breaking news
Ankamma Temple
-
ఆక్రమణలపై ఆరా
కందుకూరు : తీగ లాగితే డొంక కదిలింది. పట్టణంలోని అంకమ్మ దేవాలయం ఇరువైపులా ఉన్న స్థలాల ఆక్రమణపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆక్రమణలపై ‘సాక్షి’ కథనాలు, స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావు ఆగ్రహం, స్థానికుల నుంచి వ్యతిరేకత వెరసి అక్రమార్కుల గుట్టురట్టయింది. శుక్రవారం ‘సాక్షి’లో ‘దేవుని పేరుతో దౌర్జన్యం’ శీర్షికతో జిల్లా టాబ్లాయిడ్ ఏడో పేజీలో ప్రచురించిన కథనానికి అధికారుల్లో చలనం వచ్చింది. అదే రోజు రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి దేవాలయానికి ఇరువైపులా ఉన్న స్థలాలను సబ్ కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు. ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న దుకాణాల్లోని వ్యాపారుల వద్దకు వెళ్లి విచారించారు. నెలనెలా అద్దెలు ఎవరికి ఇస్తున్నారని సబ్ కలెక్టర్ ప్రశ్నించగా వారు దివి లింగయ్యనాయుడికి ఇస్తున్నామని చెప్పారు. ఆ వివరాలన్నీ సబ్ కలెక్టర్ నమోదు చేసుకున్నారు. ఆర్టీసీ డిపో ప్రవేశ ద్వారం నుంచి అంకమ్మ దేవాలయం ముఖ ద్వారం వరకు ఉన్న వ్యాపారుల నుంచి అధికారులు స్టేట్మెంట్లు రికార్డు చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ అంకమ్మ దేవాలయానికి ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలం మొత్తం మున్సిపాలిటీదేనని అక్కడి వ్యాపారులతో చెప్పారు. ఈ స్థలాలపై వచ్చే ఆదాయం కూడా దానికే చెందాలన్నారు. ఈ స్థలాలపై సమగ్ర విచారణ కోసం ఓ ట్రైనీ కలెక్టర్‌ని నియమిస్తామని ఆయన స్పష్టం చేశారు. పది రోజుల లోపు విచారణ చేసి స్థలాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అదే విధంగా ప్రతి దుకాణానికి మున్సిపాలిటీ తరఫున రసీదులు ఇచ్చి పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ రమణకుమారిని ఆదేశించారు. టీడీపీ నేత తిట్ల పురాణం సబ్‌కలెక్టర్ విచారణకు వచ్చి వెళ్లిన త ర్వాత టీడీపీ పట్టణ అధ్యక్షుడు రంగంలోకి దిగారు. ఆక్రమణలపై అధికారులు స్పందించారని తె లుసుకుని ఊగిపోయారు. స్థానిక ఎమ్మెల్యేపై అనవసరంగా నోరుపారేసుకున్నారు. అధికారులను సైతం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. స్థలాలన్నీ దేవాలయానికి సంబంధించినవేనని అడ్డగోలుగా మాట్లాడారు. ఐఏఎస్ స్థాయి అధికారి వచ్చి స్థలాలన్నీ మున్సిపాలిటీవేనని చెప్పిన తర్వాత కూడా సదరు నేత వ్యవహరించిన తీరుపై స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. -
దేవుని పేరుతో దౌర్జన్యం
కందుకూరు అర్బన్ : అనుకున్నదొక్కటి.. ఐనదొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. ఇది ఓ చిత్రంలో సన్నివేశానికి అనుగుణంగా కవి రాసిన పాట. ఈ పాట పట్టణంలోని అంకమ్మ దేవాలయంపై పెత్తనం చేస్తున్న పెద్దలకు అతికినట్లు సరిపోతుంది. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపై రాజకీయ వేధింపుల్లో భాగంగా స్థానిక అంకమ్మ దేవాలయం ముందు.. వెనుక ఉన్న స్థలం తమదేనంటూ గుడి కార్యకలాపాలు చూస్తున్న టీడీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా గుడి వెనుక స్థలంలో చిరువ్యాపారుల బడ్డీబంకును రాత్రి రాత్రే తొలగించి వివాదానికి తెరలేపారు. తీరా సమాచారం చట్టం ద్వారా తెలుసుకుంటే ఆ స్థలం అంకమ్మ తల్లి దేవాలయానికి సంబంధించింది కాదని, అది మున్సిపాలిటీ స్థలమని తేలింది. కొన్నేళ్లుగా దేవాలయంపై కొందరు పెత్తనం చేస్తున్నారు. ఆలయం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ వైపున ఖాళీ స్థలాల్లో బంకులు పెట్టుకున్న చిరు వ్యాపారుల నుంచి అద్దెలు కూడా వసూలు చే స్తున్నారు. అభివృద్ధి పేరుతో దేవాలయం ముందు భాగంలో మున్సిపల్ స్థలంలో వరిగడ్డి వామిలు, జామాయిల్, చౌక కర్రల వ్యాపారులకు అద్దెలకు ఇచ్చారు. ఫలితంగా దేవాలయానికి వెళ్లేందుకు దారి సక్రమంగా లేకపోవడంతో క్రమేపీ భక్తుల సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది. అద్దెల రూపలో వచ్చిన ఆదాయం ఎవరికి చెందుతుంతో తెలియదుగానీ దేవాలయం అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. చిరువ్యాపారుల్లో కొందరు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఉండటం తెలుగు తమ్ముళ్లకు ఇబ్బందిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపునకు కృషి చేశారని ఓ బొంకును దేవాలయం ముఖ ద్వారం నిర్మాణం పేరుతో రాత్రికి రాత్రే తొలగించారు. ఇది పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థలం ఎవరిదన్న విషయమై వివాదం జరుగుతుండగా ఓ వ్యక్తి సమాచార చట్టం ద్వారా మున్సిపాలిటీని ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీలోని రికార్డులు పరిశీలించగా తూర్పు వైపున సుమారు 78.50 సెంట్లు, ఉత్తరం వైపున సుమారు 32.00 సెంట్లు, పడమర వైపున ఉన్న 58.00 సెంట్లు, దక్షిణం వైపున 10.28 సెంట్లు మున్సిపాలిటీదేనని తేలింది. గుడికి ముందు, వెనుక వైపు మున్సిపల్ స్థలమని అప్పట్లోనే తేలింది. ఆ స్థలంలో ఇతరులకు పట్టా ఇవ్వకుండా అంకమ్మ గుడికి ఇవ్వాలని కోరుతూ 1991 అక్టోబర్ 15వ తేదీని పురపాలక సంఘం తీర్మానించింది. దీని ప్రకారం రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. నిద్రనటిస్తున్న అధికారులు వాస్తవానికి స్థలం ఎవరిదైనా పట్టణంలో కట్టడం నిర్మించాలంటే మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి పాలనలో ఉంది. మున్సిపాలిటీకి న్యాయ సలహాదారులు ఉన్నా తెలుగు తమ్ముళ్లు రాత్రికి రాత్రే ఆలయం ముఖద్వారం నిర్మిస్తుంటే సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. అనుమతులు లేకండా నిర్మాణాలు చేపడితే ముందు రోజుల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి మున్సిపల్ స్థలాన్ని కబ్జాకోరల నుంచి విడిపించాలని కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా దేవాలయం ముందు ఖళీ స్థలాలకు అద్దెల రూపంలో వసూలు చేస్తున్న నగదు మున్సిపాలిటీకి జమ కావడం లేదని చెప్పారు. ఆలయ ముఖ ద్వారం నిర్మాణానికి తమ నుంచి ఎవరూ అనుమతి తీసుకోలేదని చెప్పారు.