-
అమ్మా లే అమ్మా.. ఎందుకిలా చేశావ్ అనుప్రియా..
తిరువళ్లూరు: ప్రిడ్జి నుంచి ఐస్‌క్రీమ్ కిందపడిందన్న కారణంతో అత్త మందలించింది. దీంతో, మనస్తాపానికి గురైన కోడలు.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పుళల్ సమీపంలో జరిగింది.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం సమీపంలోని మెండియమ్మన్ నగర్ ప్రాంతానికి చెందిన అశ్విన్‌రాజ్ అదే ప్రాంతానికి చెందిన అనుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండున్నరేళ్ల కిందట వీరిద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న ప్రిడ్జిని అనుప్రియ తెరవగా, అందులో నుంచి ఐస్‌క్రీమ్ కిందపడింది. దీంతో అనుప్రియను ఆమె అత్త చిత్ర మందలించింది.అత్త మందలింపుతో మనస్తాపం చెందిన అనుప్రియ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న వివాహితను కిందకు దింపి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, మహిళను పరిశీలించిన వైద్యులు అప్పటికే అనుప్రియ మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పుళల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
అప్పుడు రూ. 3500కోట్ల వ్యాపార సామ్రాజ్యం: ఇప్పుడు 20ఏళ్ల జైలు జీవితం
కృషి, పట్టుదలతో సాధించిన విజయాలు ఎందరికో మార్గదర్శకం అవుతాయి. మరికొన్ని సంఘటనలు ఊహకందని మలుపులు తిరుగుతూ అదఃపాతాళానికి తొక్కేస్తాయి. కారణం ఏదైనా.. కర్త మాత్రం ఫలితాన్ని తప్పకుండా అనుభవించాల్సిందే. ఇలాంటి కోవకు చెందిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో చూసేద్దాం.ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి 'సుబ్రమణియన్' ఒక ప్రతిభావంతులైన ఇంజనీర్.. బ్యాంకర్ కూడా. జీరోతో మొదలై వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన ఈయన కారాగారంలో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. 1991లో విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీని స్థాపించిన ఈయన.. లాభాలను గడించారు.రూ. 137 కోట్ల పెట్టుబడిసుబ్రమణియన్ ప్రారంభించిన విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సంస్థ.. ప్రైమ్ ఇన్వెస్ట్, అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీ బాండ్, లిక్విడ్ ప్లస్, సేఫ్టీ ప్లస్ వంటి పథకాలను ప్రసిద్ధి చెందింది. ఈ పథకాలన్నీ ఇతర బ్యాంక్ డిపాజిట్లు లేదా పెట్టుబడి ఎంపికల కంటే గణనీయంగా అధిక రాబడికి హామీ ఇచ్చాయి. వీటన్నింటికీ ఆకర్షితులైన.. సుమారు 587 మంది పెట్టుబడిదారులు ఏకంగా రూ. 137 కోట్ల పెట్టుబడిగా పెట్టారు. ఇందులో ఎక్కువగా మధ్యతరగతి వ్యక్తులు, చిన్న వ్యాపార యజమానులు, పదవీ విరమణ చేసినవారే ఉన్నారు.సుభిక్షకు మద్దతువిశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సంస్థను ప్రారంభించిన తరువాత 1997లో 'సుభిక్ష' అనే రిటైల్ సంస్థను సుబ్రమణియన్ స్టార్ట్ చేశారు. ఇది భారతదేశంలో ఏకంగా 1600 కంటే ఎక్కువ అవుట్లెట్లకు విస్తరించింది. కంపెనీ విలువ రూ. 3,500 కోట్లకు చేరుకుంది. అజీమ్ ప్రేమ్‌జీ, ఐసిఐసిఐ వెంచర్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి హై-ప్రొఫైల్ పెట్టుబడిదారులు కూడా సుభిక్షకు మద్దతు ఇచ్చారు.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకిఅన్నీ సవ్యంగా సాగుతున్నాయనుకుంటున్న సమయంలో.. పెట్టుబడిదారుల నిధులను సుబ్రమణియన్ షెల్ కంపెనీలకు మళ్లించారు. ఇదే ఈయన జీవితాన్ని మలుపుతిప్పి కష్టాల సుడిగుండంలోకి తీసుకెళ్లింది. 2008లో సుబ్రమణియన్ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నారు. దీంతో పెట్టుబడిదారులకు కూడా రిటర్న్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. 2009లో సుభిక్ష క్లోజ్ అయింది. దీంతో సుబ్రమణియన్ విశ్వసనీయత కుప్పకూలింది.20 సంవత్సరాల జైలు శిక్ష10 సంవత్సరాలుగా స్వచ్ఛంద డిపాజిట్లు చేయడంలో విఫలమయ్యారని, అన్ని కార్యక్రమాలలో డిపాజిటర్లకు చెల్లించాల్సిన రూ.137 కోట్లకు పైగా చెల్లింపులు చేయలేకపోయారని తెలిసింది. దీంతో నవంబర్ 2023లో, తమిళనాడులోని చెన్నైలోని ఒక ప్రత్యేక కోర్టు వందలాది మంది పెట్టుబడిదారులను మోసం చేసినందుకు 'సుబ్రమణియన్'ను దోషిగా నిర్ధారించి.. అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. -
జితేశ్ జితాదియా
లక్నో: సొంతగడ్డపై విజయగర్వంతో సీజన్‌ను ముగించే భారీ స్కోరునే లక్నో చేసింది... ఛేదనలో సాల్ట్, లివింగ్‌స్టోన్, కోహ్లిలాంటి విలువైన వికెట్లను తీసింది. 52 బంతుల్లో 105 పరుగుల సమీకరణం బెంగళూరుకు క్లిష్టంగా అనిపించింది... అయితే కెప్టెన్ జితేశ్... మయాంక్‌తో కలిసి చేసిన బ్యాటింగ్ మ్యాజిక్ మ్యాచ్‌నే మార్చేసింది. ఇంకో 8 బంతులు మిగిలుండగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) సీజన్లో తొలి సెంచరీతో కదం తొక్కగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు) చెలరేగారు. చితగ్గొట్టిన పంత్ మార్ష్ తో ఇన్నింగ్స్ ఆరంభించిన బ్రిట్జ్కీ (14) మూడో ఓవర్లో నిష్క్రమించాడు. తర్వాత రిషభ్ పంత్ రావడంతో లక్నో ప్రతీ ఓవర్లోనూ పండగ చేసుకుంది. యశ్ దయాళ్ వేసిన నాలుగో ఓవర్లో ఒక సిక్స్, రెండు బౌండరీలు బాదడం ద్వారా పంత్ ప్రతాపం మొదలైంది. పవర్‌ప్లే తర్వాత ఓ వైపు మార్ష్, ఇంకోవైపు రిషభ్ ధనాధన్ షోతో ఓవర్‌కు సగటున పది పరుగుల రన్‌రేట్ నమోదైంది. దీంతో 9.5 ఓవర్లో జెయింట్స్ 100 స్కోరును చేరుకుంది.ముందుగా పంత్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో సిక్సర్‌తో మార్ష్ 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఆ ఓవర్లో రిషభ్ కూడా ఫోర్, సిక్స్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన మార్ష్ ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 152 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యానికి తెరపడింది. అతని మరుసటి ఓవర్లో బౌండరీతో పంత్ 54 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకోవడం, జట్టు 200మార్క్ దాటడం జరిగిపోయాయి. మెరుపు భాగస్వామ్యం... సాల్ట్, కోహ్లిలు పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరుబోర్డును పరుగు పెట్టించారు. 4 ఓవర్లలోనే స్కోరు 50కి చేరింది. కానీ పవర్‌ప్లే ఆఖరి ఓవర్లోనే సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత కోహ్లికి జతయిన రజత్ పటిదార్ (14) ఫోర్, సిక్సర్ బాదాడు. కానీ రూర్కే ఒకే ఓవర్లో అతన్ని, లివింగ్‌స్టోన్ (0)ను అవుట్ చేసి బెంగళూరును కష్టాల్లో పడేశాడు. కోహ్లి తన మార్క్ షాట్లతో చెలరేగిపోవడంతో రన్‌రేట్ లక్ష్యాన్ని కరిగించేంత వేగంగా దూసుకెళ్లింది. 9.1 ఓవర్లోనే ఆర్సీబీ స్కోరు వందను దాటేసింది. కోహ్లి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ధాటిని కొనసాగించే ప్రయత్నంలో కొట్టిన షాట్ మిడాఫ్‌లో బదోని చేతికి చిక్కడంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు. అప్పుడు జట్టు స్కోరు 11.2 ఓవర్లలో 123/4. కాగా గెలుపు సమీకరణం 52 బంతుల్లో 105 చాలా కష్టమైంది.మయాంక్, కెప్టెన్ జితేశ్ శర్మల మెరుపులకు తోడు... లక్నో ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్, సులువైన రనౌట్పట్ల రూర్కే అశ్రద్ధ వెరసి... పరుగులు, బౌండరీలు అలవోకగా రావడంతో చూస్తుండగానే లక్ష్యం దిగొచ్చింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు మయాంక్, జితేశ్‌లు కేవలం 44 బంతుల్లోనే 107 పరుగులు జోడించడం విశేషం! స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 67; బ్రిట్జ్కీ (బి) తుషార 14; పంత్ నాటౌట్ 118; పూరన్ (సి) యశ్ దయాళ్ (బి) షెఫర్డ్ 13; సమద్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–25, 2–177, 3–226. బౌలింగ్: తుషార 4–0–26–1, కృనాల్ పాండ్యా 2–0–14–0, యశ్ దయాళ్ 3–0–44–0, భువనేశ్వర్ 4–0–46–1, సుయశ్ 3–0–39–0, షెఫర్డ్ 4–0–51–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) దిగ్వేశ్ (బి) ఆకాశ్ 30; కోహ్లి (సి) బదోని (బి) అవేశ్‌ఖాన్ 54; పటిదార్ (సి) సమద్ (బి) రూర్కే 14; లివింగ్‌స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రూర్కే 0; మయాంక్ నాటౌట్ 41; జితేశ్ నాటౌట్ 85; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1–61, 2–90, 3–90, 4–123. బౌలింగ్: ఆకాశ్ 4–0–40–1, విల్ రూర్కే 4–0–74–2, దిగ్వేశ్ రాఠి 4–0–36–0, షాబాజ్ 3–0–39–0, అవేశ్‌ఖాన్ 3–0–32–1, బదోని 0.4–0–9–0. ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’క్వాలిఫయర్–1 (మే 29)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్‌పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచిఎలిమినేటర్ (మే 30)గుజరాత్ X ముంబైవేదిక: ముల్లాన్‌పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Rachel Gupta: అందాల రాణికి బిగ్ షాక్
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 రాచెల్ గుప్తాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె తన టైటిల్‌ను వదులుకుంటున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఈలోపు నిర్వాహకులే ఆమెను టైటిల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు.న్యూఢిల్లీ/బ్యాంకాక్: ఇండియన్ మోడల్ రాచెల్ గుప్తా(Rachel Gupta) ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ చేశారు. విషపూరితమైన వాతావరణంలో తాను ఇంతకాలం ఉన్నానని, ఇక మౌనంగా భరించడం తన వల్ల కాదని, రాజీనామా నిర్ణయం కష్టమే అయినా తప్పట్లేదని, ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన వాళ్లను నిరుత్సాహపరుస్తున్నందుకు క్షమించాలని ఓ పోస్ట్ చేశారు. ‘‘‘వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి’’ అంటూ త్వరలో ఓ వీడియో ద్వారా పూర్తి వివరాలను వెల్లడిస్తానని అన్నారామె.అయితే ఈలోపు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) నిర్వాహకులు ఆమె పోస్టునకు పూర్తి విరుద్ధంగా స్పందించారు. గుప్తాను అధికారికంగా తొలగిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆమె తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారని, సొంత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇచ్చారని, గ్వాటెమాలా అధికారిక పర్యటనకు నిరాకరించార’’ని పేర్కొంది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్‌ను తొలగిస్తున్నామని, 30 రోజుల్లో కిరీటం తమ కార్యాలయంలో అప్పగించాలని ఆమెను ఆదేశించారు. నిబంధనల ప్రకారం.. ఫిలిప్పీన్స్‌కి చెందిన సీజే ఓపియాజాకు కిరీటం వెళ్లే అవకాశాలు ఉన్నాయిపంజాబ్ జలంధర్‌కు చెందిన 21 ఏళ్ల రాచెల్ గుప్తా కిందటి ఏడాది ఆగష్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ దక్కించుకుంది. ఆపై అక్టోబర్ 25వ తేదీ బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో 70 దేశాలకు చెందిన అందెగత్తెలను వెనక్కినెట్టి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెల్చుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సుందరిగా ఘనతకెక్కింది. ఇదీ చదవండి: తప్పతాగాడు.. టేబుల్ ఎక్కి నన్ను డ్యాన్స్ చేయమన్నాడు -
‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’
సాక్షి,వైఎస్సార్ జిల్లా: ‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’ అని కూటమి నేతలకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహా నాడుతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు పేరుతో వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్‌లు వేసి భజన చేసుకున్నారు. వైఎస్ జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచిక ఆనందం పొందారు. మీరు చేసిన దుష్ప్రచారం అందరికీ తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో హామీలు ఇచ్చారు. అన్నీ హామీలకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు.వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా ఓటమి తప్పదు. ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు. కూటమి ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి. టైం వచ్చినప్పుడు ప్రజలు దెబ్బ కోలుకోలేని దెబ్బ కొడతారు. వైఎస్సార్ విగ్రహాల చుట్టూ పచ్చ జెండాలు, తోరణాలు కట్టారు. అభ్యంతరకర రీతిలో వైఎస్ విగ్రహాల చుట్టు జెండాలు కట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ వైఎస్సార్. వైఎస్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యత కాదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని టీడీపీ చెబుతోంది. పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపులకు పాల్పడుతూ.. దద్దమ్మ రాజకీయం చేస్తున్నారు.మేం కక్ష సాధింపు రాజకీయం చేసి ఉంటే మీ పరిస్థితి వేరే విధంగా ఉండేది. మాకు తగిలిన దెబ్బ మరిచిపోం. వైఎస్సార్‌ను అగౌర పరుస్తున్నారు. టీడీపీ కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాలని మా కార్యకర్తలకు తెలిపాం. మేము ఎన్టీఆర్‌ను అగౌర పరచలేదు. చేసిన తప్పులు ఇప్పటికైనా తెలుసుకోండి. పులివెందులలో వైఎస్ విగ్రహాలు చుట్టు కట్టిన తోరణాలు తొలగించాలని అధికారులకు తెలిపాం. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. జిల్లా ఎస్పీ, పులివెందుల డీఎస్పీకి తెలిపాం. ఇప్పటి వరకు పోలీసులు స్పందించలేదు. కావాలనే రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్‌ను అగౌరవ పరిచే విధంగా తొరణాలు కట్టారని’ దుయ్యబట్టారు. -
IPL 2025: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. ఎవరితో ఎవరు ఆడతారంటే?
ఐపీఎల్-2025లో లీగ్ దశ మ్యాచ్‌లు సోమవారం(మే 27)తో ముగిశాయి. ఈ మెగా టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ క్వాలిఫియర్-1కు ఆర్హత సాధించింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌లో ఏ జట్టు ఎవరితో తలపడుతుందో ఓ లుక్కేద్దాం. ఈ ఏడాది సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్దానంలో పంజాబ్ కింగ్స్(18) నిలవగా.. ఆర్సీబీ(18) రెండో స్ధానంలో నిలిచింది. పాయింట్ల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నప్పటికి బెంగళూరు కంటే పంజాబ్ రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంది.క్వాలిఫయర్-1లో పంజాబ్, ఆర్సీబీ ఢీ..టాప్-2లో నిలిచిన పంజాబ్, ఆర్సీబీ మే 29న చంఢీగడ్ వేదికగా క్వాలిఫయర్-1లో తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు ఆర్హత సాధిస్తోంది. అయితే ఇక్కడ ఓడిన జట్టుకు కూడా ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. ఓటమి చెందిన జట్టు జూన్ 1న క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ లేదా గుజరాత్ టైటాన్స్ ఆడాల్సి ఉంటుంది. అక్కడ గెలిస్తే ఫైనల్‌కు చేరుకోవచ్చు. ఇక పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, మంబై ఇండియన్స్ మే 30న ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక్కడ గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-1లో ఓడిన టీమ్‌తో తలపడాల్సి ఉంటుంది. ఇక చివరగా ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.IPL 2025 ప్లేఆఫ్స్ షెడ్యూల్:క్వాలిఫయర్ 1: పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మే 29, చండీగఢ్ఎలిమినేటర్: గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ - మే 30, చండీగఢ్క్వాలిఫయర్ 2: క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టు vs ఎలిమినేటర్ విజేత - జూన్ 1, అహ్మదాబాద్ఫైనల్: క్వాలిఫయర్ 1 విజేత vs క్వాలిఫయర్ 2 విజేత - జూన్ 3, అహ్మదాబాద్ -
బంగ్లాలో నిరసనల హోరు
ఢాకా: బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సర్కారుపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే సైన్యం నుంచి తీవ్ర రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటున్న సర్కారుకు ఇది రోకటిపోటుగా పరిణమించింది. పౌర సేవకుల సమ్మె నాలుగో రోజుకు చేరగా వేతన పెంపు డిమాండ్‌తో టీచర్లు కూడా నిరసన బాట పట్టారు.వారు వేల సంఖ్యలో నిరవధిక సమ్మెకు దిగారు. మే 5 నుంచి పాక్షికంగా పని చేస్తున్నవారు కూడా సోమవారం నుంచి పూర్తిగా విధులు నిలిపేశారు. దీనిపై యూనస్ సర్కారు మండిపడింది. ఆందోళనలను తక్షణం కట్టిపెట్టాలంటూ సోమవారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వ చర్యపై ఉద్యోగులు మరింత మండిపడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విస్తరిస్తామని హెచ్చరించారు.రాజకీయ గందరగోళంకొన్ని వారాలుగా యూనస్ ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో పడిపోయింది. భారత్‌లో ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ప్రజల్లో అశాంతి పెరిగింది. వచ్చే డిసెంబర్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ పట్టుబడుతుండగా 2026 జూన్‌కు ముందు కుదరదని సర్కారు అంటోంది.మరోవైపు కీలక సంస్కర ణలకు పార్టీలు మద్దతివ్వకపోవడంతో యూనస్ అలిగా రు. రాజీనామా చేస్తానని బెదిరించినా తర్వాత వెనక్కు తగ్గారు. అధికారాన్ని నిలుపుకోవడానికే తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలను ఆలస్యం చేస్తోందంటూ బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఢాకాలో భారీ నిరసనలకు దిగింది. దాంతో యూనస్‌కు మద్దతుగా ఆయన అనుయాయులు విద్యార్థుల సారథ్యంలో మే 24న మార్చ్ నిర్వహించారు. -
పాపం కమల్ హాసన్.. సిద్ధరామయ్య సెటైర్లు
బెంగళూరు: కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందన్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలపై(Kamal Kannada Comment) కన్నడనాట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమల్ కామెంట్‌పై స్పందించారు.కన్నడ భాషకు(Kannada Language) ఎంతో చరిత్ర ఉంది. పాపం కమల్ హాసన్‌కు ఆ విషయం తెలియకపోయి ఉండొచ్చు అంటూ సిద్ధరామయ్య అన్నారు. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర యడియూరప్ప సైతం కమల్ వ్యాఖ్యపై మండిపడ్డారు. ‘‘మాతృభాషను ప్రేమించడం మంచిదే అయినా.. ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని అన్నారాయన. ఇది కన్నడ ప్రజలను మాత్రమే కాదు.. శివరాజ్ కుమార్ లాంటి అగ్రనటుడిని కూడా అవమానించడమే. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన కమల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి’’ అని విజయేంద్ర డిమాండ్ చేశారాయన. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ చిత్ర(Thug Life) ఈవెంట్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ ‘‘మీ భాష(కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’ అని అన్నారు. ఈ కామెంట్‌పై ఇటు రాజకీయంగా, అటు సోషల్ మీడియాలోనూ కమల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడ పరిరక్షణ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక కమల్ వ్యాఖ్యలపై భగ్గుమంది. క్షమాపణలు చెప్పకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి లీడ్ రోల్స్‌లో నటించిన థగ్ లైఫ్ సినిమా జూన్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఖబడ్దార్ కమల్.. నల్ల ఇంకు పోస్తాం -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2025 సీజన్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసాధరణ ప్రదర్శన కనబరిచింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ క్వాలిఫయర్-1కు ఆర్హత సాధించింది. లక్నో నిర్ధేశించిన 228 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది.ఆర్సీబీ బ్యాటర్లలో స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ(33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 85 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. విరాట్ కోహ్లి(30 బంతుల్లో 10 ఫోర్లతో 54), మయాంక్ అగర్వాల్(23 బంతుల్లో 41 నాటౌట్), సాల్ట్(30) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆకాష్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) సీజన్లో తొలి సెంచరీతో చెలరేగగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు.ఆర్సీబీ సరికొత్త చరిత్ర..ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఒక ఐపీఎల్ సీజన్లో ప్రత్యర్ధి జట్లతో వాటి హోం గ్రౌండ్స్‌లో జరిగిన అన్నీ మ్యాచ్‌లలోనూ గెలుపొందిన తొలి టీమ్‌గా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది.ఈ ఏడాది సీజన్ తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్‌ను ఓడించిన ఆర్సీబీ.. ఆ తర్వాత సీఎస్కే, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ను వారి సొంత మైదానాల్లోనే చిత్తు చేసింది.చదవండి: IND vs ENG: బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్‌కు మళ్లీ పిలుపు -
క్వారంటైన్లోకి శుభాన్షు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లాకు చివరి ఐసోలేషన్ ప్రక్రియ మొదలైంది. ఆగ్జియం మిషన్–4 (యాక్స్–4)కు సన్నాహకంగా ముగ్గురు సహచరులతో కలిసి కలిసి ఆయన ప్రీ–లాంచ్ క్వారంటైన్లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆగ్జియం స్పేస్ ఉద్యోగులు వారికి వీడ్కోలు సమావేశం నిర్వహించారు. మిషన్ విజయవంతమవుతుందని శుక్లా ధీమా వెలిబుచ్చారు.ఈ మిషన్‌ను జూన్ 8న అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. నాసా సీనియర్ వ్యోమగామి, ఆగ్జియం స్పేస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ డైరెక్టర్ పెగ్గీ విట్సన్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. నౌకకు పైలట్‌గా వెళ్తున్న శుక్లా ఐఎస్ఎస్లో అడుగు పెట్టిన తొలి భారతీయ వ్యోమగామి కానున్నారు. వీరితో పాటు పోలండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ– విస్నియోవ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు బృందంలో ఉన్నారు. వారిద్దరికీ కూడా ఇది తొలి అంతరిక్షయానం. అలా ఈ మిషన్ భారత్‌కే గాక పోలండ్, హంగరీలకు కూడా ఎంతో ముఖ్యమైనది.ఐసోలేషన్ ఎందుకు?ప్రీ లాంచ్ క్వారంటైన్ వ్యోమగాములకు కీలకమైన ప్రొటోకాల్. అంతరిక్షంలో గడపటం పలు సవాళ్లతో కూడిన విషయం. వ్యోమగాములకు అనారోగ్యం వంటివి ఉంటే అది మిషన్నే కాకుండా ఇప్పటికే ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములనూ ప్రభావితం చేస్తుంది. గురుత్వాకర్షణ శక్తి లేని చోట వ్యోమగాముల రోగని రోధక శక్తి మరింత బలహీనపడి ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదముంటుంది. అందుకే వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి దీనిని నిర్వహిస్తారు. ప్రయోగానికి 14 రోజుల ముందుకాలం క్వారంటైన్ ఉంటుంది. ఈ సమయంలో వ్యోమగాములు ప్రయోగ ప్రదేశానికి సమీపంలో ఉంటారు. ఒక చిన్న సహాయక బృందం కూడా వారికి అందుబాటులో ఉంటుంది. కఠినమైన ఒంటరితనం, మెరుగైన పరిశుభ్రత చర్యలు, రోజువారీ ఆరోగ్య పర్యవేక్షణ ఉంటాయి. తుది మిషన్ బ్రీఫింగ్‌లు, శిక్షణ, వ్యాయామాలు నిర్వహిస్తారు. సిబ్బందిలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వారిని మరింత ఒంటరిగా ఉంచి నిశితంగా పర్యవేక్షిస్తారు.