భారతీయులకు ఈజీగా బ్రిటన్ వీసా | Sakshi
Sakshi News home page

భారతీయులకు ఈజీగా బ్రిటన్ వీసా

Published Mon, Nov 7 2016 2:47 PM

భారతీయులకు ఈజీగా బ్రిటన్ వీసా

న్యూఢిల్లీ : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆ దేశాన్ని కీలక వాణిజ్య భాగస్వామిగా మార్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్రెగ్జిట్ అనంతరం తొలిసారి భారత్కు విచ్చేసిన బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే, భారత వ్యాపారులకు సులభతరమైన వీసా పాలన అందిస్తామని ప్రకటించారు. ఇండియా-యూకే టెక్ సమిట్లో ప్రసంగించిన థెరిస్సా, భారతీయులు ఈజీగా బ్రిటన్లోకి ప్రవేశించడానికి తాము ఆఫర్ చేస్తామని, రిజిస్టర్డ్ ట్రావెలర్ స్కీమ్ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు తెలిపారు. దీంతో యూకేను తరుచూ సందర్శించేవారికి ఇది ఎంతో ఉపయోగపడనుందని పేర్కొన్నారు. బ్రిటన్, భారత్లకు మరిన్ని అవకాశాలు కల్పించాలనేదే తమ అభిప్రాయమని, వ్యాపారాలకు బ్రిటన్ ఎంతో అనువైనదని థెరిస్సా చెప్పారు.
 
సమర్థవంతమైన వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలకు కేవలం చట్టబద్ధమైన ఫ్రేమ్ వర్క్ మాత్రమే కాక, ఇరు దేశాల ప్రజలు కూడా అవసరమేనన్నారు. తమ దేశంలో వ్యాపారాలు కోసం ట్రావెల్ చేసేవారికి వీసా ప్రక్రియను సులభతరం చేస్తానని హామీ ఇచ్చారు.చాలామంది భారతీయులు తమ స్కిల్స్ను, ఐడియాలను, బిజినెస్లను బ్రిటన్కు తీసుకొస్తున్నారని, ఇది తమ దేశానికి, ఆర్థికవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. సీఐఐ నిర్వహించిన ఈ సమిట్లో ప్రధాని నరేంద్రమోదీ కూడా పాల్గొన్నారు. ఇండియాకు బ్రిటన్ ఎంతో ముఖ్యమైన స్నేహదేశమని వ్యాఖ్యానించిన మోదీ, ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక ఒప్పందాల్లో 'మేకిన్ ఇండియా'ను భాగం చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement