
నయీమ్ భార్య, సోదరిని తరలిస్తున్న నార్సింగ్ పోలీసులు
నయీమ్ భూదందాల కోసం అనుచరులకు ఆయుధాలు సరఫరా చేసేందుకు తన డ్రైవర్ ఫయాజుద్దీన్ అలియాస్ ఫయాజ్‌ను వాడుకున్నట్టు తెలిసింది.
♦ కీలక వివరాలు వెల్లడించిన నయీమ్ డ్రైవర్ ఫయాజ్
♦ మరో మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించిన కోర్టు
♦ పీటీ వారెంట్‌పై నయీమ్ భార్య హసీనా,
♦ అక్క సలీమాలను తీసుకొచ్చిన పోలీసులు
రాజేంద్రనగర్/తుర్కయంజాల్/వనస్థలిపురం: నయీమ్ భూదందాల కోసం అనుచరులకు ఆయుధాలు సరఫరా చేసేందుకు తన డ్రైవర్ ఫయాజుద్దీన్ అలియాస్ ఫయాజ్‌ను వాడుకున్నట్టు తెలిసింది. శంషాబాద్ ఆర్‌జీఐ పోలీసుల కస్టడీలో ఉన్న ఫయాజుద్దీన్ ఈ వివరాలను వెల్లడించినట్టు సమాచారం. ఆరు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఫయాజుద్దీన్‌ను సోమవారం రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. అయితే మరిన్ని కీలక అంశాలు వెల్లడి కావాల్సి ఉందని.. ఫయాజ్‌ను మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేయడంతో కోర్టు సమ్మతించింది.
ఇక షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసిన నయీమ్ భార్య హసీనా, అక్క సలీమాలను ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకొచ్చిన నార్సింగ్ పోలీసులు... ఉప్పర్‌పల్లి కోర్టులో సోమవారం సాయంత్రం హాజరుపరిచారు. న్యాయమూర్తి వారిని వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్‌కు తరలించారు. వారిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మంగళవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక నయీమ్ అనుచరుడు శామ్యూల్‌ను వనస్థలిపురం పోలీసులు పీటీ వారెంట్‌పై ఖమ్మం నుంచి తీసుకొచ్చి హయత్‌నగర్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
నయీమ్ డ్రైవర్ శ్రీధర్‌గౌడ్‌తో కలసి భూదందాలు అక్రమ వసూళ్ల కేసులో నిందితుడిగా ఉన్న శామ్యూల్‌ను ఖమ్మం నుంచి ఒడిశాకు పారిపోతుండగా భద్రాచలం వద్ద చర్ల పోలీసులు పట్టుకున్నారు. నయీమ్ కేసులో సిట్ పోలీసులు వనస్థలిపురం భాగ్యలతా కాలనీకి చెందిన నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నయీమ్ అనుచరుడు సామ సంజీవరెడ్డికి నరేందర్ సన్నిహితుడని సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన నరేందర్ విద్యార్థి దశలోనే హైదరాబాద్‌కు వచ్చి సామ సంజీవరెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నాడు. కొన్నేళ్ల కింద టీడీపీ నేత సామ రంగారెడ్డి వేడి వేడి నూనె పోసిన కేసులో సామ ప్రభాకర్‌రెడ్డితో పాటు నిందితుడిగా ఉన్నాడు.