breaking news
air condition market
-
ఏసీ అమ్మకాల్లో వృద్ధి అంతంతే..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది రూమ్ ఏసీల విక్రయాలు 10–15 శాతమే పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా అధిక డిమాండ్ ఉండే జూన్‌లో ఉత్తర, పశ్చిమ భారత్‌లో వేడి వాతావరణం నెలకొనగా, మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో కంపెనీలు తమ అంచనాలను తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఏసీల అమ్మకాలకు వేసవి సీజన్ ఎంతో కీలకం. అధిక శాతం అమ్మకాలు ఈ సీజన్లోనే నమోదవుతుంటాయి. కానీ ఈ ఏడాది వేసవిలో మధ్యంతర వర్షాలు ఈ రంగం ఆశలపై నీళ్లు చల్లింది. జూన్‌లో ఉత్తరాది అంతటా వేడి వాతావరణం నెలకొనడం ఒక్కటి విక్రయాలకు కాస్తంత మద్దతునిచ్చే అంశం. నిజానికి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫిబ్రవరి, మార్చిలోనే రూమ్ ఏసీల అమ్మకాలకు అధికంగా నమోదు కావడం గమనార్హం. దీంతో గతేడాది సీజన్‌తో పోలి్చతే ఈ ఏడాది 25 శాతం అధిక అమ్మకాలపై కంపెనీలు అంచనాలు వేసుకున్నాయి. తర్వాత మారిన వాతావరణ పరిస్థితులతో ఈ అంచనాలు నిజం కాలేదు. ‘‘25–30 శాతం మేర అమ్మకాల వృద్ధిని ఆశించాం. కానీ, అనుకున్న స్థాయిలో అమ్మకాలు సాధించలేదు. ఈ వేసవి నిరాశపరిచిందనడంలో సందేహం లేదు. కానీ, వ్యాపారంలో ఇదొక భాగమే. ఈ పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లాల్సిందే’’అని బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. మొత్తానికి ఈ ఏడాది ఆర్ఏసీ విక్రయాలు 10–15% వృద్ధికి పరిమితం కావొచ్చని చెప్పారు. జూన్ మధ్య నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయంటూ భారత వాతావరణ శాఖ గత వారం అంచనాలు వెల్లడించడం గమనార్హం. సెపె్టంబర్ క్వార్టర్లో పుంజుకోవచ్చు.. ప్రస్తుత జూన్ త్రైమాసికం రూమ్ ఏసీ రంగానికి అనుకూలంగా లేదని.. సెపె్టంబర్ త్రైమాసికంలో విక్రయాలు పుంజుకోవచ్చని త్యాగరాజన్ పేర్కొన్నారు. పండుగల సందర్భంగా డిమాండ్ పెరగొచ్చన్నారు. ఎనర్జీ లేబుళ్లు మారుతుండడం, డిస్కౌంట్ ఆఫర్లతో గత నిల్వలను తగ్గించుకోగలమన్నారు. ఇంధన ఆదా లేబుళ్లను మార్చే ముందు ముందస్తు కొనుగోళ్లు పెరగడం సహజమేనన్నారు. 2024 అమ్మకాలతో పోల్చి చూసినప్పుడు గత రెండు నెలల్లో ఎలాంటి వృద్ధి కనిపించలేదని వోల్టాస్ ఎండీ, సీఈవో ప్రదీప్ బక్షి సైతం తెలిపారు. కనుక జూన్ త్రైమాసికంలో అమ్మకాల పరంగా పెద్ద వృద్ధి నమోదు కాకపోవచ్చని, గతేడాది మాదిరిగా 25 శాతం వృద్ధిని సాధించడం సవాలుగా పేర్కొన్నారు. వేసవిలో అమ్మకాలు గరిష్టంగా ఉండే సమయంలో వర్షాలు దెబ్బతీసినట్టు చెప్పారు. ఏప్రిల్, మే నెలలో అమ్మకాల వృద్ధిని కోల్పోవడంతో, మిగిలిన ఏడాదిలో కోలుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాదిలో వేడి వాతావరణంతో ఏసీల అమ్మకాలు పుంజుకున్నాయంటూ, ఇదొక్కటే సానుకూలతగా పేర్కొన్నారు. జూన్‌లో కాస్త మెరుగు.. హైయర్ అప్లయన్సెస్ ఇండియా మాత్రం ఈ ఏడాది ఇప్పటి వరకు మెరుగైన వృద్ధిని సొంతం చేసుకుంది. గతేడాదితో పోలి్చతే రూమ్ ఏసీల అమ్మకాలు 30 శాతం పెరిగినట్టు సంస్థ ప్రెసిడెంట్ ఎన్ఎస్ సతీష్ వెల్లడించారు. ‘‘ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకు సానుకూలంగా లేవు. 10–15 శాతం మేర అమ్మకాలు తగ్గాయి. జూన్‌లో తిరిగి అమ్మకాలు పుంజుకున్నాయి. ఫిబ్రవరి, మార్చిలోనే ప్రణాళిక మేరకు ముందస్తు కొనుగోళ్లు జరిగాయి’’అని వివరించారు. కానీ, ఏప్రిల్, మే నెలల్లో కొనుగోలు చేద్దామనుకున్న కస్టమర్లు.. ఉష్ణోగ్రతలు పెరగకపోవడంతో వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా జూన్‌లో గత పది రోజులుగా ఉత్తరాది ప్రాంతంలో అమ్మకాలు పెరిగినట్టు తెలిపారు. 2025 సంవత్సరంలో మిగిలిన కాలానికి పరిశ్రమ అంచనాలు తగ్గించుకున్నట్టు సతీష్ తెలిపారు. గతేడాది స్థాయిలో వృద్ధి ఉండకపోవచ్చంటూ.. అమ్మకాలు 10–15 శాతం వృద్ధికి పరిమితం కావొచ్చన్నారు. -
ఏసీల డిమాండ్ ఎలా ఉండనుందంటే..
కోల్‌కతా: ఉష్ణోగ్రతల్లో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో దేశంలో రూమ్ ఏసీల వినియోగం ఏటా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) పరిశ్రమ అసాధారణ వృద్ధిని చూడనుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 20–25 శాతం అధికంగా 1.2–1.25 కోట్ల రూమ్ ఏసీ యూనిట్లు అమ్ముడుపోవచ్చని పేర్కొంది. అంతేకాదు వచ్చే ఆర్థిక సంత్సరంలోనూ (2025–26) రూమ్ ఏసీల అమ్మకాలు 10–12 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం, ఒక ఇంట్లోనే ఒకటికి మించిన గదుల్లో ఏసీలను ఏర్పాటు చేసుకుంటుండటం, పట్టణీకరణ, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, సులభతర కన్జ్యూమర్ ఫైనాన్స్ (రుణాలపై కొనుగోలు) సదుపాయాలు... ఇవన్నీ వచ్చే కొన్నేళ్ల పాటు రూమ్ ఏసీల డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. ‘‘దేశీ రూమ్ ఏసీ పరిశ్రమ కరోనా ముందు నాటి విక్రయాల పరిమాణాన్ని 2023–24లోనే అధిగమించింది. వాతావారణంలో వచి్చన మార్పులు, సానుకూల వినియోగ ధోరణులు మద్దతుగా నిలిచాయి’’అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకుమార్ కృష్ణమూర్తి వివరించారు. ఏడాదిలో అధిక వేడి ఉండే సగటు రోజులు గడిచిన మూడు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది వేసవి సీజన్లో అయితే రూమ్ ఏసీలకు సంబంధించి కొన్ని కంపెనీలు (ఓఈఎంలు) 40–50 శాతం వరకు అధిక అమ్మకాలను నమోదు చేయడం గమనార్హం. సామర్థ్యాల పెంపుపై దృష్టి.. ‘‘సరఫరా వైపు చూస్తే దేశీ రూమ్ ఏసీ సామర్థ్యం వచ్చే మూడేళ్లలో 40 శాతం పెరగనుంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఓఈఎంలు, కాంట్రాక్టు తయారీదారులు రూమ్ ఏసీల తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు’’అని కృష్ణమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ డ్యూరబుల్ విడిభాగాలకు పీఎల్ఐ పథకం కింద ప్రకటించిన ప్రయోజనాల ప్రభావాన్ని సైతం ఇక్రా నివేదిక గుర్తు చేసింది. రూమ్ ఏసీ పరిశ్రమలో స్థానిక తయారీ పెరగడానికి పీఎల్ఐ పథకం దోహదం చేసినట్టు తెలిపింది. మూడు లిస్టెడ్ రూమ్ ఏసీ కంపెనీలు జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో 53 శాతం మేర ఆదాయ వృద్ధిని నమోదు చేయడాన్ని ప్రస్తావించింది. వేసవి సీజన్లో డిమాండ్ గరిష్ట డిమాండ్‌కు నిదర్శనంగా పేర్కొంది. ఈ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం మేర ఆదాయంలో వృద్ధిని సాధించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 25 శాతం అధిక ఆదాయాన్ని నమోదు చేస్తాయని ఇక్రా అంచనా వేసింది. తీవ్ర పోటీ, తయారీకి వినియోగించే విడిభాగాల ధరల్లో అస్థితరలు ఉన్నప్పటికీ.. రూమ్ ఏసీ కంపెనీల లాభాల మార్జిన్లు రానున్న కాలంలో క్రమంగా మెరుగుపడతాయని పేర్కొంది. -
రాష్ట్ర మార్కెట్లోకి గ్రీ ఎయిర్ కండీషనర్లు
ధరల శ్రేణి రూ.24,000 - రూ.1.40 లక్షలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర ఎయిర్ కండీషన్ మార్కెట్లోకి మరో కొత్త బ్రాండ్ ‘గ్రీ’ వచ్చి చేరింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గ్రీకి చెందిన కొత్త ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ జిమ్మీ జోస్ మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో 30 శాతం మార్కెట్ వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మొదటి సంవత్సరం 25,000 యూని ట్లను విక్రయించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండియా రెసిడెన్షియల్ ఏసీ మార్కెట్ 35 లక్షల యూనిట్ల అమ్మకాలతో రూ.7,500 కోట్లుగా ఉందన్నారు. వీటి ధరలు రూ.24,000 నుంచి రూ.1.40 లక్షల వరకు ఉన్నట్లు తెలిపారు. సోలార్ ఎయిర్ కండీషనర్లపై బెంగళూరులో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని, వచ్చే రెండేళ్లలో వాణిజ్యపరంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. దక్షిణ భారతదేశంలో గ్రీ ఉత్పత్తులను విక్రయించడానికి సెర్వోమాక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారు.