breaking news
achanta mandal
-
వల్లూరులో విషాద ఛాయలు
ఆచంట: హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బ్యూటీషియన్ ఆరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష మరణ వార్తతో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరులో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె భర్త సతీష్ చంద్ర స్వగ్రామం వల్లూరు పంచాయతీ పరిధి మట్టపర్తివారిపాలెం కావడంతో ఆమెకు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహంపై గాయాలు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. శిరీష మృతదేహాన్ని చూసిన స్థానికులు, బంధువులు కంటతడిపెట్టారు. అంత్యక్రియలకు శిరీష తల్లిదండ్రులతోపాటు బంధువులు హాజరయ్యారు. దాదాపు 15 ఏళ్ల క్రితం శిరీష, సతీష్ చంద్రకు వివాహమైంది. వారిద్దరూ అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్నా తరచుగా స్థానికంగా జరిగే కార్యక్రమాలకు వచ్చేవారని బంధువులు తెలిపారు. ఆరు నెలల క్రితమే వల్లూరులో బంధువుల వివాహ కార్యక్రమానికి భర్తతో హాజరైన శిరీష విగతజీవిగా ఇక్కడకు రావడాన్ని గ్రామస్తులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. నా భార్యను హత్యచేశారు: శిరీష భర్త తన భార్య శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని భర్త సతీష్ చంద్ర ఆరోపించాడు. స్టూడియో యజమాని వల్లభనేని రాజీవ్‌ను విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాడు. -
ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లు, జేసీబీ సీజ్
ఆచంట : అయోధ్యలంక పంచాయతీ పరిధి పుచ్చలంకలో బుధవారం రాత్రి బొండు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లతోపాటు, జేసీబీని ఆచంట పోలీసులు సీజ్ చేశారు. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లాను ఆనుకుని ఉండడంతో రాత్రి వేళల్లో అక్రమార్కులు ట్రాక్టరర్లపై అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. వీఆర్వో అప్పారావు ఫిర్యాదు మేరు ఆచంట ఎస్ఐ ఏజీఎస్ మూర్తి సిబ్బందితో దాడిచేశారు.అక్రమార్కులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఎస్ఐ పాలకొల్లు సీఐ చంద్రశేఖర్‌కు సమాచారం ఇచ్చారు. సీఐ అదనపు పోలీసులతో గ్రామానికి చేరుకున్నారు. దీంతో అక్రమార్కులు పరారయ్యారు. దీంతో పోలీసులు ఏడు ట్రాక్టర్లు, జేసీబీని సీజ్ చేసిఇ.వెంకటేశ్వరరావుతోపాటు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు.