ఇచ్చింది చాలదు.. ఇంకా పట్రా

భూముల ఆన్‌లైన్‌కు వసూళ్లు

రూ.వెయ్యి ఇచ్చినా చాలదంటున్న వీఆర్వో

మురగడం మహిళ ఆరోపణ

సాక్షి, బలిజిపేట: ఆన్‌లైన్‌ చేసేందుకు వీఆర్వోకి రూ.వెయ్యి ఇచ్చా. అయినా ఆన్‌లైన్‌ చేయలేదు. నిలదీస్తే ఇచ్చిన లంచం చాలదు. ఇంకా ఇస్తే ఆన్‌లైన్‌ చేస్తాను అంటూ తిప్పుతున్నాడు.. అంటూ మురగడాం గ్రామానికి చెందిన గొట్టాపు నరసమ్మ వాపోయింది. ఆమె బుధవారం విలేకరులకు అందించిన వివరాల ప్రకారం.. మురగడాం గ్రామానికి చెందిన గొట్టాపు నరసమ్మకు తండ్రి అక్కేన శివుడునాయుడి మరణానంతరం భూమి సర్వే నంబర్‌ 122–సబ్‌ డివిజన్‌ 2లోని 1.05 ఎకరాల భూమిని ఫోతీకేసు కింద ఆమె పేరున మార్చారు. భూమిని ఆన్‌లైన్‌ చేసేందుకు 5నెలల క్రితం వీఆర్వో సాంబమూర్తికి రూ.వెయ్యి చెల్లించారు. 

అప్పటినుంచి తిప్పుతున్న వీఆర్వో ఇచ్చిన డబ్బులు చాలవని.. మరికొంత ఇస్తే చేయిస్తానంటున్నాడు. దిక్కుమొక్కు లేని తన భూమిని తన పేరున వన్‌బీకి జారీ చేసేందుకు ఇన్ని ఇబ్బందులు పెడితే అధికారుల చుట్టూ ఎలా తిరుగుతానని నరసమ్మ కన్నీరుమున్నీరైంది. భూముల్ని ఆన్‌లైన్‌ చేయడంలో ఎకరాకు రూ.వెయ్యి వంతున బలిజిపేట రెవెన్యూ సిబ్బంది వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెదపెంకి జన్మభూమి గ్రామ సభలో దత్తి మురళి అనే రైతు డబ్బులు ఇస్తే తప్ప ఆన్‌లైన్‌ కావడం లేదని ఆరోపించడం తెలిసిందే. ఆన్‌లైన్‌కు డబ్బులు ఇస్తే తప్ప చేయటం లేదని అజ్జాడ గ్రామ సభలో ఆరోపించారు.

డబ్బులిస్తేనే ఆన్‌లైన్‌
నా తల్లి సన్యాసమ్మ పేరున ఉన్న భూమిని ఆన్‌లైన్‌ చేసేందుకు అజ్జాడ వీఆర్వో డబ్బులు ఇమ్మన్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఆన్‌లైన్‌ చేయరా? అని అడిగాను. డబ్బులిస్తేనే చేస్తానంటున్నారు.                  

                              – ప్రదీప్, అజ్జాడ

ఫిర్యాదు చేస్తే చర్య
నా దృష్టికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. సంబంధిత వీఆర్వోపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాను. డబ్బు ఎవరు తీసుకున్నారో తెలిస్తే చర్యలుంటాయి. 
                                       –బీవీ లక్ష్మి, తహసీల్దార్, బలిజిపేట 
 
 

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top