
ప్రపంచ శాంతి, సుస్థిరతకు భారత్–రష్యా సంబంధాలే మూలస్తంభం
ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటన
చైనాలోని తియాంజిన్‌లో రష్యా అధినేత పుతిన్‌తో భేటీ
ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతల చర్చలు
తియాంజిన్: ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు భారత్–రష్యా సంబంధాలే మూలస్తంభమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం రెండు దేశాలు భుజం భుజం కలిపి పనిచేస్తాయని, ఉమ్మడిగా ముందుకెళ్తాయని అన్నారు. చైనాలోని తియాంజిన్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం రష్యా అధినేత పుతిన్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఆర్థికం, ఇంధనం, ఎరువులు, వాణిజ్యం, అంతరిక్షం, సాంస్కృతిక, భద్రత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు జరిగాయి. పుతిన్‌తో సమావేశం అనంతరం మోదీ మాట్లాడారు.
ఈ ఏడాది డిసెంబర్‌లో పుతిన్ ఇండియాలో పర్యటించబోతున్నారని, ఆయనకు స్వాగతం పలకడానికి 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. భారత్, రష్యా మధ్యనున్న ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని చెప్పారు. భారత్–రష్యా బంధం కేవలం ఇరుదేశాల ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా కీలకమేనని వివరించారు.
అది మానవాళి కోరిక
ఉక్రెయిన్‌లో శాంతి సాధన కోసం ఇటీవల జరిగిన ప్రయత్నాలను మోదీ స్వాగతించారు. ఉక్రెయిన్‌లో ఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరపడాలని ఆకాంక్షించారు. ఇందుకోసం భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించాలన్నారు. అక్కడ యుద్ధం ముగిసి, శాశ్వత శాంతి నెలకొనాలన్నది మొత్తం మానవాళి కోరిక అని ఉద్ఘాటించారు. పుతిన్‌తో భేటీ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
కారులో పుతిన్‌తో కలిసి ప్రయాణిస్తున్న ఫొటోను షేర్ చేశారు. రష్యా అధ్యక్షుడితో అద్భుతమైన చర్చ జరిగిందని పేర్కొన్నారు. కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారం సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నామని వివరించారు.
బహుముఖ సంబంధాల్లో చురుగ్గా పురోగతి: పుతిన్
భారత్‌తో బంధానికి ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పుతిన్ పునరుద్ఘాటించారు. భారత్–రష్యా సంబంధాలు ప్రత్యేక, విశేష వ్యూహా త్మక భాగస్వామ్యం స్థాయికి చేరడం ఆనందంగా ఉందన్నారు. రెండు దేశాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు. రెండు దేశాల బహుముఖ సంబంధాలు చురుగ్గా పురోగతి సాధిస్తూనే ఉంటాయన్నారు. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు పూర్తి సానుకూలంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
బహుళ స్థాయి సహకార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, రెండు దేశాల మధ్య పర్యాటకుల మారి్పడి నానాటికీ వృద్ధి చెందుతోందని, ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్, జీ20, ఎస్సీఓ తదితర అంతర్జాతీయ వేదికలపై సన్నిహితంగా, సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని పుతిన్ వెల్లడించారు. ముఖ్యమైన రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షికబంధంపై మోదీ, పుతిన్ సంతృప్తి వ్యక్తంచేశారని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇరుదేశాల మధ్య ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని వారు నిర్ణయానికొచ్చినట్లు పేర్కొంది.
ఒకే కారులో మోదీ, పుతిన్ ప్రయాణం
తియాంజిన్‌లో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రష్యాలో తయారైన అరుస్ లిమోజిన్ కారులో ఇరువురు నేతలు ఎస్సీఓ సదస్సు వేదిక నుంచి రిట్జ్–కార్ల్‌టన్ హోటల్‌కు చేరుకున్నారు. ఇరువురు నేతలు ఒకే కారులో కలిసి ప్రయాణించడం, సన్నిహితంగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
మోదీ, పుతిన్ మధ్య వ్యక్తిగత, వ్యూహాత్మక స్నేహ సంబంధాలకు ఈ ఘటన నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. పుతిన్‌తో సంభాషణ ఎల్లప్పుడూ అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. మోదీతో కలిసి ప్రయాణించాలని మొదట పుతిన్ కోరుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మోదీ రాక కోసం ఆయన ఎస్సీఓ వేదిక వద్ద 10 నిమిషాల పాటు వేచి చూశారు.
హోటల్‌కు చేరుకున్న తర్వాత కూడా కారులోనే 45 నిమిషాలపాటు మాట్లాడుకోవడం విశేషం. అనంతరం హోటల్ లోపల ద్వైపాక్షిక సమావేశం జరిగింది. అంతకుముందు ఎస్సీఓ వేదిక వద్ద మోదీని పుతిన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. పుతిన్‌ను కలుసుకోవడం నాకు సదా ఆనందదాయకం అని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మోదీ, పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్ కలిసి ఉన్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.