breaking news
alivelu mangamma
-
తిరుమల శ్రీవారి ఆలయంలో అమ్మవారు ఎందుకు కనిపించరు?
కలియుగప్రత్యక్షదైవం వేంకటేశ్వరుని చరిత్ర ఎన్నో అద్భుతాలతో నిండి ఉంటుంది. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఈ నాటికీ కనపడుతూ ఉంటాయి. కొన్ని మనకి తెలిసినట్టే ఉంటాయి, కానీ స్పష్టత ఉండదు. అది శ్రీ వేంకటేశ్వరుని మాయాజాలం. భక్తిలో లోపం ఉండదు. నమస్కారం, పూజ చేస్తూ ఉంటాం. గట్టిగా కొన్ని వివరాలు అడిగితే అవగాహన లేదు కనుక చెప్పలేకపోతాం.ఆ విధంగా మనం అయోమయంలో పడే విషయాలలో ఒకటి తిరుమలలో అమ్మవారు లేరేమిటి? ప్రతి ఆలయంలోనూ స్వామి పక్కనే అమ్మవారు కూడా ప్రత్యేకంగా ఉంటారు కదా! మరొకటి తిరుచానూరులో ఉన్న అమ్మవారు ఎవరు? పద్మావతియా? అలమేలు మంగమ్మా? స్వామివారిని పద్మావతీ అలమేలుమంగా సమేత వేంకటేశ్వరుడు అని కీర్తిస్తాం కదా! పద్మావతి, అలమేలుమంగా ఒకరే అయితే ఇద్దరుగా ఎందుకు చెపుతాం? ఇంతకీ శ్రీ వేంకటేశ్వరుని దేవేరులు స్వామి వద్ద ఉండరా? తెలుసుకుందాం.శ్రీ వేంకటేశ్వరుడు తిరుమలలో అవతరించటానికి గల కారణాలు పురాణాలు చెప్పిన కథ అందరికీ తెలుసు. లక్ష్మీదేవి తాను నెలవై ఉన్న స్థానాన్ని భృగుమహర్షి పాదంతో తన్నినందుకు అలిగి వైకుంఠాన్ని వదలి వెడితే, భార్యని వెదుకుతూ శ్రీమహావిష్ణువు భూలోకానికి రావటం జరిగింది. వెతికి, వెతికి విసిగిపోయి ఆయన వరాహక్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. వరాహస్వామిని తాను ఉండటానికి స్థలం అడిగితే ఇచ్చి, వకుళమాతను సేవ చేయమని నియోగించాడు.వకుళమాత ఆలనలో తేరుకున్న వైకుంఠనాథుడు వేటకి వెళ్ళి అక్కడ పద్మావతిని చూసి, మోహించి, దెబ్బలు తిని, వకుళకి తన పరిస్థితి చెప్పి, నారాయణవనాన్ని పాలించే ఆకాశరాజు వద్దకు వెళ్ళి పద్మావతితో తన వివాహం నిశ్చయం చేయించమని అడిగాడు. వియ్యమందటానికి తమది సమాన స్థాయి కాదు కదా! అంటుంది వకుళ. వకుళని వెళ్ళమని చెప్పి, ఆమె వెళ్ళే లోపు తాను ఎఱుకులసాని వేషం వేసి, పద్మావతి తల్లి ధారిణీదేవిని సుముఖురాలిని చేశాడు.ఈ పద్మావతి ఎవరు?ఈ పద్మావతీదేవి ఇతివృత్తానికి నాంది కృతయుగంలో జరిగింది. త్రేతాయుగంలో కొనసాగింది. ద్వాపరయుగంలో అంతర్హితంగా ఉండిపోయింది. ఇరువదిఎనిమిదవ కలియుగంలో పతాక సన్నివేశం జరిగింది. కుశధ్వజుడు మాలావతిల కుమార్తె లక్ష్మీదేవి అంశతో జన్మించింది. పుట్టగానే పురిటి గదిలోనే వేదాలు వల్లె వేయటంతో వేదవతి అని నామకరణం చేశారు. లక్ష్మీదేవి అంశ కదా! పెద్దలు వద్దని చెపుతున్నా వినకుండా, విష్ణువే తనకు తనకు భర్తగా లభించాలని తపస్సు చేయటం ప్రారంభించింది.అసలే అందాల రాశి. ఇప్పుడు తపశ్శక్తి చేత మరింత మెరిసిపోతోంది. రావణాసురుడు ఆమె సౌందర్యాన్ని చూచి మోహపరవశుడు అయ్యాడు. వేదవతి నిరాకరించటంతో బలవంతం చేయబోయాడు. ఒక రాక్షసుడు ఆశించిన శరీరం ధరించి ఉండటం అవమానంగా భావించి విష్ణువు చేతనే ఆ పాపిని చంపిస్తాను అని ప్రతిజ్ఞ చేసి యోగాగ్నిలో శరీరం వదలింది. రావణుడు చేసేది లేక, కోరిక తీరక వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అగ్నిదేవుడు ఆ తపస్వినిని తనతో తీసుకు వెళ్ళి స్వాహాదేవి వద్ద భద్రంగా ఉంచి కాపాడాడు.త్రేతాయుగంలో శ్రీ మహా విష్ణువు శ్రీరామచంద్రుడుగా అవతరించినప్పుడు తన కోరిక తీరుతుందేమో అని భావించింది. ఇప్పుడు తపస్సు మరొక విధంగా సాగింది. రావణుడు సీతాదేవిని అపహరించే సమయంలో అగ్ని అతడితో ‘‘నేను నీ శ్రేయోభిలాషిని కనుక ఒక రహస్యం చెపుతాను. విను. నీవు తీసుకు వెడుతున్నది సీత కాదు. సీత నా దగ్గర ఉంది.’’ అని వేదవతిని చూపిస్తాడు. కాముకుడైన రావణుడు నిజమని నమ్మి వేదవతిని తనతో లంకకు తీసుకు వెడతాడు.సీత అగ్ని వద్ద క్షేమంగా ఉంది. రావణుడు పెట్టిన బాధలనన్నింటినీ భరించింది వేదవతి. రావణ వధానంతరం అగ్నిప్రవేశం చేసింది. వేదవతితో పాటు సీతను కూడ కసుగందకుండా తెచ్చి ఇచ్చాడు అగ్నిభట్టారకుడు. సీత పక్కన సీత లాగా ఉన్న స్త్రీని చూసి రాముడు నిన్ను పోలి ఉన్న ఈమె ఎవరు? అని ప్రశ్నించాడు. దానికి సీత ‘‘ఈమె వేదవతి. నాకు మారుగా అగ్నిదేవుడు ఈమెను లంకకు పంపాడు. మన కోసం ఆమె రావణుడు పెట్టిన హింసలన్నిటినీ భరించింది.నీ కొరకే తపస్సు చేస్తోంది. కనుక ఈమెను కూడా నీవు నాతో పాటుగా స్వీకరించ వలసినది’’ అని ప్రార్థించింది. రాముడు ఆమెను మెచ్చుకున్నాడు. కానీ, ఈ జన్మలో అది కుదరదు. తాను ఏకపత్నీవ్రతం అనే దానిని ఆచరిస్తున్నానని, ఆమె కోరిక రాబోయే కాలంలో తీరుతుందని అప్పటి వరకు బ్రహ్మలోకంలో వసించమని సెలవిచ్చాడు. అది కలియుగవాసుల అదృష్టం పండి వేంకటాచలంలో ఫలించింది. అప్పటి వరకు వేదవతి బ్రహ్మలోకంలో తపస్సు చేస్తూ ఉండి పోయింది.కలియుగంలో శ్రీ మహావిష్ణువు అలిగి భూలోకానికి వెళ్ళిన లక్ష్మీదేవిని వెతుకుతూ అలసి పోయి, ఆదివరాహ క్షేత్రంలో తపస్సు చేస్తూ, వకుళ ఆదరణతో ఉండిపోయాడు. అదే సమయంలో నారాయణవనాన్ని చంద్రవంశానికి చెందిన ఆకాశరాజు పాలిస్తూ ఉండేవాడు. భార్య ధరణీదేవీ. వారికి ఎంతకాలానికి సంతానం లేదు. బృహస్పతి సూచన మేరకు పుత్రకామేష్టి చేయాలనుకున్నాడు. దాని కోసం బంగారు నాగలితో భూమిని దున్నుతూ ఉంటే భూమిలో నుంచి ఒక వెయ్యి రేకుల పద్మం పుట్టింది. అందరూ చూస్తూ ఉండగా, పద్మం విచ్చుకొని, అందులో ఒక బాలిక దర్శనం ఇచ్చింది. ఇంతలో అశరీరవాణి ఆకాశరాజును ఉద్దేశించి ‘‘ఈ బాలిక నీ కుమార్తె. పద్మావతి. అల్లారుముద్దుగా పెంచు. అంతా శుభం జరుగుతుంది.’’ అని పలికింది. ఆకాశరాజు ధారిణీదేవిల సంతోషానికి అంతు లేదు. పద్మావతి అడుగుపెట్టిన వేళావిశేషం వల్ల వారికి వసుదానుడు అనే కుమారుడు జన్మించాడు.అయోనిజ అయిన కుమార్తెకు వరుణ్ణి వెతకటం ఎట్లా అని ఆలోచిస్తున్నాడు ఆకాశరాజు. వనవిహారనికి వెళ్ళిన పద్మావతి శ్రీనివాసుని చూసి ఆకర్షితురాలై విరహవేదనతో బాధపడుతున్న సమయంలో ఎఱుకతగా వచ్చి శ్రీనివాసుడు వకుళ వచ్చే సమయానికి ఆకాశరాజుని, ధారుణి దేవిని సంబంధం అంగీకరించటానికి సంసిద్ధం చేయటం జరిగింది. చక్రవర్తితో సంబంధం. తగిన ఏర్పాట్లు ఉండాలి. అందుకు కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నాడు. సమయానికి లక్ష్మీదేవి దగ్గర లేదని బాధ పడుతుంటే అగ్నిదేవుడు వెళ్ళి కొల్హాపురంలో ఉన్న లక్ష్మిని తీసుకు వచ్చాడు.కల్యాణం కాగానే లక్ష్మి తిరిగి వెళ్ళి పోయింది. వేంకటేశ్వరుడు తిరుమలకు పద్మావతీదేవితో వెళ్ళిపోయాడు. కానీ, లక్ష్మీదేవి దూరమైందనే బాధ ఆయనను వేధిస్తోంది. చూడలేక పద్మావతి తాను వెళ్ళి బతిమాలి తీసుకు వస్తాను అన్నది. కానీ, శ్రీనివాసుడు తానే వెళ్ళి, కొల్హాపురంలో లక్ష్మి కోసం వెతికితే కనపడలేదు. తపస్సు చేశాడు. తపస్సు ఫలించి, అశరీరవాణి సువర్ణముఖీ నదీతీరంలో మున్యాశ్రమ సమీపంలో ఒక సరస్సు నిర్మించి, బంగారు పద్మాలు ప్రతిష్ఠించి మహాలక్ష్మిని ఉపాసించు అని చెప్పింది.ఆ విధంగా పన్నెండు సంవత్సరాలు ఉపాసన చేశాక పద్మనాళం నుండి బంగారు రథం మీద సర్వాభరణ శోభితురాలై ఆవిర్భవించింది. శ్రేష్ఠమైన పుష్పం తామరలో ఉన్న తల్లి కనుక అలర్ మేల్ మంగై అని కీర్తించారు. పద్మంలో పుట్టింది కనుక పద్మ అన్నారు. పద్మినీజాతి స్త్రీ కనుక పద్మావతి. పద్మం అంత పవిత్రము, ఆహ్లాదకరము అయినది. పద్మాలు కలది కనుక పద్మావతి అయింది. శ్రీనివాసుడు పద్మావతిని ప్రేమగా స్వీకరించాడు.