పుడితే పుతిన్‌కు చెఫ్‌గా పుట్టాలి | Russia President Vladimir Putin chef is billionaire | Sakshi
Sakshi News home page

పుడితే పుతిన్‌కు చెఫ్‌గా పుట్టాలి

Oct 8 2016 8:00 PM | Updated on Sep 4 2017 4:40 PM

పుడితే పుతిన్‌కు చెఫ్‌గా పుట్టాలి

పుడితే పుతిన్‌కు చెఫ్‌గా పుట్టాలి

మరో జన్మంటూ ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటవాడై పుట్టాలని ఎవరైనా కోరుకుంటారేమో!

మాస్కో: మరో జన్మంటూ ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటవాడై పుట్టాలని ఎవరైనా కోరుకుంటారేమో! ఎందుకంటే ఆయనకు ప్రధాన చెఫ్‌గా పనిచేస్తున్న ఎవజెనీ ప్రిగోజిన్ (55)కు లెక్కలేనన్ని ఆస్తులున్నాయి. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 75 కోట్ల రూపాయల భారీ భవంతితోపాటు ప్రైవేటు జెట్ విమానం, ఆ విమానం రాకపోకల కోసం ఆ భారీ భవంతిలోనే ఓ ప్రత్యేక హెలిప్యాడ్ ఉంది. కూతురు పోలిన, కొడుకు పావెల్ సరదాగా సముద్ర జలాలపై విహరించేందుకు 44 కోట్ల రూపాయల విలువైన 121 అడుగుల పడవ (యాట్) ఉంది. అందులో ఆరు పడక గదులే కాకుండా కిచెన్‌తోపాటు, రెండు టెర్రెస్‌లు, ఓ స్మిమ్మింగ్ ఫూల్, కార్మికుల కోసం ఓ డెక్, వారి కోసం ప్రత్యేక కిచెన్ ఉన్నాయి. ప్రిగోజిన్‌కు నల్ల సముద్రం పక్కనున్న గెలెన్‌జిక్‌లో కొండ శిఖరంపైన విలాసవంతమైన విశ్రాంతి భవనం కూడా ఉంది. దాని విలువెంతో వెలుగులోకి రాలేదు. ఆ ప్రాంతంలోనే పుతిన్‌కు కూడా ఓ రహస్య ప్యాలెస్ ఉందనే ప్రచారం ప్రజల్లో ఉంది.

పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రిగోజిన్ తన కూతురు పోలిన వివాహాన్ని కూడా ఇటీవల అంగరంగ వైభవంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి చేశారు. సెయింట్ పీటర్సబర్గ్‌లో రోమనోవా రాజ కుటుంబీకులు నిర్మించిన అతి పెద్ద ప్యాలెస్‌లో ఈ వివాహం జరిగింది. ఇందులో పుతిన్ నివసిస్తున్నందున దీన్ని ఇప్పుడు పుతిన్ ప్యాలెస్ అని పిలుస్తున్నారు. పెళ్లి రోజున ప్యాలెస్ రూఫ్‌లను కూడా సహజసిద్ధమైన పూలతో అలంకరించడాన్ని స్థానిక పత్రికలన్నీ విశేషంగా పేర్కొన్నాయి. ఎన్ని కోట్ల రూపాయలు పెడితే మాత్రం ఇన్ని వేల కోట్ల పువ్వులు ఎక్కడ తేగలమని అవి వ్యాఖ్యానించాయి.

పుతిన్ ప్రధాన చెఫ్‌గా పనిచేస్తున్న ప్రిగోజిన్ మొదటి నుంచి డబ్బున్న వ్యక్తేమి కాదు.  1979లో ఓ దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్లివచ్చారు. 1990 దశకంలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో హాట్ డాగ్స్ అమ్ముకుంటూ బతికేవారు. అప్పుడు తన వ్యాపారం నడుపుకోవడం కోసం మాఫియాకు లంచాలు కూడా ఇచ్చేవారట. 2001లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఆ రెస్టారెంట్‌ను దేశాధ్యక్షుడైన కొత్తల్లో పుతిన్ అనుకోకుండా అక్కడికి పోవడంతో ఆయన జాతకమే మారిపోయింది. అక్కడి ఆహారం తనకు నచ్చడంతో తరచుగా పుతిన్ తన కారు డ్రైవర్ ద్వారా ఆ రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని తెప్పించుకునేవారు. అలా కారు డ్రైవర్‌ను పరిచయం చేసుకున్న ప్రిగోజిన్, పుతిన్‌తో పరిచయం పెంచుకొని పుతిన్ ప్యాలెస్‌లో ప్రధాన చెఫ్‌గా చేరిపోయారు.

సహజంగా మాటకారి అయిన ప్రిగోజిన్ ‘ట్రోల్ ప్యాక్టరీస్’ ద్వారా పుతిన్‌కు సన్నిహితమయ్యారు. 2014లో అన్‌లైన్ ద్వారా ప్రచారంలోకి వచ్చిన ఈ పదానికి అర్థం దొంగ ఖాతాల ద్వారా సోషల్ నెట్‌వర్కుల్లో, ఆన్‌లైన్ న్యూస్ పేపర్లలో, వీడియో పోస్టింగ్‌ల ద్వారా కావాల్సిన వ్యక్తులకు ప్రచారం కల్పించడం. ఇప్పుడు ఈ సైట్లలో పుతిన్‌కు ప్రిగోజిన్ విశేష ప్రచారాన్ని కల్పిస్తున్నారన్నది రష్యాలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమ కార్యకర్త అలెక్సీ నావల్ని ఆరోపణ.

దేశవ్యాప్తంగా సైన్యానికి, మాస్కోలోని అన్ని పాఠశాలలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహారాన్ని సరఫరా చేసే కాంట్రాక్టుల ద్వారానే ప్రిగోజిన్ బిలియనీర్‌గా మారారు. పుతిన్ సౌజన్యంతోనే ఆయన 2,500 కోట్ల రూపాయల ఫుడ్ కాంట్రక్ట్‌ను పొందారని అలెక్సీ ఆరోపిస్తున్నారు. ఇది ఓ కింది స్థాయి నుంచి పైస్థాయికి ఎదిగిన ఓ వ్యక్తి విజయగాథ కాదని, అవినీతికి అంటకాగడం వల్లన దొడ్దిదారిలో పైకొచ్చిన అక్రమార్కుడి కథని, ఈ కథపై అవినీతి నిరోధక అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement