weapons supplier
-
భారత్‌ను పొగిడినట్లే పొగిడి.. ఇరకాటంలోకి నెట్టేస్తోందా?
రష్యా-భారత్ ఆయుధ ఒప్పందాలకు అమెరికా మొదటి నుంచి వ్యతిరేకమే!. ఉక్రెయిన్ పరిణామాల తర్వాత ఆ బంధాన్ని ఏదో రకంగా తెంచాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది కూడా. అయినా భారత్ మాత్రం తటస్థ వైఖరితో అగ్రరాజ్యానికి సమాధానం ఇస్తూ వస్తోంది. ఈ తరుణంలో ఎస్-400 క్షిపణుల కొనుగోలు అంశాన్ని ప్రస్తావిస్తూ.. భారత్ పొగిడినట్లే పొగుడుతూ ఇరకాటంలో నెట్టేసే ప్రయత్నం చేస్తోంది అగ్రరాజ్యం. రష్యాతో భారత్ ఎస్-400 క్షిపణుల ఒప్పందాన్ని అమెరికా ముందు నుంచీ వ్యతిరేకిస్తోంది. ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటూ పదే పదే ఒత్తిడి తెస్తోంది. అయినా కూడా భారత్ వెనకడుగు వేయలేదు. తమ సార్వభౌమాధికారానికి తగ్గట్టుగా ఒప్పందాలు చేసుకుంటామని తేల్చి చెప్పింది. గత ఏడాది డిసెంబర్ నుంచే ఆ క్షిపణి వ్యవస్థలు మనకు చేరుతున్నాయి. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై అమెరికా స్పందించింది. చైనా, పాక్ ప్రస్తావనతో.. పొరుగున చైనా, పాకిస్థాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు ఈ ఏడాది జూన్ నాటికి సరిహద్దుల్లో ఆ క్షిపణులను మోహరించేందుకు భారత్ సిద్ధమవుతోందంటూ ఓ సంచలన ప్రకటన చేసింది అమెరికా. ఈ మేరకు ఆ దేశ రక్షణ కార్యాలయం పెంటగాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్.. ఒక ప్రకటన చేశారు. ఇటీవల నిర్వహించిన ఆర్మ్డ్డ్ సర్వీసెస్ కమిటీ సమావేశం సందర్భంగా స్కాట్.. భారత్ ఎస్ 400 మిసైల్స్ పై నివేదికను సమర్పించారు. భూ, జల సరిహద్దులను పటిష్ఠ పరచుకునేందుకు భారత్ ఈ మిసైళ్లను సమీకరించుకుంటోందని పేర్కొన్నారు. అంతేగాకుండా సైబర్ దాడులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని పెంచుకుంటోందని వివరించారు. ఇప్పటిదాకా బాగానే ఉంది. అయితే.. భూ, వాయు, సముద్ర హద్దులను కాపాడుకునేందుకు చైనా, పాక్‌లను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక ఆయుధాలను సిద్ధం చేసుకుంటోందని, న్యూక్లియర్ బలగాలనూ అభివృద్ధి చేసుకుంటోందని చేసిన ప్రకటనే భారత్ పొరుగున ఉన్న రెండు దేశాలను కవ్వించేందిగా ఉంది. ఇది ఆ రెండు దేశాల నుంచి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసే అంశాలే. పైగా కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడుతూనే పాక్ నుంచి భారత్ లోకి ప్రవేశించే ఉగ్రవాదులకు సరైన రీతిలో జవాబిస్తోందని, 2020లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణలతో భారత్ – చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయంటూ.. ఉద్రిక్త అంశాలను మళ్లీ ప్రస్తావించడం కొసమెరుపు. ఇదిలా ఉంటే.. స్కాట్ బెరియర్ ప్రకటనను మాత్రం భారత్ తీవ్రంగానే పరిగణించినట్లు తెలుస్తోంది. మచ్చిక కోసం ప్యాకేజీ భారత్ ను రష్యాకు దూరం చేసే పన్నాగాలకు అమెరికా పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఆయుధాల కోసం రష్యాపై భారత్ ఆధారపడడాన్ని తగ్గించేలా చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా భారత్ కోసం 500 మిలియన్ (రూ.3,850 కోట్లు) డాలర్ల సైనిక సాయాన్ని ఆఫర్ చేయనుంది. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం ద్వారా భారత్ తో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అగ్రరాజ్యం అనుకుంటున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వర్గాలు తెలిపాయి. విదేశీ సైనిక సాయం కింద 500 మిలియన్ డాలర్లు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని.. ఇజ్రాయెల్, ఈజిప్ట్ తర్వాత ఈ తరహా సాయం అందుకునే అతిపెద్ద దేశం భారత్ అవుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ప్యాకేజీ ఎప్పుడు ప్రకటించేది చెప్పలేదు. చదవండి: అమెరికాలో మళ్లీ ఆ టెన్షన్.. అక్కడ హై అలర్ట్ -
భారత్ ఆయుధ బలం రష్యానే
మాస్కో : భారత ఆయుధశ్రేణిలో అత్యధిక భాగం రష్యా తయారీవే. రైఫిల్స్ నుంచి యుద్ధ విమాన వాహకనౌకల వరకూ భారత్ సమకూర్చుకుంటున్న ప్రతి ఆయుధంలో రష్యా సహకారం ఉండాల్సిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో మనం వ్యూహాత్మకంగా అమెరికావైపు తప్పక నిలబడాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో ఇటీవల కాలంలో భారత్ చేసే ఆయుధాల కొనుగోళ్లలో రష్యా వాటా గణనీయంగా తగ్గుతోంది. ఇజ్రాయేల్, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలతో ఆయుధ కొనుగోళ్లు పెరుగుతున్నా ఇప్పటికీ రష్యానే భారత్‌కు అతిపెద్ద ఆయధాల అమ్మకందారు. ఇప్పుడు కూడా భారత్ యుద్ధ విమానాల నుంచి సబ్మెరైన్ల వరకూ రష్యాతో భారీ ఆయుధ ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఐదవతరం ఫైటర్‌జెట్‌తో సహా అత్యాధునిక ఆయుధాల శ్రేణిని భారత్‌లోనే తయారుచేసేలా రష్యాతో డీల్ కుదుర్చుకునేలా చర్చలు ప్రారంభించింది. రష్యా సైతం భారత్ మార్కెట్‌ను కోల్పోవడానికి ఎప్పుడూ ఇష్టపడదు. భారత్ కొనుగోలు చేయాలనుకుంటున్న ఆరు డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ల బిడ్‌లో రష్యా కూడా పాల్గొంది. తన దగ్గర గల సబ్‌మెరైన్ ఆర్మర్-1650ని భారత్‌లోనే తయారీకి ఒప్పుకుంటామని చెప్తోంది. భారత్‌గానీ ఈ బిడ్‌ను తమకే ఇస్తే కేవలం వాటిని అమ్మడమే గాక భారత్ భాగస్వామ్యంతో తయారుచేస్తామని అంటోంది. ఇతర దేశాలు తమ టెక్నాలజీనీ ఇవ్వడానికి ఇష్టపడని చోట మేం భారత్‌కు ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించింది. ఈ సబ్మెరైన్ల నిర్మాణం కూడా మరో విజయవంతమైన రష్యా-భారత్ తయారీ బ్రాహ్మోస్ కాగలదని విశ్వాసం వ్యక్తం చేసింది. ఇక భారత వాయుసేనలో కూడా మెజార్టీ వాటా రష్యా యుద్ధ విమానాలదే. మన గగనతలాన్ని శక్తివంతం చేసిన అత్యున్నత యుద్ధ విమానం సుఖోయ్-30తో సహా మిగ్ శ్రేణి విమానాలతో మన ఎయిర్‌బేస్‌లు నిండిపోయాయి. అయితే రఫేల్ కొనుగోలుతో యుద్ధవిమానాల విషయంలో మనం రష్యాకు దూరం జరిగినా, రష్యా తయారుచేస్తోన్న ఐదవతరం అత్యాధునిక సుఖోయ్-57 ఫైటర్జెట్లలో తొలి విదేశీ భాగస్వామ్య దేశం కచ్చితంగా భారతదేశమేనని రష్యా నమ్మకం. ఈ ఐదవ తరం అత్యాధునిక యుద్ధ విమానం కొనుగోలుపై భారత్ ప్రస్తుతం చర్చలు నిలిపివేసినా, రష్యా మాత్రం భారత్‌కు వీటి అమ్మకంపై ఆశాభావంతో ఉంది. అలాగే 110 తేలికపాటి యుద్ధ విమానాలు కొనడానికి భారత్ చేసిన ఫైనల్ లిస్ట్‌లో మిగ్-35 శ్రేణి విమానాలు ఉన్నాయి. ఇరుదేశాలు ఇప్పటికే కలష్నికోవ్-200 రకం రైఫిల్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 7,50,000 రైఫిల్స్ కావాలని భారత్ ఆర్డర్ కూడా ఇచ్చింది. అలాగే టి-90 యుద్ధ ట్యాంకుల స్థానంలో అప్‌గ్రేడ్ చేసిన టి-90ఎమ్ఎస్ శ్రేణి కొనుగోలు కోసం 1.93 బిలియన్ డాలర్ల డీల్ ఇరుదేశాల మధ్య కుదిరింది. ఇక చివరిగా చెప్పుకోవాల్సింది ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థది. వీటిని కొనుగోలు చేయరాదంటూ అమెరికా తీవ్ర ఒత్తిడి చేస్తున్నా భారత్మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇలా భారత ఆయుధశ్రేణిని పరిపుష్టం చేయడంలో రష్యా పాత్ర కీలకమైంది. అందుకే భారత ప్రధాని మాటల్లో రష్యా మనకు సహజమిత్ర దేశం అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
డ్రైవరే ఆయుధాల సరఫరాదారు
♦ కీలక వివరాలు వెల్లడించిన నయీమ్ డ్రైవర్ ఫయాజ్ ♦ మరో మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించిన కోర్టు ♦ పీటీ వారెంట్‌పై నయీమ్ భార్య హసీనా, ♦ అక్క సలీమాలను తీసుకొచ్చిన పోలీసులు రాజేంద్రనగర్/తుర్కయంజాల్/వనస్థలిపురం: నయీమ్ భూదందాల కోసం అనుచరులకు ఆయుధాలు సరఫరా చేసేందుకు తన డ్రైవర్ ఫయాజుద్దీన్ అలియాస్ ఫయాజ్ను వాడుకున్నట్టు తెలిసింది. శంషాబాద్ ఆర్జీఐ పోలీసుల కస్టడీలో ఉన్న ఫయాజుద్దీన్ ఈ వివరాలను వెల్లడించినట్టు సమాచారం. ఆరు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఫయాజుద్దీన్‌ను సోమవారం రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. అయితే మరిన్ని కీలక అంశాలు వెల్లడి కావాల్సి ఉందని.. ఫయాజ్ను మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేయడంతో కోర్టు సమ్మతించింది. ఇక షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసిన నయీమ్ భార్య హసీనా, అక్క సలీమాలను ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకొచ్చిన నార్సింగ్ పోలీసులు... ఉప్పర్‌పల్లి కోర్టులో సోమవారం సాయంత్రం హాజరుపరిచారు. న్యాయమూర్తి వారిని వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్‌కు తరలించారు. వారిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మంగళవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక నయీమ్ అనుచరుడు శామ్యూల్‌ను వనస్థలిపురం పోలీసులు పీటీ వారెంట్‌పై ఖమ్మం నుంచి తీసుకొచ్చి హయత్‌నగర్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. నయీమ్ డ్రైవర్ శ్రీధర్‌గౌడ్‌తో కలసి భూదందాలు అక్రమ వసూళ్ల కేసులో నిందితుడిగా ఉన్న శామ్యూల్‌ను ఖమ్మం నుంచి ఒడిశాకు పారిపోతుండగా భద్రాచలం వద్ద చర్ల పోలీసులు పట్టుకున్నారు. నయీమ్ కేసులో సిట్ పోలీసులు వనస్థలిపురం భాగ్యలతా కాలనీకి చెందిన నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నయీమ్ అనుచరుడు సామ సంజీవరెడ్డికి నరేందర్ సన్నిహితుడని సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన నరేందర్ విద్యార్థి దశలోనే హైదరాబాద్‌కు వచ్చి సామ సంజీవరెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నాడు. కొన్నేళ్ల కింద టీడీపీ నేత సామ రంగారెడ్డి వేడి వేడి నూనె పోసిన కేసులో సామ ప్రభాకర్‌రెడ్డితో పాటు నిందితుడిగా ఉన్నాడు.