రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో పార్టీ అధిష్టానం పెద్దలతోపాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గురు, శుక్రవారాల్లో ఢిల్లీ యాత్ర చేపట్టనున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో పార్టీ అధిష్టానం పెద్దలతోపాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గురు, శుక్రవారాల్లో ఢిల్లీ యాత్ర చేపట్టనున్నారు. విభజన విషయంలో కేంద్రం దూకుడు పెంచినందున తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రపతిని ఆశ్రయించాలని వారు నిర్ణయించారు. మొదటి నుంచీ రాష్ట్ర సమైక్యతనే కోరుకుంటున్నామని, కానీ తమ అభిప్రాయంతో సంబంధం లేకుండానే కాంగ్రెస్ అధిష్టానం ఏకపక్షంగా విభజన నిర్ణయాన్ని తీసుకుందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని తలపోస్తున్నారు. విభజనపై కేంద్రం ముందుకు వెళ్లినా.. బిల్లు ఆమోదం కోసం వచ్చినప్పుడు ఆమోదించకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని రాష్ట్రపతికి విన్నవించాలని వారు భావిస్తున్నారు.
ఈ మేరకు 24, 25వ తేదీల్లో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రాష్ట్రపతిని కలవనున్నారు.
అన్ని పార్టీలు పునరాలోచనలో పడ్డాయి: రాష్ట్ర విభజన అంశంపై రాష్ట్రం లోని పార్టీలే కాకుండా జాతీయ పార్టీలు కూడా పునరాలోచనలో పడ్డాయని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాదని తెలుస్తోందని, కేంద్రం నిర్ణయాన్ని అది వ్యతిరేకించే పరిస్థితి ఉందని గంటా చెప్పారు. ఇతర పార్టీలు కూడా విభజనపై వ్యతిరేక అభిప్రాయానికి వస్తున్నందు న తెలంగాణ ప్రక్రియ నిలిచిపోతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వాటి ఫలితాల ప్రభావం కూడా దీనిపై పడుతుందన్నారు.
పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి రాకపోవచ్చు: నటుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తారని తాను భావించడం లేదని గంటా అభిప్రాయపడ్డారు. ‘‘చిరంజీవి తన హయాంలో మెగాస్టార్‌గా ఉన్నారు. ఇప్పుడాయన రాజకీయాల్లోకి వచ్చేశారు కనుక ఆ స్థానాన్ని పవర్ స్టార్ ఆక్రమించారు. ఆయన అన్ని ప్రాంతాల్లో మంచి ఇమేజ్ సంపాదించుకొని ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన రాజకీయాల్లోకి వస్తారని నేను భావించడం లేదు’’అని మంత్రి పేర్కొన్నారు.