breaking news
aa naluguru
-
విడుదలకు సిద్ధమైన ‘ఆటగదరా శివ’
ఆ నలుగు, మధుమాసం, అందరి బంధువయా లాంటి క్లాస్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంద్రసిద్ధార్థ ఏమో గుర్రం ఎగరావచ్చు ఫ్లాప్ అవ్వడంటో గ్యాప్ తీసుకున్నారు. 2014 నుంచి దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన త్వరలో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన మార్క్ కనిపించేలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆటగదరా శివ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో జబర్ధస్త్ ఫేం హైపర్ ఆది కీకల పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ నెలాఖరున సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఆ నలుగురు దర్శకుడి 'ఆటగదరా శివా..!'
ఆ నలుగురు, అందరి బంధువయా లాంటి సందేశాత్మక చిత్రాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో అదే బాటలో మరో సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాణ సారథ్యంలో ఆటగదరా శివా అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సందేశాత్మక అంశాలతో పాటు ఆధ్యాత్మిక భావాలను కూడా చూపేలా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను అంతా కొత్తవారితోనే తెరకెక్కించాలని నిర్ణయించారు. తెలుగులో పవర్ సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా లింగా సినిమాను నిర్మించిన రాక్‌లైన్ వెంకటేష్, బాలీవుడ్ సినిమా భజరంగీ బాయ్ జాన్‌కు సహనిర్మాతగా వ్యవహరించారు. ఆటగదరా శివా సినిమాను కూడా తన గత చిత్రాల స్థాయిలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రారంభించనున్నారు. -
వేదనలో వినిపించిన జీవనవేదం
పాటతత్వం ‘ఆ పాట లేకపోతే ఆ సినిమా లేదు’ అన్నారు చంద్రసిద్ధార్థ్. ‘ఈ మాటలు మనవి కావు, చైతన్యప్రసాద్వి’ అన్నారు బాలు. ‘ఇంత చిన్న వయసులో జీవితానుభవాన్ని కాచి వడబోసిన గొప్ప పాట’ అన్నారో పెద్దాయన. ‘కారులో విజయవాడ చేరేవరకూ ఈ ఒక్క పాటే వింటుం టాను’ అన్నాడో రియల్ ఎస్టేట్ వ్యాపారి. ‘ఎప్పుడు విన్నా కన్నీళ్లు ఆగవు’ అంటూ యూ ట్యూబ్‌లో ఎన్నో కామెంట్లు. ఇవి ‘ఆ నలుగురు’ సినిమాలో నేను రాసిన ‘ఒక్కడై రావడం’ పాటకు లభించిన అవార్డుల్లో కొన్ని. ఈ పాటకు నాకు చాలా అవార్డులు వచ్చి వుంటాయని చాలామంది అనుకోవడం నాకు తెలుసు. కానీ ఏ అవార్డులూ రాలేదు. ఈ మాటలే అవార్డులు. చాలాకాలంగా సినీ పరిశ్రమలో ఉన్నా, 2002లో ‘అల్లరి రాముడు’ నుంచి మాత్రమే క్రమం తప్పకుండా రాస్తున్నాను. 