స్మృతి ఇరానీ చేయలేనిది జవదేకర్‌ చేశారు! | Sakshi
Sakshi News home page

స్మృతి ఇరానీ చేయలేనిది జవదేకర్‌ చేశారు!

Published Sat, Oct 8 2016 3:19 PM

స్మృతి ఇరానీ చేయలేనిది జవదేకర్‌ చేశారు!

న్యూఢిల్లీ: వివాదాస్పద నాయకురాలు స్మృతి ఇరానీ నుంచి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పగ్గాలు చేపట్టిన జవదేకర్‌ తనదైన నిర్ణయాలతో ముందుకెళుతున్నారు. దేశంలోని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లు అయిన ఐఐఎం (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌)కు మరింతగా స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చే నూతన బిల్లుకు జవదేకర్‌ ఆమోదం తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఐఐఎం బిల్లులో ప్రతిపాదించిన మార్పులన్నింటినీ ఆయన అంగీకరించారు. గతంలో హెచ్చార్డీ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ ఐఐఎంలకు ఇప్పుడు ఉన్నదాని కన్నా ఎక్కువ స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వడానికి అంగీకరించలేదు. తాజా ప్రతిపాదనల ప్రకారం ఐఐఎంలన్నింటికి సంబంధించిన బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (బీవోజీ) చైర్మన్‌ నియామకంలోనూ ప్రభుత్వ పాత్ర ఉండకూడదన్న అంశానికి కూడా హెచ్చార్డీ ఆమోదం తెలిపింది.

గతంలో జూలైలో స్మృతి నుంచి జవదేకర్‌ హెచ్చార్డీ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐఐఎం బిల్లులో పలు సవరణలు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ సవరణలకు సంబంధించిన సప్లిమెంటరీ  కేబినెట్‌ నోట్‌ను హెచ్చార్డీ ఇప్పటికే కేబినెట్‌ ముందు ఉంచింది. తాజా ముసాయిదా బిల్లు ప్రకారం ఐఐఎంలు స్వతంత్రంగా తమ డైరెక్టర్లను నియమించుకోవచ్చు. ప్రస్తుతం సెలెక్షన్‌ కమిటీ కుదించిన జాబితాలోని పేర్లలో ఒకరిని డైరెక్టర్‌గా కేంద్ర నియామకాల కేబినెట్‌ కమిటీ నియమిస్తూ వస్తున్నది. అదేవిధంగా ఐఐఎంల బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (బీవోజీ)కు సాధికారిత కల్పించేందుకు బిల్లు అంగీకరించింది. ఇక నుంచి కుదించిన జాబితాలోని పేర్లలో ఒకరిని డైరెక్టర్‌గా నియమించే అధికారం బీవోజీకి కల్పించనున్నారు.

Advertisement
Advertisement