భారత్‌ ఆయుధ బలం రష్యానే | Russia Pitches Massive Arms Deals to India | Sakshi
Sakshi News home page

భారత్‌ ఆయుధ బలం రష్యానే

Jul 9 2019 6:39 PM | Updated on Jul 13 2019 3:14 PM

Russia Pitches Massive Arms Deals to India - Sakshi

మాస్కో : భారత ఆయుధశ్రేణిలో అత్యధిక భాగం రష్యా తయారీవే. రైఫిల్స్‌ నుంచి యుద్ధ విమాన వాహకనౌకల వరకూ భారత్‌ సమకూర్చుకుంటున్న ప్రతి ఆయుధంలో రష్యా సహకారం ఉండాల్సిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో మనం వ్యూహాత్మకంగా అమెరికావైపు తప్పక నిలబడాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో ఇటీవల కాలంలో భారత్‌ చేసే ఆయుధాల కొనుగోళ్లలో రష్యా వాటా గణనీయంగా తగ్గుతోంది. ఇజ్రాయేల్‌, అమెరికా, ఫ్రాన్స్‌ తదితర దేశాలతో ఆయుధ కొనుగోళ్లు పెరుగుతున్నా ఇప్పటికీ రష్యానే భారత్‌కు అతిపెద్ద ఆయధాల అమ్మకందారు.

ఇప్పుడు కూడా భారత్‌ యుద్ధ విమానాల నుంచి సబ్‌మెరైన్‌ల వరకూ రష్యాతో భారీ ఆయుధ ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఐదవతరం ఫైటర్‌జెట్‌తో సహా అత్యాధునిక ఆయుధాల శ్రేణిని భారత్‌లోనే తయారుచేసేలా రష్యాతో డీల్‌ కుదుర్చుకునేలా చర్చలు ప్రారంభించింది. రష్యా సైతం భారత్‌ మార్కెట్‌ను కోల్పోవడానికి ఎప్పుడూ ఇష్టపడదు. భారత్‌ కొనుగోలు చేయాలనుకుంటున్న ఆరు డీజిల్‌ ఎలక్ట్రిక్‌ సబ్‌మెరైన్‌ల బిడ్‌లో రష్యా కూడా పాల్గొంది.  తన దగ్గర గల సబ్‌మెరైన్‌ ఆర్మర్‌-1650ని భారత్‌లోనే తయారీకి ఒప్పుకుంటామని చెప్తోంది. భారత్‌గానీ ఈ బిడ్‌ను తమకే ఇస్తే కేవలం వాటిని అ‍మ్మడమే గాక భారత్‌ భాగస్వామ్యంతో తయారుచేస్తామని అంటోంది. ఇతర దేశాలు తమ టెక్నాలజీనీ ఇవ్వడానికి ఇష్టపడని చోట మేం భారత్‌కు ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించింది. ఈ సబ్‌మెరైన్‌ల నిర్మాణం కూడా మరో విజయవంతమైన రష్యా-భారత్‌ తయారీ బ్రాహ్మోస్‌ కాగలదని విశ్వాసం వ్యక్తం చేసింది. 

ఇక భారత వాయుసేనలో కూడా మెజార్టీ వాటా రష్యా యుద్ధ విమానాలదే. మన గగనతలాన్ని శక్తివంతం చేసిన అత్యున్నత యుద్ధ విమానం సుఖోయ్‌-30తో సహా మిగ్‌ శ్రేణి విమానాలతో మన ఎయిర్‌బేస్‌లు నిండిపోయాయి. అయితే రఫేల్‌ కొనుగోలుతో యుద్ధవిమానాల విషయంలో మనం రష్యాకు దూరం జరిగినా, రష్యా తయారుచేస్తోన్న ఐదవతరం అత్యాధునిక సుఖోయ్‌-57 ఫైటర్‌జెట్‌లలో తొలి విదేశీ భాగస్వామ్య దేశం కచ్చితంగా భారతదేశమేనని రష్యా నమ్మకం. ఈ ఐదవ తరం అత్యాధునిక యుద్ధ విమానం కొనుగోలుపై భారత్‌ ప్రస్తుతం చర‍్చలు నిలిపివేసినా, రష్యా మాత్రం భారత్‌కు వీటి అమ్మకంపై ఆశాభావంతో ఉంది. అలాగే  110 తేలికపాటి యుద్ధ విమానాలు కొనడానికి భారత్‌ చేసిన ఫైనల్‌ లిస్ట్‌లో మిగ్‌-35 శ్రేణి విమానాలు ఉన్నాయి.

ఇరుదేశాలు ఇప్పటికే కలష్నికోవ్‌-200 రకం రైఫిల్స్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 7,50,000 రైఫిల్స్‌ కావాలని భారత్‌ ఆర్డర్‌ కూడా ఇచ్చింది. అలాగే టి-90 యుద్ధ ట్యాంకుల స్థానంలో అప్‌గ్రేడ్‌ చేసిన టి-90ఎమ్‌ఎస్‌ శ్రేణి కొనుగోలు కోసం 1.93 బిలియన్‌ డాలర్ల డీల్‌ ఇరుదేశాల మధ్య కుదిరింది. ఇక చివరిగా చెప్పుకోవాల్సింది ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థది. వీటిని కొనుగోలు చేయరాదంటూ అమెరికా తీవ్ర ఒత్తిడి చేస్తున్నా భారత్‌మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇలా భారత ఆయుధశ్రేణిని పరిపుష్టం చేయడంలో రష్యా పాత్ర కీలకమైంది. అందుకే భారత ప్రధాని మాటల్లో రష్యా మనకు సహజమిత్ర దేశం అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement