breaking news
Armys Myanmar operations
-
మయన్మార్ ఆపరేషన్‌పై రగడ
మంత్రులు డబ్బా కొట్టుకుంటున్నారన్న కాంగ్రెస్ * కాంగ్రెస్ పాక్ భాష మాట్లాడుతోందని బీజేపీ ఎదురుదాడి న్యూఢిల్లీ: మయన్మార్‌లో నాగాలాండ్ మిలిటెంట్లపై భారత ఆర్మీ చేసిన ప్రతీకార దాడిపై గురువారం రాజకీయ రగడ మొదలైంది. ఈ ఆపరేషన్‌పై కేంద్ర మంత్రుల ప్రకటనలు డాబుసరిగా, విపరీతంగా ఉన్నాయని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌లు మండిపడ్డాయి. వారి మాటలు భారత ప్రత్యేక బలగాల ఆపరేషన్లకు మేలు చేసేవిగా లేవని, ప్రధాని నరేంద్ర మోదీ వారికి కౌన్సెలింగ్ చేసి, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరాయి. దీనికి బీజేపీ స్పందిస్తూ... కాంగ్రెస్ పాకిస్తాన్ భాష మాట్లాడుతోందని ఎదురుదాడి చేసింది. ఈ పరస్పర ఆరోపణలకు ముందు.. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఢిల్లీలో ఓ సదస్సులో మాట్లాడుతూ.. మయన్మార్‌లో ఆర్మీ ఆపరేషన్ భారత్ ఆలోచనా వైఖరిలో మార్పునకు నిదర్శనమని, ఈ కొత్త వైఖరికి భయపడుతున్న వాళ్లు ఇప్పటికే స్పందించడం మొదలెట్టారని పాక్‌ను ఉద్దేశించి అన్నారు. ‘ఆలోచనా విధానం మారితే చాలా మార్పులు వస్తాయి.. మిలిటెంట్లపై చిన్న ఆపరేషన్‌తో దేశ భద్రతా పరిస్థితికి సంబంధించిన ఆలోచన మారిపోయింది’ అని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఘాటుగా స్పందించారు. ‘పారికర్ అవివేకంగా మాట్లాడుతున్నారు. మంత్రులకు నిగ్రహం, పరిణతి ఉండాలి. మోదీ వారికి బుద్ధిచెప్పాలి’ అన్నారు. నేపాల్‌లో ఇటీవల భారత్ చేపట్టిన భూకంప సహాయక చర్యలపై అతి ప్రచారం ఇబ్బంది కలిగించిందని, దీన్నుంచి ప్రధాని గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. తమ దేశంలో భారత ఆర్మీ ఆపరేషన్ జరగలేదని మయన్మార్ చెప్పడంతో మంత్రులు సెల్ఫ్ గోల్ అయ్యారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఎద్దేవా చేశారు. ఈ విమర్శలపై బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ స్పందిస్తూ.. ‘కాంగ్రెస్ నిర్మాణాత్మక విపక్ష పాత్ర పోషించకుండా పాక్ భాష మాట్లాడుతోంది. ఆ పార్టీ.. ప్రభుత్వాన్ని విమర్శించకుండా మిలిటెంట్లను హతమార్చిన జవాన్లను అభినందించాలి’ అని అన్నారు. పాక్ సెనేట్ ఖండన తీర్మానం ఇస్లామాబాద్: పాకిస్తాన్ తమ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ న్యూసెన్స్ చేస్తోందని భారత ప్రధాని మోదీ ఢాకాలో చేసిన వ్యాఖ్యలు, పాక్‌ను హెచ్చరిస్తూ భారత మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పాకిస్తాన్ సెనేట్ గురువారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అవి రెచ్చగొట్టేలా ఉన్నాయని, భారత ఆధిపత్య ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని మండిపడింది. సభానేత రజా జఫరుల్ హక్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మోదీ వ్యాఖ్యలు ఐక్యరాజ్యసమితి ఒప్పందానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఏ సాకుతోనైనా సరే భారత్ తమ భూభాగంలోకి చొరబడ్డానికి ప్రయత్నిస్తే తమ సైన్యం దీటుగా బదులిస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలు, మయన్మార్‌లో భారత ఆర్మీ ఆపరేషన్ ఇతర దేశాలకు హెచ్చరిక అని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ పేర్కొన్న నేపథ్యంలో ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారు.అవివేకం.. షరీఫ్: భారత నేతల వ్యాఖ్యలు అవివేకంగా, బాధ్యతారహితంగా ఉన్నాయని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విమర్శించారు. వాటి కారణంగా ప్రాంతీయ శాంతి, సుస్థిరతలు సాధించాలన్న ఇరు దేశాల లక్ష్యం దెబ్బతింటుందని పాక్ రాయబారుల సదస్సులో అన్నారు. తమ దేశ కీలక ప్రాంతాలను శాయశక్తులా పోరాడి కాపాడుకుంటామన్నారు. -
100 మంది ఉగ్రవాదుల హతం
న్యూఢిల్లీ: మణిపూర్ లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ భారత సైనికులు జరిపిన ప్రతిదాడిలో 100 మంది వరకు ఉగ్రవాదులు మృతిచెందినట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. తీవ్రవాదుల దాడులను నిరసిస్తూ భారత ఆర్మీ ప్రతిదాడికి దిగింది. ఈ ప్రతిదాడి దాదాపు 45 నిమిషాలపాటు సాగింది. మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసిన భారత ఆర్మీ ప్రత్యేక దళాలు తీవ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు ఆపరేషన్ మొదలుపెట్టాయి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినా అనంతరం భారత్ ఆర్మీ సైనిక దళాలు ప్రతికార దాడికి దిగినట్టు తెలుస్తోంది. అంతకముందు మణిపూర్‌లో మిలిటెంట్లు ఘాతుకానికి తెగబడ్డారు. ఆర్మీ వాహన శ్రేణిపై మందుపాతరలు, గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో మెరుపుదాడి చేసి 18 మంది సైనికుల ప్రాణాలు తీశారు. ఈ సంఘటన స్థలం భారత్, మయన్మార్ సరిహద్దుకు దాదాపు 15 కి.మీ.ల దూరంలో ఉంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 80 కి.మీ.ల దూరంలో ఉన్న తెంగ్నౌపాల్- న్యూ సంతాల్ రోడ్‌పై ఈ దాడికి పాల్పడ్డారు. డోగ్రా రెజిమెంట్‌కు చెందిన సైనికులు నాలుగు వాహనాల్లో పెట్రోలింగ్‌కు బయల్దేరారు. పారలాంగ్, చరాంగ్ గ్రామాల మధ్యకు రాగానే ఆ వాహన శ్రేణిపై శక్తిమంతమైన మందుపాతరను పేల్చిన మిలిటెంట్లు.. ఆ వెంటనే రాకెట్‌తో ప్రయోగించే గ్రెనేడ్లు, అత్యాధునిక ఆటోమేటిక్ తుపాకులతో సైనికులపై విరుచుకుపడి, విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఆ దాడిలో 18 మంది సైనికులు చనిపోగా, 11 మంది గాయాల పాలయ్యారు.