breaking news
Ankamma Rao
-
వార్డు సభ్యుడిపై టీడీపీ వర్గీయుల దాడి
చినకాకాని(మంగళగిరి రూరల్): నిడమర్రులో శనివారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకుడు, పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యుడు తాడిబోయిన అంకమ్మరావుపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అంకమ్మరావు తన స్నేహితుడు నల్లిబోయిన వీరయ్యతో కలసి శనివారం రాత్రి రజక కాలనీలో కూర్చునివున్నారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు తాడిబోయిన మల్లయ్య, కుర్రా శంకరరావు, తాడిబోయిన వెంకటేశ్వరరావు, కుర్రా వీరయ్య, తాడిబోయిన సీతారామయ్య, తాడిబోయిన సుబ్బారావులతోపాటు మరో నలుగురు వచ్చి ఆకస్మాత్తుగా దాడి చేసి గాయపర్చారని స్థానికులు చెప్పారు. గమనించిన స్థానికులు ఘటన స్థలానికి చేరడంతో దాడికి పాల్పడినవారు పరారయ్యారు. గాయపడిన అంకమ్మరావు, వీరయ్యలను 108లో చినకాకాని ఎన్నారై వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు ఎమ్మెల్యే ఆర్కే పరామర్శ పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యుడు అంకమ్మరావు, నల్లిబోయిన వీరయ్యను ఆదివారం ఎమ్మెల్యే ఆర్కే పరామర్శించి వారి ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోవడం వేనుక అధికార పార్టీ అండదండలున్నాయని చెప్పారు. భౌతిక దాడులు మంచి పరిణామం కాదని, ఇప్పటికైనా మానుకోకుంటే వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు దాడులకు భయపడాల్సిన పనిలేదని, పార్టీ అండగా ఉంటుందని అభయమిచ్చారు. ఇప్పటికే తాను పోలీసు అధికారులతో మాట్లాడి దాడి ఘటనలో నిందితులు ఎంతటి వారైనా పట్టుకుని శిక్షించాలని కోరినట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీటీసీ సభ్యుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్‌లు గాదె లక్ష్మారెడ్డి, తాడిబోయిన వలరాజు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు షేక్ బాజి, ఉప సర్పంచ్ గాదె సాగర్‌రెడ్డి, సొసైటీ డెరైక్టర్ కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కొల్లి శేషిరెడ్డి తదితరులున్నారు. -
భగవంతుడే కాపాడాడు...
*బోడో తీవ్రవాదుల చెర నుంచి విడుదలైన అంకమ్మరావు కుటుంబ సభ్యుల ఆనందం *నూతన సంవత్సరంలో సంతోషమైన వార్త విన్నామన్న భార్య వాణి *రెండు రోజుల్లో చీరాల చేరుకోనున్న అంకమ్మరావు చీరాల : బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి బోడో తీవ్రవాదుల చెరలో చిక్కుకున్న తొమ్మిదిరోజులు తర్వాత క్షేమంగా తిరిగి వచ్చాడు చీరాలకు చెందిన ఇంజినీర్ బత్తుల అంకమ్మరావు. మంగళవారం ఉదయం ఆయన్ని తీవ్రవాదులు విడుదల చేశారు. ఈ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. అసోం లో బొలినేని శీనయ్య నిర్మాణ సంస్థలో సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అంకమ్మరావు డిసెంబర్ 22 సాయంత్రం విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా తీవ్రవాదుల చేతిలో కిడ్నాప్ అయిన విషయం విదితమే. అంకమ్మరావు కిడ్నాప్‌నకు గురయ్యాడని తెలుసుకున్న భార్య వాణి, కుటుంబ సభ్యులు అప్పటి నుంచి మనోవే దనకు గురయ్యారు. ఆయన్ను క్షేమంగా విడిచిపెట్టాలని వేడుకున్నారు. సంఘటనపై స్పందించి చర్యలు చేపట్టాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో చీరాలలో ధర్నా, ర్యాలీలు నిర్వహించారు. ఎట్టకేలకు తీవ్రవాదులు అంకమ్మరావును విడుదల చేశారు. మరో రెండు రోజుల్లో ఆయన చీరాలకు రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంతో సంతోషంగా ఉంది -బత్తుల వాణి, ఇంజినీర్ భార్య నా భర్త బోడో తీవ్రవాదుల చెర నుంచి విడుదలయ్యాడన్న వార్త ఎంతో సంతోషాన్నిచ్చింది. నూతన సంవత్సరంలో సంతోషకరమైన వార్త విన్నాను. భగవంతుడే నా భర్తను కాపాడాడు. పిల్లలతో, నాతో ఆయన ఫోన్లో మాట్లాడారు. కిడ్నాప్‌నకు గురైన నాటి నుంచి మీడియా, పోలీస్, రెవెన్యూవారు ఎంతో సహకారం అందించారు. అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.