన శాస్త్రవేత్తలు ఇలాంటి కృత్రిమ చర్మాన్ని రూపొందించారు. చర్మం రంగు ఎలా మారుతుంది.. ఆక్టోపస్, కొన్ని రకాల చేపలు, ఇతర సముద్ర జీవులు చర్మం రంగును మార్చుకోగలవు. ఆయా జీవుల్లో ఉండే హరితకాలు అనే కణజాలాల వల్ల చర్మం రంగు మారుతుంది. ఈ జీవుల చర్మంపై వర్ణద్రవ్య సంచులు ఉంటాయి. కణజాలం చుట్టూ ఉన్న కండరాలు వర్ణద్రవ్యం సాగేలా చేస్తాయి. అక్కడి పరిసరాలు ఏ రంగులో ఉంటే ఆ రంగుకు అనుగుణంగా ఈ వర్ణద్రవ్యంరంగు మారుతుంది. దీని వల్ల ఆయా జీవుల రంగు పరిసరాల్లో కలిసిపోతుంది. ఈ మార్పులను ఆధారంగా చేసుకుని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని రూపొందించారు. ఎలా రూపొందించారు: రంగులు మారే కృత్రిమ చర్మం రూపొందించేందుకు శాస్త్రవేత్తలు సున్నితమైన, సాగే గుణం ఉన్న కండరాలు కలిగిన చర్మం లాంటి పదార్థాన్ని తయారు చేశారు. ఇది ఎలక్ట్రానిక్ తరంగాల ద్వారా అవసరమైన రూపం, రంగు, పరిమాణంలోకి మారగలదు. ఈ చర్మంలాంటి పదార్థంపై రంగులు గల మచ్చల్ని ఏర్పాటు చేశారు. ఈ పదార్థం పరిమాణం, ఆకారం మారినప్పుడు ఈ మచ్చలు కూడా వెంటనే మారిపోతాయి. ఎలక్ట్రానిక్ తరంగాలకు అనుగుణంగా ఈ మచ్చలు కావాల్సిన రంగులోకి మారిపోతాయి. మరో శాస్త్రవేత్తల బృందం కూడా ఇటీవల ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాన్నే తయారు చేసింది. ఈ పరికరంలో కాంతి, ఉష్ణోగ్రత సెన్సర్లు ఉంటాయి. అవి పరిసరాల్లోని రంగుకు అనుగుణంగా కాంతిని ప్రసరింపజేస్తాయి. పరిసరాల్లో ఏ రంగు ఉంటే ఆ రంగు కాంతిని ఇవి ప్రసరిస్తాయి. ఇలా రంగులు మార్చే చర్మంలాంటి ఉత్తత్తులు అందుబాటులోకి వస్తే సైన్యం, రక్షణ సిబ్బందికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.