2004లో ‘ఆ నలుగురు’ వచ్చింది. అంటే పాటల రచయితగా అవి నా ప్రారంభ దినాలు. ఈ సినిమా ఏమో మామూలు సినిమా కాదు. ఉన్న మూడు పాటలూ ఏదో ఒక తాత్వి కతను ప్రతిఫలించడమో, ప్రతిపాదించడమో చేయాలి. అందుకే లబ్దప్రతిష్టులైన కవులతో రాయించాలని నిర్మాత ప్రేమ్‌కుమార్, రచయిత మదన్ అభిప్రాయపడ్డారు. నన్ను నమ్మింది ఇద్దరే... చంద్రసిద్ధార్థ, ఆర్పీ. మదన్‌తో పేచీ తొందరగానే తెమిలిపోయింది. కానీ ప్రేమ్ కుమార్ మాత్రం దర్శకుడికి ఎదురు చెప్పలేక ఊరుకున్నారు. క్లయిమాక్స్ పాట విషయంలో చివరి వరకూ వేరే అభిప్రాయంతోనే ఉన్నారు. ఈ సినిమా హీరో చావుతో మొదలవు తుంది. అంతా శవం చుట్టూ తిరుగుతుంది. చూసేవాళ్లకు డిప్రెషన్ వస్తుందేమోనని నా భయం. ‘అలా రాకుండా నేను తీస్తానుగా’ అనే వారు చందూ. ఈ పాట విషయంలో కూడా అదే సందేహం వ్యక్తం చేస్తే... ‘చావు గురించి చెబుతూ జీవితం పట్ల ప్రేమ, గౌరవం కలిగేలా రాయండి’ అన్నారు. పైగా పాటకు పల్లవి, చరణాలు లేవు. ట్యూన్‌ను బిట్స్లా ఇచ్చారు ఆర్పీ. ఏవి ఎక్కడ వాడతారో తనకూ తెలీదన్నారు దర్శకులు. నిజానికి రాయడానికైతే విషయం చాలానే ఉంది. చావు పుటకల గురించి భారతీయ తత్వ వేదాంత చింతనల్లో విస్తృత చర్చ ఉంది. ‘సహస్రవర్ష’ కావ్యం రాసేటప్పుడు సృష్టి గురించీ, కర్మ-భక్తి యోగాల గురించీ భగవద్గీతలో అధ్యయం చేసివున్నాను. ఆదర్శ, అభ్యుదయవాదాలూ సుపరిచితాలు. ఆశయా నికీ ఆశలకూ మధ్య నిత్య ఘర్షణ ఎలా ఉంటుందో నా నలభయ్యేళ్ల జీవితంలో నాకు అనుభవమైంది. ప్రేమించినవాళ్లు మరణిస్తే ఆ దుఃఖభారం ఎలా ఉంటుందో తండ్రినీ, ఆత్మీయ బంధుమిత్రుల్నీ కోల్పోయిన నాకు తెలుసు. ఇదంతా ఈ పాటలో చెప్పాలి. వేదన నిర్వేదంగా మారకుండా జీవనవేదంలా చెప్పాలి. కళ్లు కాదు, గుండె చెమ్మగిల్లాలి. బతికితే ఇలా బతకాలి అనిపించాలి. ఆ మథనం లోంచే నా మనసు పలికింది. ‘ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం... నడుమ ఈ నాటకం విధిలీల/వెంట ఏ బంధమూ.. రక్త సంబంధమూ... తోడుగా రాదుగా తుదివేళ/మరణమనేది ఖాయమని.. మిగిలెను కీర్తి కాయమని/నీ బరువూ నీ పరువూ మోసేదీ/ఆ నలుగురూ... ఆ నలుగురూ నీ బరువునే కాదు నీ పరువును కూడా ఆ నలుగురూ మోస్తారనడం కొత్త వ్యక్తీకరణ. ఇక రెండో చరణంలో కచ్చితంగా కథానాయకుడు విలువల కోసం ఎన్ని కష్టాలు భరించాడో, ఏ ఆశయం కోసం జీవించాడో గుర్తు చేయాలి. నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా విలువలే శిలువగా మోశావు/అందరూ సుఖపడే సంఘమే కోరుతూ మందిలో మార్గమే చూపావు/నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా/నీ వెనుకే అనుచరులై నడిచారూ... ఆ నలుగురూ ఆ నలుగురూ మూడో చరణం రాసేటప్పుడు సత్య హరిశ్చంద్ర నాటకం కాటి సీన్లో వాడే జాషువా గారి పద్యాలు గుర్తొచ్చాయి. ఆ బాణీలో రాశాను. రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ భేదమే ఎరుగదీ యమపాశం/కోట్ల ఐశ్వర్యమూ కటిక దారిద్య్రమూ హద్దులే చెరిపెనీ మరు భూమి/మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం/నీ వెంట కడకంటా నడిచేదీ... ఆ నలుగురూ ఆ నలుగురూ ఇది సినిమాలో పెట్టడానికి కుదరలేదు. ఇక నాలుగో చరణం.. మరణించిన మిత్రుణ్ని మనసారా సంబోధిస్తూ పలికే వీడ్కోలు. ఆ చరణంతో ముగిస్తే సినిమా మన సుల్లో ముద్రపడుతుందని నా అభిప్రాయం. అదే హీరో చితి మంటలపై వచ్చే ఆఖరి చరణం. పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలో నిలిచావు/ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిర కాలం/ బతికిననాడు బాసటగా పోయిననాడు ఊరటగా/ అభిమానం అనురాగం చాటేదీ ఆ నలుగురూ ఆ నలుగురూ పాట పూర్తయ్యింది. మొదట్నుంచీ సందేహిస్తూ వచ్చిన నిర్మాత ప్రేమ్‌కుమార్ చెమ్మగిల్లిన కళ్లతో వచ్చి నన్ను ఆలింగనం చేసుకోవడం ఎంత మధు రానుభవం! ఈ పాటను టీవీల్లో ప్రముఖుల చరమ యాత్రాగీతికగా వాడటం అన్నిటికంటే గొప్ప అనుభూతి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌గారి అంతిమయాత్రకు ఇది నేపథ్య గీతం అయ్యింది. ఇటీవల ప్రముఖ జర్నలిస్టు, నా ఆత్మీక కవిమిత్రుడూ అయిన అరుణ్ సాగర్ అంతిమయాత్ర నేపథ్యంలో కూడా ఈ పాట వినిపిస్తే... కన్నీళ్లను ఆపుకోవడం నా వల్ల కాలేదు. జీవిత ఔన్నత్యాన్ని చెప్పే ఈ గీతం ఎందుకు అందరితో కన్నీళ్లు పెట్టిస్తోందో నాకప్పుడే అనుభవ పూర్వకంగా అర్థమైంది! - చైతన్య ప్రసాద్, గీత రచయిత -
నలుగురూ మెచ్చిన ఆ నలుగురు
సినిమా వెనుక స్టోరీ - 2 హేమాహేమీల తిరస్కారం... టీవీ సీరియల్‌గా కూడా పనికిరాదని కామెంట్... ఎన్నెన్నో ఆటంకాలు... నాలుగేళ్ల ప్రసవవేదన... ఇదీ ‘ఆ నలుగురు’ తెర వెనుక కథ. అతను చనిపోయాడు.ఊరంతా అప్పులు చేసి చనిపోయాడు. కానీ, అతని అంతిమయాత్రకు ఊరు ఊరంతా కదిలివచ్చింది. మహానుభావుడని పొగిడింది. కారణం... అతను మంచివాడు. కొంచెం గుండెలో తడి ఉన్నవాడు. తనతో పాటు నలుగురూ చల్లగా ఉండాలని కోరుకున్నవాడు. డబ్బు గొప్పదా? మానవత్వం గొప్పదా? ఇదంతా చూసిన మదన్ మస్తిష్కంలో మెదిలిన ప్రశ్న ఇది. మదనపల్లికి సమీపంలోని బి. కొత్తకోట అనే పల్లెటూళ్లో జరిగిందిది. డిగ్రీ చదువుతున్న కుర్రాడు మదన్. ఈ ఇన్సిడెంట్ అతణ్ణి కదిలించింది. లేదు... లేదు... అతని మనసులో విత్తనం వేసింది. అది పెరుగుతోంది... పెరుగుతోంది... పెరిగింది... కట్ చేస్తే... ‘ఈ’ టీవీ ఆఫీస్... మదన్ కథ చెబుతున్నాడు. టైటిల్ ‘అంతిమయాత్ర’. స్టార్టింగ్ సీనే చావు. వింటున్న అతను మొహం చిట్లించాడు. అబ్బో... ఇలాంటి చావు కథతో 26 ఎపిసోడ్ల టీవీ సీరియల్ ఎలా తీస్తారు? కెమేరామేన్ మీర్ రికమెండేషన్ కూడా పనిచేయలేదు. సింగిల్ ఎటెంప్ట్‌లో