మరో దఫా రేటు కోత?

RBI Leverage Policy Review on 4th - Sakshi

4న ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష   

విశ్లేషకుల అభిప్రాయం

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన పరపతి కమిటీ అక్టోబర్‌ 4వ తేదీన మరోదఫా రేటు కోత నిర్ణయాన్ని ప్రకటించనుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచీ మూడు రోజుల పాటు ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో.  జనవరి నుంచీ వరుసగా నాలుగు ద్వైమాసిక సమీక్షల్లో రెపో రేటును ఆర్‌బీఐ 1.1 శాతం (0.25+0.25+0.25+0.35) తగ్గించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్‌బీఐ వరుస రెపో రేట్ల కోతకు ప్రాధాన్యత ఇస్తోంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం రేటు 4 శాతం దిగువన నిర్దేశిత లక్ష్యాల లోపు కొనసాగుతుండడం రెపో రేటు కోతకు కలిసి వస్తున్న అంశం.

ఈ నేపథ్యంలోనే మరో దఫా రేటు కోతకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్య పరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో కేంద్రం ఉద్దీపన చర్యలకు అవకాశం లేదుకానీ, రెపో రేటు తగ్గింపునకు కొంత వీలుందని ఇటీవలే స్వయంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ పేర్కొనడం గమనార్హం. కార్పొరేట్‌ పన్ను కోతసహా ఆర్థికాభివృద్ధికి కేంద్రం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. దీనితోపాటు దేశంలో పండుగల వాతావరణం ఉంది.

ఆయా పరిస్థితుల్లో డిమాండ్‌ పెంపునకు 4వ తేదీన మరోదఫా రేటు కోత నిర్ణయం వెలువడుతుందన్నది పలువురి విశ్లేషణ. కాగా బ్యాంకులు తమకు అందివచ్చిన రెపో కోత ప్రయోజనాన్ని బ్యాంకర్లు కస్టమర్లకు బదలాయించడం లేదన్న విమర్శలకు చెక్‌ పెట్టడానికి ఇప్పటికే ఆర్‌బీఐ  కీలక చర్య తీసుకుంది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ బ్యాంకులు తమ రుణ రేట్లను తప్పనిసరిగా రెపో, తదితర ఎక్స్‌టర్నల్‌ రేట్లకు బదలాయించాలని ఆర్‌బీఐ ఇప్పటికే ఆదేశించింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top