breaking news
Architect Hafeez
-
ప్చ్.. ‘తెలంగాణ’ కనిపిస్తలేదు!
కొత్త సచివాలయ డిజైన్లను తిరస్కరించిన సీఎం * యూరోపియన్, రోమన్ శైలిలో ఉన్నాయని పెదవి విరుపు * మళ్లీ నమూనాలు రూపొందించాల్సిందిగా ఆర్కిటెక్ట్‌కు సూచన * కొత్త అసెంబ్లీ, మండలికి స్థలాన్వేషణ * ఎర్రమంజిల్‌లో నీటిపారుదల శాఖ ప్రాంగణంపై దృష్టి సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించబోయే సచివాలయం కోసం ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నమూనాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తిరస్కరించారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ సచివాలయమైన సౌత్‌బ్లాక్, నార్త్ బ్లాక్ భవన నమూనాల తరహాలో తెలంగాణ కొత్త సచివాలయం కోసం కొన్ని నెలల క్రితం ఆయన డిజైన్లు రూపొందించి స్వయంగా సీఎంకు అందజేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ నమూనాలు ఎక్కడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా లేవని భావించిన ముఖ్యమంత్రి తాజాగా వాటిని తిరస్కరిం చారు. వాటిని తెలంగాణ సంప్రదాయరీతులకు తగ్గట్టుగా మార్చి కొత్త నమూనాలు రూపొందించాలని, వాస్తుపరంగా కూడా మరికొన్ని మార్పులు చేయాలని సూచించారు. దీంతో ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ కొత్త నమూనాల రూపకల్పనలో ఉన్నారు. కొత్త సచివాలయానికి ‘గుమ్మటం’ డిజైన్ సాధారణంగా సీఎం కేసీఆర్ గుమ్మటాలతో కూడిన నిర్మాణాలను ఇష్టపడతారు. అవి దక్కన్ నిర్మాణ శైలికి దగ్గరగా ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, ఇటీవల తెలంగాణ సచివాలయానికి కొత్తగా నిర్మించిన ప్రధాన ద్వారం సెక్యూరిటీ కార్యాలయ భవనం నమూనాలు దీనికి నిదర్శనం. కొత్త సచివాలయ భవనం ప్రధాన బ్లాకుకు కూడా గుమ్మటం డిజైన్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇక సచివాలయంలో సీఎం బ్లాక్ అన్నింటికంటే ఎత్తుగా ఉండటంతోపాటు, అందులో ముఖ్యమంత్రి కూర్చునే కార్యాలయం నైరుతి దిశలో ఉండేలా చూడాలని ఆయన సూచించారు. రెండు బ్లాకులు పెంచటం గాని లేదా సీఎం బ్లాకు 11 అంతస్తులతో నార్త్, 9 అంతస్తులతో సౌత్ బ్లాకులు ఉండేలా చూడాలని ఆయన సూచించినట్టు సమాచారం. విభాగాధిపతులు సహా 55 విభాగాల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. మొత్తం విభాగాల సంఖ్య, ఉద్యోగుల సంఖ్య, అవసరమైన వైశాల్యం... తదితర వివరాలను ఇటీవలే రోడ్లు భవనాల శాఖ అధికారులు హఫీజ్ కాంట్రాక్టర్‌కు అందజేశారు. నాలుగు రోజుల క్రితం ఆయన కార్యాలయం నుంచి వచ్చిన ప్రతినిధులు ఆర్అండ్బీ అధికారులతో సమావేశమయ్యారు. అంతకు నెల ముందు హఫీజ్ కూడా వచ్చి అధికారులతో మాట్లాడి వెళ్లారు. అసెంబ్లీ, మండలికి స్థలాల వేట ఉన్నచోటనే కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. అసెంబ్లీ, శాసనమండలి భవనాలకు వేరేచోట స్థలం వెదకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం జీఏడీ ఆధ్వర్యంలో కొన్ని స్థలాలను కూడా పరిశీలించారు. ఎర్రమంజిల్‌లో నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పాత కార్యాలయ భవనాలున్న ప్రాంగణం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవలే ఆర్‌అండ్‌బీకి కొత్త భవనం అందుబాటులోకి రావటంతో పాత హెరిటేజ్ భవనం ఖాళీగా ఉంది. పాత భవనాలను తొలగిస్తే దాదాపు పదెకరాల స్థలం అందుబాటులోకి వస్తుంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంతకాలం తర్వాత.. తొలుత ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని నగర శివారు ప్రాంతానికి తరలించి అక్కడ కొత్త సచివాలయంతోపాటు అసెంబ్లీ, శాసనమండలి భవనాలను నిర్మించాలని భావించారు. కానీ దానిపై తీవ్ర విమర్శలు రావటంతోపాటు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ప్రస్తుతం సచివాలయం ఉన్న చోటనే పాత భవనాలు తొలగించి నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నాలుగైదు నెలల క్రితమే హఫీజ్ కాంట్రాక్టర్ నమూనాలు రూపొందించి సీఎంకు అందజేశారు. ఆ నమూనాలను సీఎం కార్యాలయం కూడా బహిర్గతం చేసింది. త్వరలో ఏపీ సచివాలయం ఖాళీ అవుతున్నందున దసరా సందర్భంగా కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నమూనాల ప్రకారమే పనులు మొదలవుతాయని భావిస్తున్న తరుణంలో సీఎం వాటిని తిరస్కరించటం గమనార్హం. ఆ నమూనాలు యూరోపియన్, రోమన్ శైలిని ప్రతిబింబిస్తున్నాయని సీఎం భావిస్తున్నారు. -
‘విశ్వ’మంత ఆశ
సీఎం కలల సాకారానికి కసరత్తు బహుళ అంతస్తుల బాధ్యత ఆర్కిటెక్ట్ హఫీజ్‌కు అప్పగింత ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం హుస్సేన్‌సాగర్ చుట్టూ అందమైన బహుళ అంతస్తుల భవనాలు.. మూసీ చుట్టూ కొత్త అందాలు.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా తెలంగాణ కళాభారతి .. ఇలా ప్రపంచంలోనే ప్రత్యేకంగా... ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన నగరంగా గ్రేటర్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆ దిశగా తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే పనిని ప్రారంభించారు. దీని కోసం ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ సేవ లను వినియోగించుకోనున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై గురువారం జరిగిన సమావేశానికి హఫీజ్‌ను ఆహ్వానించారు. ఈ బహుళ అంతస్తుల భవ నాల నిర్మాణానికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని... అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాల్సిందిగా హఫీజ్ బృందాన్ని కోరారు. అంతేకాదు.. నగరంలోని ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు వస్తే బాగుంటుందో పరిశీలించి ప్రణాళిక రూపొందిం చాలన్నారు. హైదరాబాద్ నగరంప్రపంచంలోనే ప్రత్యేకంగా ఉండాలన్నారు. ఇదీ హఫీజ్ విశిష్టత.. ముంబై యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో డిప్లొమా, కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీ, ఎంఎస్ పూర్తి చేసిన హఫీజ్ ఇంపీరియల్ 1, 2 భవనాలతో పాటు దేశంలోనే అత్యంత ఎత్తయిన భవనాల వాస్తుశిల్పిగా ప్రసిద్ధికెక్కారు. కొత్త పద్ధతులతో... అందరినీ ఆకట్టుకునేలా భవనాలను తీర్చిదిద్దడంలో పేరుపొందారు. హఫీజ్ ప్రాజెక్టుల్లో నోయిడా మహాగున్ మెడోస్, నవీ ముంబైలో డీవై పాటిల్ స్టేడియం, సీవుడ్స్ ఎస్టేట్ (ఎన్ఆర్ఐ కాంప్లెక్స్), గుర్గావ్లో డీఎల్ఎఫ్ అరాలియాస్, హీరానందర్ గార్డెన్స్ వంటివి ఉన్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఎన్నో నిర్మాణాలతో పాటు ఓఎన్జీసీ గ్రీన్‌బిల్డింగ్స్‌కు రూపకల్పన చేశారు. ప్రముఖ నగరాల్లో ఇన్ఫోసిస్ బిల్డింగ్లు, ఏవీ బిర్లా ట్రైనింగ్ సెంటర్ నిర్మాణంలో ఆయన నైపుణ్యం కనిపిస్తుంది. నగరంలోని మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను గతంలో హఫీజ్ సిద్ధం చేశారు. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా బహుళ అంతస్తులతో పాటు మూసీ సుందరీకరణకు హఫీజ్ బృందం డిజైన్ చేయనుంది. చేపట్టనున్న పనులు మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త కట్టడాలు (పార్కులతో సహా) ఇందిరా పార్కు ఖాళీ స్థలంలో తెలంగాణ కళాభారతి (నాలుగు ఆడిటోరియంలతో సహా) రవీంద్ర భారతి ప్రదేశంలో హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలు చాటేలా నిర్మాణం మొజాంజాహి, చార్మినార్, హుస్సేన్‌సాగర్, సాలార్జంగ్ మ్యూజియంల వద్ద కొత్త ఆకర్షణలు టవర్లు, బహుళ అంతస్తుల భవనాలు చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక లక్షణాలు ప్రతిబింబించడంతో పాటు ఆర్థికప్రగతికి దోహదపడేలా నిర్మాణం.