తనతో తిరుమలకు తీసుకు వెడుతుంటే దేవతలు, మునులు ప్రార్థించటంతో అర్చామూర్తిగా తిరుచానూరులో ఉండటానికి అంగీకరించింది. తిరుచానూరులో స్వతంత్ర వీరలక్ష్మిగా పూజలు అందుకుంటున్నది. వ్యూహలక్ష్మిగా శ్రీనివాసుని వక్షస్థలాన చేరింది. ఆకాశరాజు కుమార్తె పద్మావతి కూడా వ్యూహలక్ష్మితో ఐక్యమై పోయింది. దేవేరులను ప్రత్యేకమైన విగ్రహాలుగా విడిగా ఉంచకుండా వారిని తన వక్షస్థలాన ధరించి శ్రీనివాసుడు (శ్రీ అంటే లక్ష్మికి నివాసమైనాడు) అయ్యాడు. లక్ష్మికి ఉన్న రూపాలన్నిటికి నెలవైనాడు.వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీః, కరతలకమలే సర్వదా దానలక్ష్మీఃదోర్దండే వీరలక్ష్మీర్హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీః,ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః, నిఖిలగుణగణాడంబరే కీర్తిలక్ష్మీః.సర్వాంగే సౌమ్యలక్ష్మీః సర్వసామ్రాజ్యలక్ష్మీర్మయితు విజయతాం!శ్రీనివాసుడికి ఆ పేరు సార్థకమైంది. మరి, పద్మావతికి ఆ పేరు సార్థకమేనా? పద్మావతి అంటే పద్మవనంలో పుట్టింది అని మాత్రమే కాదు. పద్మాలు అంటే కుండలినీ మార్గంలో ఉండే షట్చక్రాలు.మానవ శరీరంలో జగన్మాత కుండలినీ రూపంగా మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టుకొని ఉంటుంది. ఆ దారిలో సాధకుడు దాటవలసిన స్థాయులే షట్చక్రాలు. అవే పద్మాలు. ఆ పద్మాలలో ఉండే తల్లి పద్మావతి. ఆ చైతన్య స్వరూపిణి భక్తులు ఆరాధించటానికి అనువుగా ఒక భౌతిక రూపం ధరించింది అని సూచించటానికే అమ్మ ఏడు కొండలకు మూలంలో వెలసింది. ఆ ఏడుకొండలు సహస్రారంతో కలిపి ఏడు చక్రాలు. సహస్రారంలో ఉండే పరంధాముడే శ్రీనివాసుడు. ఏడుకొండల మొదట ఉన్న పద్మావతి ఏడో కొండపైన ఉన్న తన భర్త ఇంటికి చేరుకోవటం అన్న దానికి ప్రతీకయే భక్తులు కొండనెక్కి స్వామిని దర్శించుకోవటం. తిరుమలలో అన్నీ ఆశ్చర్యాలే, అద్భుతాలే, రహస్యాలే! ఇవి మచ్చుకి.- డాక్టర్ ఎన్.అనంతలక్ష్మిఇదీ చదవండి: జ్ఞానమే విముక్తి – చిక్కులే సమాధానం -
మనస్తాపంతో ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సీహెచ్ అలివేలు మంగమ్మ (50) టీచర్ గా పనిచేస్తోంది. తల్లిదండ్రులు శేషచారి, శశిరేఖలతో కలిసి శంషాబాద్ లోని ఆర్బీనగర్లో నివాసముంటోంది. పదేళ్ల కింద భర్తతో విడాకులు తీసుకున్న అలివేలు మంగమ్మకు ఓ కూతురు ఉంది. గురువారం తల్లిదండ్రులు కుక్కకు వైద్యం చేయించడానికి బయటికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఒంటరిగా ఉన్న కూతురు ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