రిజెక్ట్. ఫేమస్ కెమేరామేన్ ఎస్. గోపాలరెడ్డి దగ్గర అసిస్టెంట్ కెమేరామేన్‌గా చేస్తున్నాడు మదన్. కానీ మదన్ మనసంతా ఆ కథ మీదే! అది తన జీవితాన్ని మలుపు తిప్పుతుందనే బలమైన నమ్మకం. మనం దేన్నైనా బలంగా నమ్మితే, ప్రకృతి మొత్తం ఒక్కటై సహకరిస్తుందట. మదన్ విషయంలో అదే జరిగింది. దర్శకుడు రామ్‌ప్రసాద్ పరిచయమయ్యాడు. ఆయనకు కథ నచ్చింది. ఇప్పుడు బంతి... అట్లూరి పూర్ణచంద్రరావు కోర్టులోకి వెళ్లింది. అట్లూరి సీనియర్ నిర్మాత. రజనీకాంత్, చిరంజీవి లాంటి వాళ్లతో సినిమాలు తీసినవాడు. మురళీమోహన్, గిరిబాబులను ఆర్టిస్టులుగా పరిచయం చేసినవాడు. కొన్నాళ్లు అజ్ఞాతవాసం చేసి రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్లో ‘వెంకీ’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అట్లూరికి ఈ కథ నచ్చేసింది. మదన్‌ని ఊటీ పంపి, నెలరోజులు కూర్చోబెట్టి ఫుల్‌స్క్రిప్ట్ చేయించారు. తర్వాత కె. భాగ్యరాజాకు కబురంపారు. ఎందుకంటే - భాగ్యరాజా మంచి జడ్జిమెంట్ ఉన్న రైటర్, డెరైక్టర్. భాగ్యరాజా కథ విన్నాడు. కదిలిపోయాడు. ‘‘తెలుగు, తమిళ భాషల్లో నేనే చేస్తాను... హీరో మాత్రం నేనే’’ అని ప్రపోజల్ పెట్టాడు. అది అట్లూరికి ఇష్టం లేదు. ఆయన మైండ్‌లో వేరే ఆప్షన్లు ఉన్నాయి. ప్రముఖ తమిళ నటుడు - దర్శకుడు విసు... దాసరి నారాయణరావు... మోహన్‌బాబు... చేస్తే గీస్తే వీళ్లలో ఎవరో ఒకరితో చేయాలి. వీళ్లు కాదంటే... ధర్మవరపు సుబ్రహ్మణ్యం. భాగ్యరాజా వెళ్లిపోయాడు. మళ్లీ ప్రాజెక్ట్ పెండింగ్. డీవీ నరసరాజు సూపర్ సీనియర్ రైటర్. రిటైరై ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. మదన్‌ను ఆయన దగ్గరకు పంపించారు అట్లూరి. అక్కడ కూడా సక్సెస్. మదన్‌కు ఈ స్క్రిప్టు విషయంలో ఓ డౌట్ ఉంది. కోట శ్రీనివాసరావు పాత్ర అప్పులిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి తాకట్టుపెడితే తప్ప... అప్పు ఇవ్వడు. అలాంటివాడు హీరో పాత్రకు ఏ తాకట్టూ అడక్కుండానే అప్పు ఇస్తాడు. ఇది కన్విన్సింగ్‌గా ఉంటుందా అనేది మదన్ సందేహం. ఎన్కో స్క్రిప్టులు వండి వార్చిన బుర్ర కదా! నరసరాజు చిటికెలో పరిష్కారం చెప్పేశారు. హీరో పాత్ర గురించి కోటతో ఓ డైలాగ్ చెప్పిద్దాం. ‘‘మోసం చేయడం చేతకాని పిచ్చివాడివి... అందుకే అప్పు ఇస్తున్నా’’ ఇదీ నరసరాజు రాసిన డైలాగ్. ఇప్పుడీ స్క్రిప్టుకు ఇంకా బరువు పెరిగింది. ప్రకాశ్‌రాజ్ కథ విన్నాడు. మదన్‌ను తేరిపార చూసి ‘‘సినిమాగా కన్నా నవలగా బావుంటుందేమో, ఆలోచించు’’ అని సజెషనిచ్చాడు. మదన్‌కు విసుగొచ్చింది. ‘‘దేవుడా..! నాకో దారి చూపించు’’ అని వేడుకున్నాడు. దేవుడు దారి చూపించాడు. ఆ దారి... దర్శకుడు చంద్రసిద్ధార్థ్. పైకి మాస్‌గా కనిపిస్తాడు కానీ, చంద్రసిద్ధార్థ్ చాలా సెన్సిటివ్. వెరీ క్రియేటివ్. నిగూఢంగా దాగి ఉన్న టాలెంట్‌ని రిగ్ వేసి బయటకు రప్పించగలడు. ఇంగ్లిషులో ‘ఇన్‌స్క్రూటబుల్ అమెరికన్స్’ తీశాడు. తెలుగులో ‘అప్పుడప్పుడు’ తీశాడు. ఇప్పుడు మూడో సినిమా తీయాలి. ఆ ప్రయత్నంలోనే మదన్ కలిశాడు. ‘‘మంచి కథ ఉంటే చెప్పు’’ అడిగాడు చంద్రసిద్ధార్థ్. ‘అంతిమయాత్ర’ కథ చెప్పేద్దామనిపించింది మదన్‌కి. కానీ ఏదో శక్తి ఆపింది. చాలామంది రిజెక్ట్ చేసిన కథ చెప్పి ఎగ్జిట్ అవడమెందుకు? ఆ రోజు సాయంత్రం... చంద్రసిద్ధార్థ్ ఇంటికి వెళ్లాడు మదన్. ఆయన లేడు. రాత్రికి గాని రాడట. చంద్రసిద్ధార్థ్ అన్నయ్య కృష్ణమోహన్ ఉన్నాడు. ఇద్దరూ పిచ్చాపాటీ కబుర్లు. ఆ కబుర్లలోంచే కథ చెప్పడం మొదలుపెట్టాడు మదన్. అంతే... కృష్ణమోహన్ ఫ్లాట్. తమ్ముడు ఇంటికి రాగానే ‘‘చెత్త కథల కోసం వెతకొద్దు. మదన్ దగ్గరే మంచి కథ ఉంది. అదే నీకు బెస్ట్’’ అని చెప్పాడు. అన్న మాటంటే చంద్రసిద్ధార్థ్‌కి గురి. ఎంతంటే - మదన్ దగ్గర కథ కూడా వినకుండా అట్లూరి పూర్ణచంద్రరావు దగ్గర తెలుగు రైట్స్ తీసేసుకున్నాడు. అట్లూరి కూడా విసిగిపోయి ఉన్నారు. ఎన్నేళ్లిలా ఈ కథను పెట్టుకోవాలి. అందుకే అడగ్గానే ఇచ్చేశారు. కానీ ఎక్కడో ఆపేక్ష. అందుకే తమిళ రైట్స్ మాత్రం తనే ఉంచుకున్నారు. టైం బాగున్నప్పుడు అన్నీ ఆటోమేటిగ్గా అమరిపోతాయి. ప్రొడ్యూసర్‌గా ప్రేమ్‌కుమార్ పట్రా అలానే కుదిరాడు. ఇప్పుడు హీరో కావాలి? రాజేంద్రప్రసాద్‌ను కలవాలి - ఎలా? జర్నలిస్ట్ అన్నే రవి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించాడు. మదన్ కథ చెప్పడం పూర్తి కాగానే రాజేంద్రప్రసాద్ బెడ్రూమ్లోకి, చంద్రసిద్ధార్థ్ బాల్కనీలోకి జంప్. మదన్‌కు అర్థమైపోయింది టోటల్‌గా ఈ కథ క్లోజ్ అయిపోయే ముహూర్తం దగ్గరపడిపోయిందని! రాజేంద్రప్రసాద్ వచ్చీ రావడంతోనే ‘‘అర్జంట్‌గా ఈ సినిమాకు ముహూర్తం పెట్టించండి. ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్లు ఆగడం లేదు’’ అని టవల్‌తో కన్నీళ్లు తుడుచుకున్నాడు. చంద్రసిద్ధార్థ్ పరిస్థితీ అంతే. అర్జంటుగా సినిమా మొదలు పెట్టకపోతే మనసు కుదుటపడేలా లేదు. రాజేంద్రప్రసాద్ వెంటనే పనిలో పడిపోయాడు. డైలాగ్ డెలివరీ... కళ్లజోడు... విగ్గు... పంచెకట్టు... టోటల్‌గా రఘురామ్ గెటప్ ఎలా ఉండాలని చర్చ. ఒక రకమైన ఉన్మాదావస్థ. పాత్రను విపరీతంగా ప్రేమిస్తే ఇంతేనేమో! సరే... ఇంతకూ రఘురామ్‌కి పెయిర్ ఎవరు? లక్ష్మి... భానుప్రియ... రోజా... గౌతమి... ఇలా అందరూ కథలు విన్నారు. ఆహా ఓహో అన్నారు. కానీ కాల్షీట్లు లేవే! రాజేంద్రప్రసాద్‌కి తన ‘మిస్టర్ పెళ్లాం’ గుర్తొచ్చింది. ఆమని రెడీ. షూటింగ్ కూడా రెడీ. ఆర్పీ పట్నాయక్ చాలా బిజీ. కానీ చంద్రసిద్ధార్థ్‌కి మాత్రం ఆర్పీతోనే చేయించుకోవాలని పట్టుదల. కథ విని ఆర్పీ కదిలిపోయాడు. అప్పటికప్పుడు ‘ఒక్కడై రావడం... ఒక్కడై పోవడం...’ పాటకు ట్యూన్ కట్టేశాడు. ఈ సినిమా టైటిల్ విషయంలోనూ తమాషా జరిగింది. చంద్రసిద్ధార్థ్ మైండ్‌లో ‘ఆ నలుగురు’ టైటిల్ ఎప్పటి నుంచో నలుగుతోంది. మదన్‌కు కూడా అంతే. యాదృచ్ఛికంగా ఇద్దరూ ఒకేసారి ఈ టైటిల్ చెప్పారు. నాన్న నుంచి ఉత్తరం. చంద్రసిద్ధార్థ్ ఆశ్చర్యపోయాడు. ‘‘ఈ సినిమా టైటిల్ బాగుంది. నాకెందుకో ఈ సినిమాతో నీ జీవితం మలుపు తిరుగుతుందనిపిస్తోంది. ఈ సినిమా నేను తప్పకుండా చూస్తాను’’ ... ఇదీ లేఖ సారాంశం. సినిమాలంటే ఇష్టపడని నాన్న నుంచి ఆశీర్వాదం. చంద్రసిద్ధార్థ్లో రెట్టించిన ఉత్సాహం. మనిషి... స్లోగా కనిపిస్తాడు కానీ, పనిలో స్పీడ్. 38 రోజులు...కోటి పాతిక లక్షల బడ్జెట్. నాచారం రామకృష్ణ స్టూడియో, నానక్‌రామ్‌గూడా రామానాయుడు స్టూడియో, రాక్ క్యాజిల్... మొత్తం షూటింగంతా ఇక్కడిక్కడే తీశారు. ఎడిటింగ్ రూమ్‌లో బిజీగా ఉన్నాడు చంద్రసిద్ధార్థ్. శవయాత్ర సీన్ల ఎడిటింగ్. సరిగ్గా అదే టైమ్‌లో ఫోన్. నాన్న చనిపోయాడు... సినిమా చూడకుండానే! విధి చిత్రమైనది. శవయాత్ర ఎడిటింగ్ ఆపేసి, నాన్న దగ్గరకు పరిగెత్తాడు చంద్రసిద్ధార్థ్. 2004 డిసెంబర్ 9. ‘ఆ నలుగురు’ రిలీజ్. సినిమా పేరుకి తగ్గట్టే థియేటర్లో నలుగురే ఉన్నట్టున్నారు. 27 ప్రింట్లలో 16 రిటర్న్. టూ వీక్స్ కంప్లీట్. ఇక లేవడం అసాధ్యం. మిగిలిన బాక్సులు తిరిగి రావడానికి ముస్తాబవుతున్నాయి. సర్ప్రైజ్... షాక్. ఆ రోజు మార్నింగ్ షోస్ ఫుల్. మాట్నీ ఫుల్. ఫస్ట్ షో ఫుల్. సెకండ్ షో ఫుల్... ఆరిపోతుందనుకున్న దీపం కాస్తా చందమామలా మారింది. వెలుగులే వెలుగులు. ప్రశంసలే ప్రశంసలు. నందులే నందులు. ఆ చరిత్ర అంతా మీకు తెలిసిందే! * నిర్మాత ప్రేమ్‌కుమార్ ‘మేఘం’ సినిమా తీశారు. దానికి చంద్రసిద్ధార్థ్ మరో బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ కెమేరామేన్. ఆ సినిమా అయ్యాక, నెక్ట్స్ సినిమాకి ఏమైనా సలహాలిస్తారని చంద్రసిద్ధార్థ్ని ప్రేమ్‌కుమార్ కలిశారు. సరిగ్గా, అప్పుడే ‘ఆ నలుగురు’ ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతోంది. చంద్రసిద్ధార్థ్ తన ఫ్రెండ్స్ సపోర్ట్‌తో ఈ సినిమా చేయాలనుకుంటున్నారు. ఈలోగా ప్రేమ్‌కుమార్ ‘నేను రెడీ’ అని ముందుకొచ్చారు. * ‘ఆ నలుగురు’ను కన్నడంలో విష్ణువర్ధన్ ‘సిరివంత’ (2006) పేరుతో చేశారు. మరాఠీలో సాయాజీ షిండే చేశారు. * తమిళంలో రజనీకాంత్, హిందీలో అమితాబ్‌తో రీమేక్ చేయాలని అట్లూరి పూర్ణచంద్రరావు అనుకున్నారు. -
ఆ నలుగురు..!