విషాద వాటికలో దోషుల సేవ

విషాద వాటికలో దోషుల సేవ - Sakshi


- బస్సు ప్రమాదం ఘటనలో ప్రభుత్వ బాధ్యతను మరచిన అధికారులు

- ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపై కేసులతో ఎదురుదాడి

- దివాకర్‌ ట్రావెల్స్‌ని కాపాడేందుకు ఆపసోపాలు

- కలెక్టర్‌ నుంచి రవాణా, పోలీసులు, వైద్యుల వరకూ ఇదే తీరు

- ప్రాథమిక అంశాలను గాలికొదిలి తూతూమంత్రంగా విచారణ
సాక్షి, అమరావతి బ్యూరో:
ఓ పెద్ద విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం.. పది కుటుంబాలలో అంతులేని వ్యథను మిగిల్చింది.. ఆ కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఆ ఘటనకు  కారణమేమిటో కనుక్కోవద్దా..? బాధ్యతెవరిదో తేల్చవద్దా..? బాధ్యులెవరో కనిపెట్టి తగిన చర్యలు తీసుకుంటే కదా అలాంటి మరో ముప్పు నుంచి మనమందరం తప్పించుకోగలుగుతాం..! అది ప్రభుత్వ కనీస బాధ్యత. అది అధికారయంత్రాంగం కనీస విద్యుక్తధర్మం. కానీ అందరూ కలసికట్టుగా దానిని అటకెక్కించారు. కూడబలుక్కుని దోషులను రక్షించేందుకు కంకణం కట్టుకున్నారు.సాక్ష్యాలు పట్టించుకోరు.. మృతదేహాలకు పోస్టుమార్టం చేయించరు. రెండో డ్రైవర్‌ లేకపోయినా ఉన్నట్లు కనికట్టు చేస్తారు. అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీకి చెందిన ట్రావెల్స్‌ ఇబ్బందుల్లో పడిపోతుందని ఇంతమంది ఇన్ని రకాలుగా రక్షించే ప్రయత్నించడం బహుశా ఇంకెక్కడా మనం చూసి ఉండం. డాక్టర్లు, పోలీసులు, రవాణాశాఖ అధికారులు.. చివరకు జిల్లా కలెక్టర్‌ ఇలా అందరూ ఒక్కతాటిపై ఒక్కమాటపై నిలబడి దోషుల సేవలో తరించడం చూసి జనం నివ్వెరపోతున్నారు.. ‘‘ఇదేం న్యాయం? బాధితులకు ఇంత అన్యాయం చేస్తారా? ఇది మీకు తగదు’’ అని అన్న పాపానికి ప్రతిపక్షనేతపై కేసులు మోపే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలో అరాచకపాలన ఏ స్థాయికి చేరుకుందో తెలుసుకునేందుకు కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన బస్సుప్రమాదం తాజా ఉదాహరణ..వైద్యులకిది తగునా...:?

మెడికో లీగల్‌ కేసుల్లో పోస్టుమార్టం అన్నది అత్యంత కీలకమైన అంశమని వైద్యులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నందిగామ ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు ఆ అంశానికి ప్రాధాన్యమివ్వకపోవడం విస్మయపరుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగినపుడు డ్రైవర్‌ తాగి ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవడం అతి ముఖ్యమైన అంశం. డ్రైవర్‌ బతికి ఉంటే బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించాలి. డ్రైవర్‌ మృతిచెందితే ఆయన శరీరభాగాలను పరిశీలించాలి. పోస్టుమార్టం చేయాలి. తుది నివేదిక కోసం నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాలి. కానీ దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం కేసులో వైద్యులు ఈ ప్రాథమిక అంశాలన్నీ విస్మరించారు.


పోలీసుల తీరూ అంతే...

సంచలనం సృష్టించిన ఇలాంటి కేసుల విచారణ సందర్భంలో పోలీసులు ఎంతో జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. రెండో డ్రైవర్‌ ఉన్నాడా? ఉంటే ఎవరు? అన్న విషయాన్ని పోలీసులు నిర్ధారించాలి. కానీ మంగళవారం మధ్యాహ్నం తరువాత తానే రెండో డ్రైవర్‌ని అంటూ ఒకరు వస్తే ఎలాంటి ఆధారాలూ సరిపోల్చుకోకుండా పోలీసులు సరేనన్నారు. కానీ ఆయన నిజంగా రెండో డ్రైవరా కాదా అనేది నిగ్గుతేల్చాలని భావించనే లేదు. అంతవరకు కనిపించని ఆ డ్రైవర్‌ హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చాడనే దిశగా విచారించనే లేదు. ప్రమాదం సంభవించి 24గంటల తరువాత కూడా రెండో డ్రైవర్‌ ఎవరన్నది పోలీసులు వెల్లడించలేదు.‘ట్రావెల్స్‌’ని కాపాడేందుకు రవాణా శాఖ తాపత్రయం

బస్సు ప్రమాదం కేసులో దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాన్ని కాపాడేందుకు రవాణా శాఖ అధికారులు శతవిధాలుగా ప్రయత్నించడం అనుమానాలకు తావిస్తోంది. డ్రైవర్‌ తాగి బస్సు నడపడం వల్ల ప్రాణనష్టం సంభవిస్తే ట్రావెల్స్‌ యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. డ్రైవర్‌ తాగి బస్సు నడిపాడా? లేక మరో కారణం వల్ల ప్రమాదం జరిగిందా అనేది పోస్టుమార్టం సవ్యంగా జరిగితే తేలే అవకాశం ఉండేది. మంగళవారం మధ్యాహ్నం 3గంటలవరకు డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోయినా అధికారులు పట్టించుకోనే లేదు. పైగా ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చే వరకూ కూడా ఆగకుండానే బుధవారం నాడు హడావిడిగా ఓ ప్రకటన విడుదల చేసేశారు. డ్రైవర్‌ తాగి లేడని వారంతట వారు తేల్చేశారు. ప్రమాదానికి ముందు డ్రైవర్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది? మరో కీలకమైన అంశం.  బీపీ, గుండెపోటు, కంటిచూపు ఇతరత్రా సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారికే విధులు అప్పగించాలి. అందుకోసం ట్రావెల్స్‌ యాజమాన్యం తమ డ్రైవర్లకు క్రమంతప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మరి దివాకర్‌ ట్రావెల్స్‌ ఆ నిబంధనలను పాటిస్తోందా లేదా అన్నది రవాణా శాఖ అధికారులు పట్టించుకోనే లేదు. ప్రమాదానికి గురైన బస్సుకు రెండో డ్రైవర్‌ ఉన్నారా?.. ఉంటే ఎవరు? కీలకమైన ఈ అంశాన్ని రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడమే లేదు. ప్రమాదం సంభవించిన చాలాసేపటి వరకు రెండో డ్రైవర్‌ ఎవరన్నది ఎవరూ చెప్ప లేదు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల తరువాత ఒకర్ని తీసుకువచ్చి ఆయనే రెండో డ్రైవర్‌ అని చూపించారు. ప్రమాదం సంభవించినప్పుడు రెండో డ్రైవర్‌ బస్సు కింది భాగంలో ఉన్న డిక్కీలో నిద్రపోతున్నారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బస్సు రన్నింగ్‌లో ఉన్నప్పుడు డిక్కీలో రెండో డ్రైవర్‌ నిద్రపోవడం అసాధ్యమని సీనియర్‌ ఆర్టీవో ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. తన 15ఏళ్ల అనుభవంలో ఇలాంటి విషయాన్ని చూడలేదని ఆయన చెప్పారు. గమ్యస్థానంలో బస్సును నిలిపి ఉన్నప్పుడు డీక్కీ తెరచి అందులో నిద్రించవచ్చన్నారు.అంతేగానీ బస్సు ప్రయాణిస్తున్నప్పుడు డిక్కీలో నిద్రపోవడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఏమాత్రం గాలి కూడా అందని డిక్కీలో ఉండలేరన్నారు. డ్రైవర్‌ సీటు వెనుకభాగంలోనే రెండో డ్రైవర్‌ విశ్రాంతి తీసుకునేందుకు బెర్త్‌ ఉంటుందన్నారు. దీంతో ప్రమాదానికి గురైన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సుకు రెండో డ్రైవర్‌ ఉన్నారా అన్నది సందేహాస్పదంగా మారింది. రెండో డ్రైవర్‌ లేరన్న విషయాన్ని నిర్ధారిస్తే ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రమాదానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం రెండో డ్రైవర్‌ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తడంతో అధికారులు గతుక్కుమన్నారు. రెండో డ్రైవర్‌ పోలీసుల అదుపులో ఉన్నారని బుధవారం ఉదయం ప్రకటించారు.కలెక్టర్‌ అలా ఎందుకు వ్యవహరించారు?

ఏదైనా ప్రమాదంగానీ విపత్తుగానీ సంభవిస్తే సంబంధిత అన్ని విభాగాలను సమన్వయపరుస్తూ తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌దే.  ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు శాస్త్రీయంగా చర్యలు చేపట్టారా లేదా అన్నది కలెక్టర్‌ పరిశీలించాలి. ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించాల్సిన బాధ్యత పోలీసు అధికారులది. పోస్టుమార్టం చేయాల్సింది వైద్యులు. పోలీసులు, వైద్యులు ఆ విధంగా వ్యవహరించకపోతే కలెక్టర్‌ స్పందించాలి. పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించాలి. జిల్లా మేజిస్ట్రేట్‌గా ఆయనకు విచక్షణాధికారాలు ఉన్నాయి. కానీ దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద అనంతరం కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఎ.బాబు. ఆ అంశానికే ప్రాధాన్యమివ్వలేదు.ఉదయం 5.45గంటలకు ప్రమాదం సంభవించింది. దాదాపు 10గంటల సమయంలో డ్రైవర్‌ మృతదేహం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. కలెక్టర్‌ బాబు దాదాపు మధ్యాహ్నం 1గంట సమయంలో ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ సాయంత్రం 3 గంటలకు ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వచ్చేవరకు కూడా డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయనే లేదు. జగన్‌మోహన్‌రెడ్డి అడిగినపుడు ఆ విషయాన్ని వైద్యులే చెప్పారు. డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని కలెక్టర్‌ ఆదేశించకపోవడం, పైగా జగన్‌ అడిగితే అన్ని మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని చెప్పడం ప్రశ్నార్థకంగా మారాయి. పోస్టుమార్టం చేయకుండానే డ్రైవర్‌ మృతదేహాన్ని ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి తరలించేందుకు అధికారులు ఎందుకు ఏర్పాట్లు చేసినట్లు?

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top