పార్టీ కార్యకర్తలకు యోగి ఘాటు సూచన!

పార్టీ కార్యకర్తలకు యోగి ఘాటు సూచన! - Sakshi


లక్నో: హిందూ అతివాదిగా పేరొందిన యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా తన ఇన్నింగ్స్‌ను ఆదివారం ప్రారంభించారు. దేశంలో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ఆయనను సీఎంగా బీజేపీ ఎంచుకోవడంపై పలు విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం తాను అందరినీ సమానంగా చూస్తానని, ఏ వర్గంపైనా వివక్ష చూపబోనని యోగి పేర్కొన్నారు. తమ ఎన్నికల నినాదమైన ’సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’ (అందరికీ చేయూత, అందరికీ ప్రగతి) నేరవేరుస్తానని అన్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం యోగి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ఘాటు సూచనలు చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతలు అనాలోచిత వ్యాఖ్యలు చేయవద్దని ఆయన సూచించినట్టు తెలిసింది.



రాజ్‌నాథ్‌ తనయుడికి షాక్‌..

సీఎం యోగితో కలిపి 47మందితో కొలువుదీరిన యూపీ కేబినెట్‌లో పలువురు ఆశావహులకు చాన్స్‌ దక్కలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా  గెలుపొందిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తనయుడు పంకజ్‌ సింగ్‌కు నిరాశే ఎదురైంది. అదేవిధంగా మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ మనవడికి, బీజేపీ సీనియర్‌ నేత లాల్జీ టాండన్‌ తనయుడికి కూడా మంత్రివర్గంలో చాన్స్‌ దక్కలేదు. అయితే, యూపీ కేబినెట్‌లో చాలావరకు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా సన్నిహితులకు పెద్దపీట దక్కడం గమనార్హం.



ఆయనకు విశ్వసనీయులుగా ముద్రపడిన శ్రీకాంత్‌వర్మ, సిద్ధార్థనాథ్‌ సింగ్‌, దినేశ్‌ శర్మ, కేశవప్రసాద్‌ మౌర్య తదితరులకు కీలక మంత్రి పదవులు దక్కాయి. యోగి కేబినెట్‌ కుల, సామాజిక సమీకరణల సమతుల్యాన్ని పాటించారు. యూపీ కేబినెట్‌లో అగ్రకులానికి చెందిన 23మందికి మంత్రులుగా అవకాశం లభించగా, 14మంది ఓబీసీలకు, ఐదుగురు దళితులకు చాన్స్‌ దక్కింది. అదేవిధంగా ఒక ముస్లింకు, ఒక సిక్కుకు కూడా అవకాశం కల్పించారు. కేబినెట్‌ పదవులు దక్కిన వారిలో 13మంది ఎమ్మెల్యేలు తొలిసారి గెలుపొందిన వారు కావడం గమనార్హం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top