
ఎన్నికల సంఘం ఓపెన్ చాలెంజ్!
ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో జాతీయ ఎన్నికల సంఘం బహిరంగ సవాల్ కు సిద్ధమవుతోంది.
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో జాతీయ ఎన్నికల సంఘం బహిరంగ సవాల్ కు సిద్ధమవుతోంది. ట్యాంపరింగ్ ఆరోపణలు నిరూపించాలని రాజకీయ పార్టీలు, టెక్నోక్రాట్స్, సంఘాలను ఆహ్వానించాలని ఈసీ నిర్ణయించింది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నవారెవరైనా తమ సవాల్ ను స్వీకరించొచ్చని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
‘ఓపెన్ చాలెంజ్ కు త్వరలోనే తేదీ ప్రకటిస్తాం. 2009లోనూ ఇదేవిధంగా బహిరంగ సవాల్ విసిరాం. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలను ఎవరూ నిరూపించలేకపోయారు. ఈవీఎంల పనితీరుపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఓపెన్ చాలెంజ్ కు సిద్ధమవుతున్నామ’ని ఈసీ వర్గాలు వెల్లడించాయి.
72 గంటల సమయమిస్తే ఈవీఎంల సాఫ్ట్‌వేర్ ఏమిట,? దానిని ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో వెల్లడిస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించిన సంగతి తెలిసిందే.