గోవా కాంగ్రెస్‌లో చీలికలు | splits in goa congress party, candidates not yet decided | Sakshi
Sakshi News home page

గోవా కాంగ్రెస్‌లో చీలికలు

Jan 11 2017 6:54 PM | Updated on Aug 14 2018 9:04 PM

గోవా కాంగ్రెస్‌లో చీలికలు - Sakshi

గోవా కాంగ్రెస్‌లో చీలికలు

అధికారంలోకి రాకముందే గోవాలో కాంగ్రెస్‌ పార్టీ ముక్కలుగా విడిపోయి కొట్టుకుంటోంది.

కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే పొట్టు తీసిన నారింజపండులా ముక్కలుగా విడిపోతుందని బీజీపీ సీనియర్‌ నాయకుడు మురళీ మనోహర్‌ జోషి ఎప్పుడూ విమర్శించేవారు. ఇప్పుడు అధికారంలోకి రాకముందే గోవాలో కాంగ్రెస్‌ పార్టీ ముక్కలుగా విడిపోయి కొట్టుకుంటోంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఏ పార్టీతో పెట్టుకోకూడదు, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోవాలా, ఎన్నికల తర్వత పొత్తు పెట్టుకోవాలా? లేదా ఒంటరిగానే పోటీచేయాలా? అన్న అంశాలపై పార్టీలోని నలుగురు నేతలు నాలుగు విధాలుగా ఆలోచిస్తున్నారు. ఒకరి అభిప్రాయంతో ఒకరికి పొసగడం లేదు. 
 
రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు లూజిన్హో ఫాలిరో చిన్న చిన్న సర్దుబాట్లు మినహా పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని గట్టిగా కోరుతున్నారు. రాష్ట్రంలో చివరి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అయిన దిగంబర్‌ కామత్‌ మాత్రం నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ), గోవా ఫార్వర్డ్‌ (జీఎఫ్‌), యునైటెడ్‌ గోవన్‌ పార్టీ (యూజీపీ)లతో ఎన్నికలకు పొత్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. కామత్‌కు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ప్రతాప్‌ సింగ్‌ రాణె కుమారుడు, బలమైన యువజన నాయకుడు, ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన విశ్వజిత్‌ రాణెతోపాటు మరో ఎమ్మెల్యే రెగినాల్డ్‌ లారెంకో మద్దతు ఉంది. గోవా ఫార్వర్డ్‌ పార్టీతోనైనా ముందస్తు ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని కామత్‌ డిమాండ్‌ చేస్తున్నారు. 
 
కామత్‌ డిమాండ్‌కు గోవా పార్టీ వ్యవహారాలకు బాధ్యుడిగా వ్యవహరిస్తున్న దిగ్విజయ్‌ సింగ్‌ కూడా సానుకూలంగా ఉన్నారు. రాహుల్‌ గాంధీ విశ్వాసంలోకి తీసుకునే కొంతమంది సీనియర్లలో దిగ్విజయ్‌ సింగ్‌ ఒకరనే విషయం తెల్సిందే. మరోపక్క కామత్‌తో విభేదిస్తున్న ఫాలిరోకు సోనియా గాంధీ అండదండలున్నాయి. ఆయన ఇటీవలనే సోనియాను కలసుకొని వచ్చారు. సోనియా సూచన మేరకే ఆయన పార్టీ జాతీయ రాజకీయాల నుంచి పార్టీ రాష్ట్ర రాజకీయాలకు మారారు. ఫాలిరో ఇంతకుముందు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యనాయకులైన వీరిద్దరితో పాటు పార్టీలో మరో రెండు వర్గాలు కూడా పొత్తుల విషయంలో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నాయి. 
 
గోవాలోని 40 సీట్ల కోసం ఈరోజే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. 40 మందికిగాను ఇప్పటి వరకు 15 మందిని మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేయగలిగింది. మిగతా అభ్యర్థుల విషయాల్లో నలుగురు మాజీ సీఎంలు, వారి బంధువుల మధ్య రాజీ కుదరడం లేదు. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ గాంధీ, సోనియాల నేతృత్వంలో కేంద్ర పార్టీ ఎన్నికల సంఘం రంగప్రవేశం చేసి జాబితాను సిద్ధం చేయాలనుకుంటోంది. నేడో, రేపో ఈ ఎన్నికల సంఘం సమావేశం కానున్నట్లు సమాచారం. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కొల్లగొట్టేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తన అంతర్గత విభేదాలను సకాలంలో పరిష్కరించుకోకపోతే ప్రమాదమే. ఫిబ్రవరి నాలుగో తేదీన గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement