ఆమె ఇద్దరు దేశాధినేతలకు రహస్య భార్య??

ఆమె ఇద్దరు దేశాధినేతల భార్య?? - Sakshi


వాషింగ్టన్‌: మీరు 'మేడం గిసెల్లె యాజ్జి'ని కలిస్తే మాత్రం ఔరా అంటారు. ఆమె ఒక దేశాధ్యక్షుడికి రహస్య భార్య. మరో దేశాధినేతకు మాజీ సతీమణి.. అంతేకాదండోయ్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌కు టాప్‌ సీక్రెట్‌ సలహాదారు.. ఆమె చెప్పిన ఈ మాటలు నిజమే అని నమ్మని చాలామంది వెనెజులా ఆర్మీకి టీ-షర్ట్‌లు అమ్మే ప్రాజెక్టులో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. తీరా ఎంతకు ఫలితం రాకపోవడంతో ఆమె బాగోతం బయటపడింది. ఆమె పుట్టుపూర్వొత్తరాల గురించి తాజాగా 'ద వాషింగ్టన్‌ పోస్ట్‌' ఓ కథనాన్ని ప్రచురించింది.



వాషింగ్టన్‌లోని ఓ భారీ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఈ 'అందమైన సుందరాంగి' కల్లబొల్లి ఇరుగుపొరుగువారిని బురిడీ కొట్టించిన బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. తనకు తాను 'సౌందర్యవతి'గా అభివర్ణించుకునే ఆమె..చాలా తెలివిగా ఇరుగుపొరుగువారిని బుట్టలో వేసుకుంటుంది.  ఇరుగుపొరుగు వారితో ఈ కిలాడీ లేడీ చెప్పిన విషయాలు తెలుసుకుంటే విస్తుపోవాల్సిందే.. ఆమె ఇరుగుపొరుగు వారికి చెప్పిన వివరాలివి..



ఇవాంకా ట్రంప్‌కు నేను తల్లి-గురువులాంటి దానిని. వైట్‌హౌస్‌లో ఇవాంకా కార్యాలయం పక్కనే నా ప్రత్యేక కార్యాలయం ఉంది.

ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్‌ అల్‌ సిసి నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

ఇంతకుముందు వెనెజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావేజ్‌కి మాజీ భార్యను..

ట్రంప్‌-అల్‌ సిసి మధ్య తొలి ఫోన్‌కాల్‌ను నేనే ఏర్పాటుచేశాను

నాకు ప్రైవేటు జెట్‌ ఉంది. వాషింగ్టన్‌ డీసీ శివారులోని సంపన్నప్రాంతమైన ఫాక్స్‌ హాల్‌లో, స్పెయిన్‌లో, మ్యాన్‌హట్టన్‌లో నాకు పలు నివాసాలు ఉన్నాయి.

నాకు నెలకు 2.1 మిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తుంది.

వైట్‌హౌస్‌తో సన్నిహిత వ్యవహరించే నాకు అమెరికా సీక్రెట్‌ సర్వీసెస్‌తో కూడా సంబంధాలు ఉన్నాయి.



ఈ వాదనతో ఇరుగుపొరుగున ఉన్న సంపన్నులను బురిడీ కొట్టించిన యాజ్జీ వెనిజులా ఆర్మీకి టీ-షర్ట్స్‌ విక్రయించే ప్రాజెక్టు పేరుతో సంపన్నుల నుంచి డబ్బు గుంజింది. పలువురు సంపన్నులు ఆమె చెప్పినట్టు పెట్టుబడులు పెట్టినా.. ఎలాంటి ప్రతిఫలం రాకపోవడంతో ఆమె బాగోతం వెలుగులోకి వచ్చింది.



పేరుమోసిన కిలాడీ లేడీ!

మేడం గిసెల్లె యాజ్జి ఎవరా అని ఆరా తీయగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాజ్జీ అనే మారుపేరుతో సంపన్నులను మోసగిస్తున్న ఈ కిలాడి లేడి.. కొలంబియాను కుదిపేసిన ఓ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అని తెలిసిందే. గిసెల్లె జల్లార్‌ అనే మహిళ కొలంబియాలో వందలమందిని మోసగించి.. 1995 జున్‌లో జైలుపాలైంది. గర్భవతి కావడంతో ఏడు నెలల అనంతరం ఆమెను తిరిగి జైల్లో సరెండర్‌ అయ్యే షరతు మీద విడుదల చేశారు. కానీ, ఆమె తిరిగి రాలేదు. పరారీలో ఉన్న ఈ నేరస్తురాలు.. తీరా తాజాగా వాషింగ్టన్‌లో తిష్టవేసి.. ఏకంగా దేశాధినేతల పేర్లతో సంపన్నులను మోసం చేయడం గమనార్హం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top