బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ‘రేప్ వ్యాఖ్యల’ వివాదం ఇంకా ఆన్ లైన్ ను కుదిపేస్తూనే ఉంది.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ‘రేప్ వ్యాఖ్యల’ వివాదం ఇంకా ఆన్ లైన్ ను కుదిపేస్తూనే ఉంది. ’సుల్తాన్’ సినిమా షూటింగ్ చేసే సమయంలో తన పరిస్థితి ‘రేప్ కు గురైన మహిళ’లా ఉండేదని సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వివాదంపై బాలీవుడ్ ప్రముఖులు చాలామంది సేఫ్ జోన్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకరిద్దరు మినహా ఇంతవరకు బాలీవుడ్ ప్రముఖులెవరూ సల్మాన్ వ్యాఖ్యలను ఖండించలేదు. రేణుకా సహనే, సోనా మోహపాత్ర, కంగన రనౌత్ వంటి ఇద్దరు ముగ్గురు మాత్రమే ఈ వ్యాఖ్యలపై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కాగా, బాలీవుడ్ నటి, దర్శకురాలు పూజాబేడి మాత్రం సల్మాన్ ఖాన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ‘సల్మాన్ వ్యాఖ్యలను వివాదాస్పదం చేయడం సమంజసమా? ఏనుగులా నేను లావుగా ఉన్నాను అంటే నాపై పెటా కేసు పెడుతుందా? భారత్ మరీ సున్నితంగా మారిపోతున్నది’ అంటూ పూజాబేడి ట్వీట్ చేసింది.
అయితే, ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. సల్మాన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన ఆమె తీరును తప్పుబడుతూ పలువురు ట్విట్టర్ లో కామెంట్ చేశారు. ‘ఒక మహిళవై ఉండి సల్మాన్ కు మద్దతుగా మాట్లాడటం సిగ్గుపడాల్సిన విషయం. అత్యాచారానికి గురైన మహిళలు అనుభవించే క్షోభ మాటలకు అందనిది. దానిని దేనితోటి పోల్చలేం’ అని నెటిజన్ అభిప్రాయపడగా.. ‘భారత్ లో ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉండటానికి నీలాంటి వ్యక్తులే కారణం. సమస్యను నిరాకరించే తత్వమే ఇందుకు కారణం’ అని మరొకరు ట్వీట్ చేశారు.